ఫామ్ హౌస్ మీద సటైర్ లే సటైర్ లు

Update: 2015-09-29 17:30 GMT
రైతుల ఆత్మహత్యల అంశం తెలంగాణ అసెంబ్లీలో చర్చకు వచ్చిన నేపథ్యంలో విపక్ష నేతలంతా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫాంహౌస్ మీద సటైర్ల మీద సటైర్ లు వేసి షాకులిచ్చారు. ఫాంహౌస్ లో కేసీఆర్ ఆహార్యం మొదలు.. ఆయన రాబడి.. దిగుబడి.. ఆయన చేసే వ్యవసాయం లాంటి అంశాల్ని ఎవరికి వారు ప్రస్తావించి అధికారపక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేశారు.

రైతుల ఆత్మహత్యల్ని వరుణుడి ఖాతాలో వేసిన తెలంగాణ వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తటంతో పాటు.. కేసీఆర్ సాగు చేసే ఫామ్ హౌస్ మీద విపక్ష నేతలు వేసిన సటైర్లు చూస్తే..

రైతుల ఆత్మహత్యలపై  తెలుగుదేశం శాసన సభా పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేసీఆర్ ఆదర్శ రైతు అని.. ఎకరం మీద కోటి రూపాయిల ఆదాయం తీస్తున్నారన్నారు. అలాంటి ఆయన ఇజ్రాయిల్ ఎందుకు వెళ్లారు? ఇజ్రాయిల్.. చైనా టూర్లకు రైతుల్ని ఎందుకు తీసుకెళ్లరు? అంటూ ప్రశ్నించారు. తక్కువ పొలంలో ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్న కేసీఆర్.. తన ఫామ్ హౌస్ కు తమను.. ఇతర ఎమ్మెల్యేల్ని తీసుకెళ్లి చూపించాలన్నారు. వరంగల్ జిల్లాలో తన పొలం ఎండిపోయిందని.. కేసీఆర్ తన ఫామ్ హౌస్ మాత్రం పచ్చగా ఉందని.. దాన్ని చూపించాలన్నారు.

ఇక.. మజ్లిస్ శాసన సభా పక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో టోపీ పెట్టుకొని అందంగా కనిపిస్తారని.. అక్కడ ఫామ్ హౌస్ పచ్చగా ఉంటుందని.. అలాగే తెలంగాణలోని ప్రతి రైతు కేసీఆర్ మాదిరే సంతోషంగా కనిపించాలని తాను కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. దేశంలో రెండో ధనిక దేశమైన తెలంగాణలోని రైతులంతా.. ఫామ్ హౌస్ లో కేసీఆర్ టోపీ పెట్టుకున్న మాదిరి.. పెట్టుకొని ఆనందంగా ఉండాలని తాను కోరుకున్నట్లు ఎక్కడో తగిలే మాటలు మాట్లాడారు.
Tags:    

Similar News