మార్కుల కటాఫ్‌పై ఆత్మాహుతి దాడి చేస్తారా?

Update: 2015-07-09 04:49 GMT
ఆవేశంలో ఉన్నప్పుడు నాలుగు ఎక్కువ తక్కువ మాటలు మాట్లాడటం మామూలే. అయితే.. ఆ మాటలు తీవ్రంగా.. వణుకు పుట్టించేలా ఉండకూడదు. కానీ.. అలాంటి పరిస్థితే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తాజాగా చోటు చేసుకున్నట్లు ఒక ప్రముఖ మీడియా సంస్థ వెల్లడించింది. పీహెచ్‌డీ ప్రవేశానికి కటాఫ్‌ మార్కులు తగ్గింపునకు సంబంధించి ఓయూలో ఆందోళన వ్యక్తమవుతోంది.

దేశంలో ఉస్మానియా వర్సిటీకి మొదటి స్థానం (ఒక మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో) లభించటం పట్ల రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ సురేశ్‌ కుమార్‌ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సంస్థలు వచ్చాయి. అదే సమయంలో పెద్దఎత్తున విద్యార్థులు అక్కడికి చేరుకొని రిజిస్ట్రార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు వెల్లడించింది.

తమకు పీహెచ్‌డీ ప్రవేశాల్లో అన్యాయం జరుగుతోందని.. ఇదే కొనసాగితే తాము ఆర్ట్స్‌ కాలేజీ ముందు ఆత్మహత్యలకు పాల్పడతామని.. అవసరమైతే ఆత్మాహుతి దాడులకు దిగుతామని.. భౌతిక దాడులకు పాల్పడతామంటూ పేర్కొన్నట్లు తెలిపింది. అంతేకాదు.. తాము ఇదంతా ఆవేదనతో మాట్లాడుతున్నామని.. ఒక రిజిస్ట్రార్‌ డిప్యూటీ సీఎంను తప్పుదారి పట్టించొచ్చా? అంటూ నిలదీశారు.

విద్యార్థుల బెదిరింపులు చెల్లవని.. అవసరమైతే తన పదవికి రాజీనామా చేస్తానని రిజిస్ట్రార్‌ స్పష్టం చేశారు. సదరు అధికారి నుంచి ఊహించని విధంగా సమాధానం రావటంతో పాటు.. విద్యార్థులు ఇచ్చిన కటాఫ్‌ అభ్యర్థనలపై వివిధ స్టాండింగ్‌  కమిటీల్లో చర్చలు జరిగాయని.. ఎస్సీ.. ఎస్టీలకు 40 నుంచి 30 మార్కులు తగ్గించామని.. ఇలా చేసినందుకు కొంతమంది అర్హత సాధించినట్లు రిజిస్ట్రార్‌ పేర్కొన్నారు.

దీంతో వెనక్కి తగ్గిన విద్యార్థి సంఘాలు రిజిస్ట్రార్‌కు క్షమాపణలు చెప్పి.. విషయాన్ని డిప్యూటీ సీఎం దగ్గర తేల్చుకుంటామని చెప్పటమే కాదు.. మీరు మాతో రండి అంటూ రిజిస్ట్రార్‌ను ఆహ్వానించారు. ఆవేశంతో తీవ్ర వ్యాఖ్యలు చేయకుండా.. సామరస్య వాతావరణంలో చర్చలు జరిపితే సరిపోయేది కదా.

Tags:    

Similar News