చుక్కేసి డ్రైవ్ దొరికినోళ్ల‌లో ఎంత‌మందికి జైలో తెలుసా?

Update: 2019-06-14 06:04 GMT
చుక్కేయ‌టం గ‌తంలో మాదిరి పాపం ఎంత‌మాత్రం కాదు. అబ్బాయిలే కాదు.. అమ్మాయిలు సైతం డ్రింక్ చేయ‌టం స‌ర్వ‌సాధార‌ణంగా మారిపోయిందిప్పుడు. తాము తాగుతామ‌న్న విష‌యాన్ని బ‌రాబ‌ర్ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేసి మ‌రీ చెప్పుకుంటున్న వారు లేక‌పోలేదు.

ఇక‌.. చిట్టి వీడియోల‌తో మందేసి.. సందేశాలు ఇస్తున్న వారు.. వినోదాన్ని పంచుతున్న వారికి కొద‌వ లేదు. మందు తాగటం ఆరోగ్యానికి హానిక‌ర‌మ‌న్న సందేశాన్ని ఇస్తూనే.. మ‌స్తుగా తాగే సీన్లు పెట్టే సినిమాల మాదిరే.. మందు తాగి బండి న‌డిపితే జైలుకు పోతార‌న్నా.. లైట్ తీసుకుంటూ అడ్డంగా బుక్ అవుతున్నోళ్లు ఒక ప‌ట్టాన త‌గ్గ‌ట్లేదు. ఏడాది వ్య‌వ‌ధిలో హైద‌రాబాద్ లో మందు తాగి పోలీసుల‌కు చిక్కిన వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరుగుతోంది.

తాజాగా విడుద‌లైన నివేదిక‌లోని గ‌ణాంకాల్ని చూస్తే బిత్త‌ర పోవాల్సిందే. ఏడాది వ్య‌వ‌ధిలో తాగి వాహ‌నాలు న‌డిపిన కేసులు బోలెడ‌న్ని బుక్ అయితే.. అందులో 2612 మందికి జైలుశిక్ష విధించారు. షాకింగ్ గా అనిపించినా ఇది నిజం. ట్రాఫిక్ పోలీసులు వెల్ల‌డించిన స‌మాచారం ప్ర‌కారం ఏడాది వ్య‌వ‌ధిలో తాగి వాహ‌నాలు న‌డిపిన 12,900 మందిపై కేసులు న‌మోదు చేయ‌గా.. వారిలో 12,700 మందిపై ఛార్జ్ షీట్ దాఖ‌లు చేశారు.

ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిన 10,088 మంది నుంచి రూ.2.68 కోట్ల జ‌రిమానాను విధించ‌గా.. మ‌రో 2,612 మందికి జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పులు ఇచ్చింది. ఇంత క‌ఠినంగా ఉన్న‌ప్ప‌టికీ తాగి వాహ‌నాలు న‌డుపుతున్న వారి సంఖ్య మాత్రం త‌గ్గ‌టం లేదంటున్నారు. తాగి వాహ‌నాలు న‌డుపుతున్న కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాలు ఎక్కువ‌గా జ‌రుగుతున్నాయ‌న్న నేప‌థ్యంలో డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీల్ని ముమ్మ‌రం చేస్తున్నా.. మందుబాబులు మాత్రం ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News