అంతా మర్చిపోయాక ఎంతలా అరిచినా ఉపయోగం ఉంటుందా సోము?

Update: 2021-07-25 09:53 GMT
కుక్కలు మొరిగిన ఆర్నెల్లకు పోలీసులు వస్తారన్న మాట ఒకప్పుడు తరచూ వినిపించేది. పోలీసింగ్ పై ఘాటు విమర్శలు.. వారి పనితీరును పూర్తిగా మార్చేసిన పరిస్థితి ఇవాల్టి రోజున అపాయంలో ఉన్నామంటూ యాప్ లో బటన్ నొక్కితే ఆరు నిమిషాల వ్యవధిలో.. ప్రమాదంలో ఉన్న వారి వద్దకు వచ్చేస్తున్న పరిస్థితి. పోలీసులే ఇంత స్పీడుగా ఉంటే.. రోజుకో రాజకీయాన్ని తలకెక్కించుకునే నేతలు మరెంత స్పీడ్ గా ఉండాలి? సౌండ్ ఎక్కువ సినిమా తక్కువన్న మాటకు నిలువెత్తు రూపంగా నిలుస్తారంటూ సొంత పార్టీ నేతలే సోము వీర్రాజుపై ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటారు.

ఆయన ఎప్పుడు ఏ ఎజెండాను భుజానికి ఎత్తుకుంటారో.. ఎప్పుడు ఎవరి తరపు మాట్లాడతారో ఒక పట్టాన అర్థం కాదంటారు. తెలుగు నేల మీద నిలువెత్తు అనిశ్చితితో వ్యవహరించే నేతల్లో సోము వీర్రాజు ఒకరన్న మాట వినిపిస్తూ ఉంటుంది. తాజాగా ఆయన సరికొత్త నినాదాన్ని తీసుకున్నారు. పుష్కరాల సమయంలో కూల్చి వేసిన ఆలయాలన్నింటిని తిరిగి నిర్మించాలన్నది ఆయన ప్రధాన డిమాండ్. ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఆలయాల సందర్శన కార్యక్రమాన్ని షురూ చేసి.. పార్టీ నేతలతో కలిసి విజయవాడలోని ఇంద్రకీలాద్రి నుంచి ప్రారంభించారు.

ఎమ్మెల్సీ మాధవ్ తో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న ఆయన.. కృష్ణానది తీరంలో కూల్చివేసిన ఆలయ ప్రాంతాలను, ప్రభుత్వం ఇటీవల నిర్మాణం చేపట్టిన నాలుగు ఆలయాలను పరిశీలించారు. అనంతరం గుంటూరు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వరస్వామిని సోము వీర్రాజు దర్శించుకున్నారు. రాష్ట్రంలో అనేక ఆలయాలు నేలమట్టమై.. అంతర్వేది రథం దగ్థమై.. రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం ధ్వంసమై చాలా కాలమైందన్నారు. అయినప్పటికీ ఈ దారుణాలకు పాల్పడిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోలేదన్న ఆయన.. నామినేటెడ్ పోస్టుల భర్తీలో ప్రాధాన్యత పోస్టులు ఒకవర్గానికే దక్కాయన్న విమర్శ చేశారు.

నిజానికి ఏపీలో కూల్చేసిన గుడులమీద నిజాయితీతో ఆందోళన చేయాలన్నదే సోము వీర్రాజు లక్ష్యమైతే.. ఇంతకాలం ఆయన ఎందుకు ఆగారు? అన్నది ప్రశ్న. అన్నింటికి మించిన రామతీర్థంలో రాముడి విగ్రహానికి జరిగిన అవమానంపై ప్రతి ఒక్క తెలుగువారు స్పందించిన పరిస్థితి. అలాంటివేళలో.. అంతంతమాత్రంగా రియాక్టు అయిన సోము.. ఇప్పుడా విషయం పక్కకు వెళ్లిపోయిన తర్వాత.. తానేదో సాధిస్తాన్నట్లుగా రియాక్టు అవుతున్న తీరును పలువురు తప్పు పడుతున్నారు. ఆలయాల మీదా.. దేవతా విగ్రహాల మీద సోముకు సరిగా కమిట్ మెంట్ ఉంటే.. చేతల్లో చూపించాలే తప్పించి.. అప్పుడెప్పుడో జరిగి పోయి.. కోల్డ్ స్టోరేజీలోకి వెళ్లిన విషయాల్ని ఇప్పుడు ప్రస్తావించటంద్వారా ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు.
Tags:    

Similar News