మోడీని ఢీ కొట్టే ఛాన్స్ ఉన్న‌ట్టే.. కానీ..!

Update: 2022-07-22 08:46 GMT
రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు ముగిశాయి. ఫ‌లితం కూడా వ‌చ్చేసింది. ఇక‌, ఇప్పుడు త‌ర్వాత స్టెప్ ఏంటి? ఇదీ.. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీని వ్య‌తిరేకిస్తున్న ప్ర‌తిప‌క్ష పార్టీల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ‌. ఎందుకంటే.. వారు అనుకున్న విధంగా అయితే.. రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌లేదు. దాదాపు ఏక‌ప‌క్షంగానే బీజేపీ అభ్య‌ర్థి ముర్ము విజ‌యం ద‌క్కించుకున్నారు. తొలి రౌండ్ నుంచి కూడా ప్ర‌తిప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థి య‌శ్వంత్ సిన్హా వెనుక‌బ‌డ్డారు. ఈ ప‌రిణామాల‌పైనే ప్ర‌తిప‌క్షాలు అంత‌ర్మ‌థ‌నం చెందుతున్నాయి.

అయితే.. య‌శ్వంత్‌కు వ‌చ్చిన ఓట్లు.. భ‌విష్య‌త్తులో తాము వేయ‌బోయే అడుగుల‌పై ఒకింత ఆశ‌లు మొల కెత్తిస్తున్నాయ‌నేది వాస్త‌వం. ఎందుకంటే.. బీజేపీ అభ్య‌ర్థి ముర్ము.. 2824 ఓట్లు(ఎంపీలు+ఎమ్మెల్యేల‌వి క‌లిపి) సాధించారు. అదేస‌మ‌యంలో య‌శ్వంత్... 1877 ఓట్లు(ఎంపీలు+ఎమ్మెల్యేల‌వి క‌లిపి) సాధించారు. ఇద్ద‌రి మ‌ధ్య 950 ఓట్లు మాత్ర‌మే తేడా ఉంది. వాస్త‌వానికి 100 నుంచి 150 ఓట్ల తేడా వ‌స్తుంద‌ని.. ప్ర‌తిప‌క్ష పార్టీల కీల‌క నాయ‌కులు అంచ‌నా వేశారు. కానీ, దీనికి విరుద్ధంగా ఓటింగ్ జ‌రిగింది.

చాలా రాష్ట్రాల్లో ప్ర‌తిప‌క్షాల ఎంపీలు.. ఎమ్మెల్యేలు.. చివ‌రి నిముషంలో ముర్ముకు మ‌ద్ద‌తుగా నిలిచాయి. దీంతో ఆమె గెలుపు న‌ల్లేరుపై న‌డ‌క అన్న విధంగా సాగిపోయింది. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే.. ఇప్పుడు ఏం చేయాలి?  వ‌చ్చే ఎన్నిక‌ల్లో మోడీని ఎలా ఢీ కొట్టాల‌నేది ప్ర‌తిప‌క్షాల‌కు పెద్ద టాస్క్‌గా మారింది.

మ‌రీ ముఖ్యంగా .. రాష్ట్రప‌తి ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌రిగిన కొన్ని రాజ‌కీయ అంశాలు కూడా చ‌ర్చ‌కు వ‌స్తున్నా యి. చివ‌రి నిముషంలో కొన్ని పార్టీలు.. స‌మావేశాల‌కు రాక‌పోవ‌డం.. చేతులు క‌లిపినా.. మ‌న‌సులు క‌ల‌ప‌క‌పోవ‌డం వంటివి కూడా ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.

అయితే.. ఇప్పుడు వ‌చ్చిన ఓట్లు.. ద‌క్కిన ఫ‌లితాన్ని కొంత పుంజుకునేలా చేస్తే.. అంటే.. అన్ని ప్ర‌తిప‌క్ష పార్టీలు కూడా.. ఒకే తాటిపైకి క‌నుక వ‌స్తే.. మోడీ ఢీ కొట్ట‌డం .. పెద్ద స‌మ‌స్య కాద‌ని.. జాతీయ‌స్థాయి రాజ‌కీ య విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కానీ.. ఈ బాధ్య‌త‌ను ఎవ‌రు తీసుకుంటారు?  ఎలా ముందుకు సాగుతారు? అనేదే ప్ర‌శ్న‌. ఎవరికి వారు.. వారి వారి రాజ‌కీయ అజెండాల‌ను మోస్తున్న‌ప్పుడు.. జాతీయ రాజ‌కీయాల‌పై ప్ర‌భావం `ఇలానే` ఉంటుంద‌ని వారు చెబుతున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా.. ఉమ్మ‌డి అజెండా ఏర్పాటు చేసుకుని, నాయ‌కుల‌కు భ‌రోసా క‌ల్పించి.. ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అదే  తొలి నైతిక విజ‌యం అవుతుంద‌ని సూచిస్తున్నారు. మ‌రి ప్ర‌తిప‌క్షాలు ఏం చేస్తాయో చూడాలి.
Tags:    

Similar News