కేంద్రం ఉరి నిర్ణ‌యం..పొంచి ఉన్న మ‌హా డేంజ‌ర్‌

Update: 2018-04-21 04:55 GMT
సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకునే దిశ‌గా మోడీ స‌ర్కార్ ఆలోచిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల నుంచి వ‌చ్చిన సూచ‌న‌లు.. ప్ర‌తిపాద‌న‌ల పుణ్య‌మా అని కొత్త త‌ర‌హా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించే దిశ‌గా స‌మాలోచ‌న‌లు చేస్తోంది. ఇటీవ‌ల వెలుగు చూసిన మైన‌ర్ల అత్యాచారాల నేప‌థ్యంలో భారీ నిర్ణ‌యమే తీసుకోవాల‌ని భావిస్తోంది.

12 సంవ‌త్స‌రాల లోపు బాలిక‌ల‌పై లైంగిక అత్యాచారాల‌కు పాల్ప‌డిన వారికి ఉరి వేసేలా ఒక కొత్త చ‌ట్టాన్ని తీసుకొచ్చే దిశ‌గా ప్ర‌య‌త్నాలు షురూ అయిన‌ట్లు చెబుతున్నారు. క‌థువా..ఉన్నావ్ అత్యాచార ఘ‌ట‌న‌లు మోడీ స‌ర్కార్ ఇమేజ్ ను డ్యామేజ్ చేయ‌టంతో పాటు.. దేశంలో మైన‌ర్ల మీద అత్యాచారాలు జ‌రుగుతున్నా ప‌ట్టించుకోవ‌టం లేద‌న్న విమ‌ర్శ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

వీటికి చెక్ పెట్టేలా మోడీ స‌ర్కార్ భారీ నిర్ణ‌యాన్ని తీసుకోవాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. 12 ఏళ్ల లోపు బాలిక‌ల‌పై అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష విధించేలా చ‌ట్టంలో మార్పులు చేస్తూ ఒక ఆర్డినెన్స్ తేచ్చే అంశాన్ని ఆలోచిస్తున్నారు. దీంతో చిన్నారి బాలిక‌ల‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌వ‌ట‌మే కాదు.. త‌ప్పుడు ఆలోచ‌న‌ల్లో ఉన్న వారి వెన్ను జ‌ల‌ద‌రించేలా చేస్తుంద‌ని భావిస్తున్నారు.

లైంగిక అత్యాచార ఘ‌ట‌న‌ల నుంచి పిల్ల‌ల్ని సంర‌క్షించే చ‌ట్టం (పోస్కో) కు స‌వ‌ర‌ణ చేస్తూ ఈ ఆర్డినెన్స్ త‌క్ష‌ణం అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు. దీనికి బ‌ల‌ప‌రిచే ప‌రిణామాలు తాజాగా చోటు చేసుకున్నాయి. పోస్కో చ‌ట్టానికి స‌వ‌ర‌ణ తేనున్న‌ట్లుగా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలియ‌జేసింది. ఎనిమిది నెల‌ల పాప‌పై 28 ఏళ్ల వ్య‌క్తి అత్యాచారానికి పాల్ప‌డిన కేసును విచారిస్తున్న జ‌స్టిస్ దీప‌క్ మిశ్రాతో కూడిన బెంచ్ కు అద‌న‌పు సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ పీఎస్ న‌ర‌సింహ ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న చ‌ట్టాల ప్ర‌కారం మైన‌ర్లను అత్యాచారం చేస్తే అత్య‌ధికంగా జీవిత ఖైదు (14ఏళ్లు)..  అత్య‌ల్పంగా ఏడేళ్లు మాత్ర‌మే ఉండేది. అదే స‌మ‌యంలో మైన‌ర్లు అత్యాచారాల‌కు పాల్ప‌డితే శిక్ష‌లు త‌క్కువ‌గా ఉండేవి. దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన నిర్భ‌య ఉదంతంలో ఒక దోషి మైన‌రు 17 ఏళ్లు కావ‌టం.. అత‌న్ని మూడేళ్ల పాటు జువైన‌ల్ హోంలో ఉంచి విడుద‌ల చేయ‌టంపై దేశ వ్యాప్తంగా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్త‌మైంది.

ఈ నేప‌థ్యంలో జువైన‌ల్ జ‌స్టిస్ చ‌ట్టంలో మార్పు తీసుకొచ్చి 16-18 ఏళ్ల లోపు వారు సైతం తీవ్ర‌మైన దారుణాల‌కు పాల్ప‌డితే వారిని కూడా పెద్ద‌ల‌తో స‌మానంగా విచారించొచ్చ‌న్న నిర్ణ‌యాన్ని తీసుకున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్రం తీసుకొస్తున్న ఆర్డినెన్స్ ను చ‌ట్టం రూపంలో తీసుకొచ్చేందుకు వీలుగా ఈ బిల్లును వ‌ర్షాకాల స‌మావేశాల్లో పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల్లో ప్ర‌వేశ పెట్టాల‌ని మోడీ స‌ర్కారు భావిస్తోంది. అయితే.. ఈ ఆర్డినెన్స్ తో వ‌చ్చే స‌మ‌స్య ఒక‌టుంద‌న్న సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 12 ఏళ్ల లోపు బాలిక‌ల‌పై అత్యాచారాలు జ‌రిపిన వారికి ఉరి అన్న మార్పు నేప‌థ్యంలో నిందితులు నేరాల‌కు పాల్ప‌డే స‌మ‌యంలో వారిని హ‌త‌మార్చే వీలుంది.

12 ఏళ్ల లోపు బాలిక‌లు శారీర‌కంగా బ‌ల‌హీనంగా ఉండ‌ట‌మే కాదు.. త‌మ ప్రాణాల్ని తీస్తున్నా వారిని వారు కాపాడుకునే  స్థితిలో కూడా ఉండ‌రు. మ‌రీ డేంజ‌ర్ ను ఎలా అధిగ‌మిస్తార‌న్న‌ది ప్ర‌శ్న‌గా చెప్ప‌క త‌ప్ప‌దు. మైలేజీ కోసం హ‌డావుడిగా ఆర్డినెన్స్ తెచ్చే ముందు.. ఈ అంశంపై కేంద్రం క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News