కేసీఆర్ ఆర్డ‌ర్‌..ప్ర‌తిప‌క్షాల‌న్నీ ఒక్క‌తాటిపైకి!

Update: 2018-12-20 13:53 GMT
హోరాహోరీగా సాగిన తెలంగాణ అసెంబ్లీ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ పార్టీ విజ‌య‌దుందుబీ మోగించిన సంగ‌తి తెలిసిందే. ఈ ఫ‌లితం నుంచి ఇప్పుడిప్పుడే కోరుకుంటున్న విప‌క్షాల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ వెంట‌నే వారికి త‌న‌పై స్పందించే అవ‌కాశం ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది! ప్రస్తుత పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు త‌గ్గించ‌డం అనే అంశం ఆధారంగా విప‌క్షాలు ఏక‌మ‌య్యాయి. పంచాయతీ రాజ్ ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీలను కలుపుకుని బీసీల రిజర్వేషన్లను రక్షించుకోవాలనే నినాదంతో హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో బీసీల మహాధర్నా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు వి.హన్మంతరావు - జాతీయ బీసీ కమిషన్‌ మాజీ ఛైర్మన్‌ జస్టిస్‌ ఈశ్వరయ్య - బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు లక్ష్మణ్ - శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ - కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పొన్నాల లక్ష్మయ్య - టీ-టీడీపీ అద్యక్షులు ఎల్. రమణ పాల్గొన్నారు.

ప్రస్తుత పంచాయతీ రాజ్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 34 శాతం నుండి 23 శాతం తగ్గించడాన్ని నిరసిస్తూ బీసీల మహా ధర్నా నిర్వహించిన సంద‌ర్భంగా నేత‌లు మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ లపై సుప్రీం కోర్టును ప్రశ్నించిన కేసీఆర్ తన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. బలహీన వర్గాలకు రాయితీలు దొరలకు అధికారం అనే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. అఖిలపక్ష సమావేశం పెట్టి సీఎం సమస్య పరిష్కరించాలని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో ప్రాణం పోయినా ఊరుకునేది లేదని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంత రావు  వెల్లడించారు. సకల జనుల సర్వేలో బీసీల లెక్కలు ఇప్పటికి బయట పెట్టలేదని తెలిపారు.  25 వరకు సమయమిచ్చి ఆ తరువాత కలెక్టరేట్ల ముట్టడి - రాస్తారోకోలు - రాష్ర్ట బంద్ కు పిలుపు నిస్తామని హెచ్చరించారు. రాజస్థాన్ - ఛతీస్ ఘడ్ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఇద్దరు బీసీలను సీఎంలు చేశారని తెలిపారు.

బీజేపీ రాష్ర్ట అధ్యక్షులు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎన్నికల తరవాత ప్రజా తీర్పు పొందిన ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా  రోడ్ల పైకి వచ్చేలా చేసిందని వెల్లడించారు. ఓట్లు వేసి గెలిపించిన బీసీలను కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని విమర్శించారు . బీసీలకు రిజర్వేషన్లు పెంచేందుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఉంటుందని శాసన మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ తెలిపారు. 34 శాతం కోసం సుప్రీం కోర్ట్ లో రివ్యూ పిటీషన్ ఎందుకు వేయలేదని ప్రశ్నించారు. .సీఎంగా కేసీఆర్ తీసుకున్న నిర్ణయం హాస్యాస్పదంగా ఉందని మాజీ పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల పై ఇచ్చిన ఆర్డినెన్స్ ను వెంటనే రద్దు చెయ్యాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్ర‌జ‌ల త‌ర‌ఫున తాము ఉద్య‌మిస్తామ‌ని ప్ర‌క‌టించారు.

Tags:    

Similar News