ఇంతలా నాన్చే బదులు ఇదేదో ముందే చెప్పేస్తే సరిపోయేదిగా మోడీ?

Update: 2021-08-10 03:53 GMT
గడిచిన కొద్దిరోజులుగా కేంద్రంలోని మోడీ సర్కారుపై పెద్ద ఎత్తున విమర్శలు.. ఆరోపణలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది పెగాసస్ ఉదంతం. దేశంలోని పలు రంగాలకు చెందిన ప్రముఖుల ఫోన్లపై నిఘా డేగకన్ను వేసినట్లుగా సంచలన కథనాలు రావటం.. దీనికి రాజకీయం తోడు కావటంతో ఇదో పెద్ద సంచలనంగా మారింది. దీనిపై ఎన్నో విశ్లేషణలు వెల్లువెత్తాయి. ఒకదశలో మోడీ సర్కారు డిఫెన్సులో పడిపోయింది కూడా.

ఈ ఇష్యూతోనే పార్లమెంటు సమావేశాలు కూడా సరిగా జరగని పరిస్థితి. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టటం.. అధికారపక్షం అంగీకరించకపోవటం లాంటివి చోటు చేసుకున్నాయి. దేశ రాజకీయాల్లో పెను ప్రకంపనలకు కారణమైన పెగాసస్ స్పైవేర్ మీద సమాధానం చెప్పాలని.. వస్తున్న ఆరోపణలపై అధికారిక ప్రకటన చేయాలని విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. పార్లమెంటు సమావేశాల్ని అడ్డుకుంటూ.. అంతరాయాలు కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా విపక్షాల డిమండ్లకు ఓకే చెప్పిన కేంద్రం.. పెగాసస్ మీద కీలక ప్రకటన చేసింది.

 దాని సారాంశం ఏమంటే.. ‘పెగాసస్ మిలిటరీ గ్రేడ్ స్పైవేర్ విక్రేత అయిన ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓతో ఎలాంటి లావాదేవీలు జరగలేదు’ అంటూ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. రాజ్యసభలో రక్షణ మంత్రిత్వ శాఖ సమాధానంలో భాగంగా ఈ కీలక ప్రకటన చేసింది. ఎన్ఎస్ఓ గ్రూపు టెక్నాలజీతో ప్రభుత్వం ఏమైనా లావాదేవీలు జరిపిందా? లేదా? అన్న ప్రశ్నను డాక్టర్ వి శివదాసన్ అడగ్గా.. రక్షణ శాఖ సహాయమంత్రిఅజయ్ భట్ రాతపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పెగాసస్ తో కేంద్రానికి లావాదేవీ ఉందా? అని ప్రశ్నించగా లేదని చెప్పిన మోడీ సర్కారు సమాధానం పలువురిని సంత్రప్తి పర్చలేకపోతోంది. కేంద్రానికి.. ఎన్ఎస్ఓకు ఏమైనా సంబంధం ఉందా? అన్న సందేహంతో పాటు.. దేశ పౌరులపై కేంద్రం ఏమైనా నిఘా ఉంచిందా? అన్న ప్రశ్నకు సమధానం చెప్పాల్సిన అవసరం కేంద్రం మీద ఉందంటున్నారు. నిజంగానే.. పెగాసస్ తో ఎలాంటి లింకు లేనప్పుడు అదే విషయాన్ని కుండబద్ధలు కొట్టినట్లుగా తేల్చి పారేయాలే కానీ.. ఇలా ఎందుకు నానపెట్టటం అన్నది ప్రశ్నగా మారింది.

 ఇప్పటివరకు ఇంత రచ్చ జరిగిన తర్వాత తీరుబడిగా.. తాపీగా ఎలాంటి లావాదేవీ లేదని చెబుతున్న మోడీ సర్కారు.. ఇదే విషయాన్ని ఈ ఇష్యూ మొదట్లోనే తేల్చేసి ఉంటే ఇంతకాలం ఇంత గొడవ ఉండేది కాదు కదా? అన్న ప్రశ్నను పలువురు సంధిస్తున్నారు. మరి.. దీనికి మోడీ సర్కారు ఏమని బదులిస్తుందో?
Tags:    

Similar News