కా'వేడీ'.. ఇప్పుడు తమిళనాడు వంతు!

Update: 2016-10-17 05:23 GMT
కావేరీ జలాలు కర్ణాటక - తమిళనాడుల మధ్య రాజేసిన నిప్పు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేయాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిననాటి నుంచి ప్రధానంగా కర్ణాటక వేదికగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ విషయంలో సామాన్యులు - సెలబ్రెటీలు అనే తేడాలేమీ లేకుండా కర్ణాటక మొత్తం ఈ విషయంపై రోడ్డెక్కారు.. తమిళనాడుకు నీరు వదిలేది లేదని నినాదాలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వానికి కర్ణాటకలోని అన్ని పార్టీలు మద్దతివ్వడంతో వారంతా కావేరి జలాలను తమిళనాడుకు విడుదల చేయరాదని ఉభయసభల్లోనూ నిర్ణయించారు! అలాగే కావేరి నీటి నిర్వహణ మండలి ఏర్పాటుపై స్టే విధించిన సుప్రీం... తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ కా"వేడి" తమిళనాడులో మొదలైంది. ఇన్నాళ్లూ సుప్రీంకోర్టు స్టే ఉందని భావించిన తమిళులు తాజాగా రైల్ రోకో చేపట్టారు!

ఈ సందర్భంగా తమిళనాడుకు కావేరి జలాలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తమిళనాడు ప్రతిపక్ష పార్టీ డీఎంకే రాష్ట్రవ్యాప్తంగా రైలురోకో చేపట్టింది. ప్రతిపక్షనేత - డీఎంకే కోశాధికారి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు సోమవారం ఉదయం చెన్నైలో వివిధ ప్రాంతాల్లో రైలురోకో చేపట్టారు. ఈ విషయంలో మిగిలిన రాజకీయ పక్షాలతో పాటు ప్రజాసంఘాలు - రైలు సంఘాలు కూడా మద్దతిస్తున్నాయి. ఈ క్రమంలో 48 గంటల పోరు నినాదంతో రైళ్లను అడ్డుకోవటంతో పాటు రెండువందల చోట్ల రైల్వేస్టేషన్లను ముట్టడించాలని ప్లాన్ చేస్తున్నారట!

కాగా కావేరి అభివృద్ధి బోర్డు, పర్యవేక్షణ కమిటీ ఏర్పాటులో కేంద్ర ప్రభుత్వం మాటమార్చి వ్యవహరిస్తుండటం తమిళనాట ఆగ్రహ జ్వాలలను రగిల్చిన విషయం తెలిసిందే. కావేరి బోర్డు, కమిటీ సాధన లక్ష్యంగా కేంద్రంపై కన్నెర్ర చేస్తూ సాగనున్న ఈ రైల్ రోకో విషయంలో రాష్ట్రవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల వద్ద పోలీసులు భారీగా మోహరించారు. రైళ్ల రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు చర్యలు చేపట్టారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News