అంతా ఏక‌మ‌య్యారు!... కోడెల *క్విట్* త‌ప్ప‌దా?

Update: 2019-02-15 09:43 GMT
గుంటూరు జిల్లా స‌త్తెన‌ప‌ల్లిలో నేటి ఉద‌యం జ‌రిగిన ఓ వినూత్న నిర‌స‌న కార్య‌క్ర‌మం నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. చూడ్డానికి అక్క‌డి అధికార పార్టీకి చెందిన ప్ర‌జా ప్ర‌తినిధిపై విప‌క్షాల‌న్ని ఒక్కుమ్మ‌డిగా ఆందోళ‌న‌కు దిగడం సాధార‌ణంగానే క‌నిపిస్తున్నా... కాస్తంత త‌రచి చూస్తే మాత్రం అందులోని మ‌ర్మ‌మేంటో ఇట్టే అర్థం కాక మాన‌దు. అంతేకాకుండా అక్క‌డి అధికార పార్టీ ప్ర‌జా ప్ర‌తినిధిపై ఎంత‌టి ప్ర‌జా వ్య‌తిరేక‌త ఉందో కూడా ఇట్టే అర్థం కాక మాన‌దు. అస‌లు అక్క‌డ ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... గ‌డ‌చిన ఎన్నికల్లో స‌త్తెన‌ప‌ల్లి నుంచి టీడీపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగిన కోడెల శివప్ర‌సాద్‌... వైసీపీ అభ్య‌ర్థి అంబ‌టి రాంబాబుపై స్వ‌ల్ప మెజారిటీతో చావు త‌ప్పి క‌న్నులొట్ట‌బోయిన చందంగా గెలిచారు.

టీడీపీ కూడా అధికారంలోకి రావ‌డంతో మంత్రిగిరీపై కోడెల పెట్టుకున్న ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లిన చంద్ర‌బాబు... ఆయ‌న నోరును క‌ట్టేసే ప్లాన్ లో భాగంగా స్పీక‌ర్ ప‌దవిలో కూర్చోబెట్టారు. అయినా కూడా కోడెల త‌న తీరునేమీ మార్చుకోలేదు క‌దా.. స్పీక‌ర్ ప‌ద‌విలో ఉండి కూడా త‌న‌దైన శైలి వైఖ‌రితోనే వివాదాల‌కు కేంద్రంగా మారారు. ఈ క్ర‌మంలో స‌త్తెన‌ల‌ప‌ల్లిలో కోడెల దౌర్జ‌న్యాల‌కు అంతే లేకుండా పోయింద‌ని, కోడెల‌ను స‌త్తెన‌ప‌ల్లి నుంచి త‌రిమికొడితే త‌ప్పించి ఫ‌లితం ఉండ‌ద‌న్న నినాదంతో వైసీపీ, వామ‌ప‌క్షాలు ఉమ్మ‌డిగా *క్విట్ కోడెల‌... సేవ్ స‌త్తెన‌ల‌ప‌ల్లి* పేరిట ఆందోళ‌న‌కు దిగారు. ఈ ఆందోళ‌న‌ల‌ను అణ‌చివేసేందుకు అంద‌రూ ఊహించిన‌ట్టుగానే పోలీసులు ఎంట్రీ ఇచ్చేసి అంబటి స‌హా వైసీపీ, లెఫ్ట్ పార్టీ నేత‌ల‌ను అరెస్ట్ చేసేశారు.

వీరంతా అరెస్టై పోలీస్ స్టేష‌న్ల‌కు చేర‌గానే... అంద‌రినీ ఆశ్య‌ర్యానికి గురి చేస్తూ జ‌న‌సేన కూడా కోడెల‌కు వ్య‌తిరేకంగా ఆందోళ‌న‌కు దిగింది. వైసీపీ, వామ‌ప‌క్షాలు చేసిన డిమాండ్ తోనే జ‌నసేన కూడా ఆందోళన చేసినా... ఆ పార్టీలో క‌ల‌వ‌కుండా త‌న‌కు తాను వేరేగా నిర‌స‌న‌ను వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా స‌త్తెన‌ప‌ల్లిలో కోడ‌ల వ్య‌వ‌హార స‌ర‌ళిపై ఏ ఒక్క‌రూ సంతోషంగా లేర‌ని, కోడెల మార్కు పాల‌న‌తో అక్క‌డి ప్ర‌జ‌లంతా విసిగిపోయార‌ని, గ‌డ‌చిన ఎన్నిక‌ల్లోనే కోడెల‌కు ఓట‌మి తప్ప‌ద‌నుకున్నా... ఎలాగోలా బ‌య‌ట‌ప‌డ్డార‌న్న విశ్లేష‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అయితే గెలుపు ఇచ్చిన ధీమాతో \కోడెల గ‌డ‌చిన ఐదేళ్ల‌లో స్పీకర్ స్థానంలో ఉండి కూడా చేసిన నిర్వాకాల‌తో ఈ ద‌ఫా మాత్రం ఆయ‌న‌కు స‌త్తెన‌ప‌ల్లి ప్ర‌జ‌లు ఓట‌మిని బ‌హుమానంగా ఇస్తార‌న్న వాద‌న బ‌లంగానే వినిపిస్తోంది.

Tags:    

Similar News