అమెరికాలో మ‌నం!..ఎంత డేంజ‌ర్‌ లో ప‌డ్డామంటే!

Update: 2019-02-01 04:15 GMT
అమెరికా... నిజంగానే మ‌న పిల్ల‌ల‌కు ఓ క‌ల‌. అగ్ర రాజ్యంగా కీర్తించ‌బ‌డుతున్న ఆ దేశంలో విద్య‌న‌భ్య‌సించ‌డంతో పాటుగా అక్క‌డే ఉద్యోగం చేయ‌డం నిజంగానే మ‌న పిల్ల‌ల‌కు ఓ క‌లే. ఏ చిన్న ఛాన్స్  దొరికినా... ఇట్టే అమెరికా ఫ్లైటెక్కుతున్న మ‌న పిల్ల‌లు... అక్క‌డ ఏ మేర సేఫ్ గా ఉంటున్నార‌న్న విష‌యంపై ఇప్ప‌టిదాకా మ‌న‌కు పెద్ద‌గా ప‌ట్టేది కాదు. ఎందుకంటే అక్క‌డి క‌ఠిన చ‌ట్టాలు - కంటికి రెప్ప‌ల్లా కాచుకునే పోలీసులు ఉండ‌గా మ‌న పిల్ల‌లకేం... సుర‌క్షితంగా ఉంటారులే అనుకున్నాం. అయితే ఇటీవలి కాలంలో అక్క‌డ చోటుచేసుకుంటున్న జాత్యంహ‌కార దాడులు మ‌న‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఉజ్వ‌ల భ‌విష్య‌త్తును చాలా జాగ్ర‌త్త‌గా బిల్డ‌ప్ చేసుకుంటున్న శ్రీ‌నివాస్ కూచిభొట్ల మృతి నిజంగానే మ‌న‌ల‌ను చాలా ఆందోళ‌న‌కు గురి చేసింద‌నే చెప్పాలి. అయితే తాజాగా అక్క‌డ వెలుగులోకి వ‌చ్చిన మ‌నోళ్ల అక్ర‌మాలు - అక్ర‌మ మార్గాలు ఇక్క‌డి మ‌న‌ల‌ను నిజంగానే నిద్ర లేని రాత్రుళ్లు గ‌డిపేలా చేస్తున్నాయని చెప్పాలి. అమెరికాలో విద్య‌ - అక్క‌డే ఉద్యోగం.. ఇదంతా రాజ‌మార్గంలో జ‌రిగితే అంత‌కుమించిన బెట‌ర్ లైఫ్ లేద‌నే చెప్పాలి. అయితే ఈ మార్గంలో ఏమాత్రం గ‌తి త‌ప్పినా... ఉజ్వ‌ల భ‌విత కోసం అక్క‌డికెళ్లిన మ‌న పిల్ల‌ల‌తో పాటు ఇక్క‌డున్న మ‌నం కూడా ఎందుకూ కొర‌గాకుండా పోయే ప్ర‌మాదం ఉంద‌న్న స‌త్యాన్ని మ‌నం తప్ప‌నిస‌రిగా గుర్తెర‌గాల్సిందే. ఇప్ప‌టికే పొర‌పాట్లు చేసిన వారు  వాటిని వీల‌యినంత త్వ‌ర‌గా స‌రిద్దిద్దుకోవాల్సి ఉండ‌గా... ఇక‌పై అమెరికా క‌లలు క‌నేవారు ఇక‌నైనా రుజు మార్గంలోనూ అక్క‌డికి వెళ్లాలి.

అయినా ఇప్పుడు మ‌న‌ల‌ను ఇంత‌గా ఆందోళ‌న‌కు గురి చేసిన ఘ‌ట‌న అక్క‌డ ఏం జ‌రిగింద‌న్న విష‌యానికి వ‌స్తే... చ‌దువు పేరిట అక్క‌డికి రెక్క‌లు క‌ట్టుకుని వాలిపోతున్న మ‌న యువ‌త‌... అక్క‌డ చ‌దువును కొండెక్కించేసి ఎంచ‌క్కా సంపాద‌న‌లో మునిగి తేలుతున్నారు. చ‌దువు కోసం పార్ట్ టైం ఉద్యోగం చేస్తే ఫ‌ర‌వా లేదు గానీ... సంపాద‌నే ల‌క్ష్యంగా చ‌దువును సాకుగా చూపి అక్క‌డికి ఎగిరిపోతున్న మ‌న యువ‌త సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. మ‌న పిల్ల‌ల్లోని అమెరికా క‌ల‌ - అక్క‌డ జ‌రుగుతున్న కొత్త దందాలోని మ‌ర్మాన్ని ఇట్టే ప‌ట్టేసిన అక్క‌డి మ‌నోళ్లే ఓ కొత్త త‌ర‌హా అక్ర‌మాల‌కు తెర తీశారు. విద్య కోస‌మేనంటూ మ‌న పిల్ల‌ల‌ను అక్క‌డికి తీసుకెళ్లి ప‌డేస్తున్నారు. అమెరికాలో కాలు మోపిందే త‌డ‌వుగా మ‌న పిల్ల‌లు కూడా తొలుత సంపాద‌న మీదే ప‌డిపోతున్నారు. మొత్తంగా దందారాయుళ్ల‌కు ఇది పెద్ద ఆదాయ వ‌న‌రుగానే మారిపోయింది. ఇలా అమెరికాలో కాలుపెడుతున్న వారు మ‌న భార‌తీయులు మాత్ర‌మే కాదులెండి. దాదాపుగా అన్ని దేశాల నుంచి కూడా అమెరికాకు వెళుతున్న వారిలో ఈ త‌ర‌హా మార్గంలో వెళుతున్న వారు కూడా ఉన్నారు. ఫ‌లితంగా అక్క‌డ అక్ర‌మ వ‌సదారుల సంఖ్య నానిటికీ పెరిగిపోతోంది. వెర‌సి అక్క‌డి ప్ర‌భుత్వాలు కూడా ఈ అక్ర‌మ వ‌ల‌స‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ప‌కడ్బందీ ప్ర‌ణాళిక‌లు ర‌చించ‌డంతో పాటుగా స్టింగ్ ఆప‌రేష‌న్ల పేరిట అక్ర‌మార్కుల‌కు ముకుతాడు వేస్తున్నారు.

ఈ క్ర‌మంలోనే ఓ ఫేక్ యూనివ‌ర్సిటీని నెల‌కొల్పిన వారిపై అక్క‌డి పోలీసులు... అక్ర‌మ వ‌ల‌స‌దారుల‌పై ప‌క్కాగా నిఘా పెట్టారు. ఈ నిఘా నేత్రానికి ఇత‌ర దేశాల వారి సంగ‌తి అలా ప‌క్క‌న‌పెడితే... మ‌నోళ్లు మాత్రం వంద‌ల సంఖ్య‌లో బుక్కైపోయారు. పే టూ స్టే పేరిట న‌డుస్తున్న ఈ దందా భార‌త్ నుంచి వెళ్లిన విద్యార్థుల త‌ల్లిదండ్రులు... ప్ర‌త్యేకించి తెలుగు నేల‌కు చెందిన ఇలాంటి కుటుంబాల‌ను తీవ్ర ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. దందాను న‌డిపినట్లుగా ఆరోపిస్తూ... ఓ 8 మంది తెలుగు వారిని అరెస్ట్ చేసిన అమెరికా పోలీసులు... వీరి ద్వారా అమెరికాలో కాలుమోపిన మన పిల్ల‌ల‌నూ టార్గెట్ చేసే ప్ర‌మాదం లేక‌పోలేదు. మొత్తంగా గ‌డ‌చిన రెండు రోజుల నుంచి అక్క‌డికి వెళ్లిన విద్యార్థుల కుటుంబాలు దిన‌దిన గండంగా కాలం వెళ్ల‌దీస్తున్నాయి. ఫార్మింగ్ట‌న్ వ‌ర్సిటీ పేరిట అక్క‌డి పోలీసులు ఏర్పాటు చేని న‌కిలీ వ‌ర్సిటీ అస‌లు రూపాన్ని గుర్తించ‌లేక‌పోయిన మ‌నోళ్లు... అక్క‌డి పోలీసుల ఉచ్చులో చిక్కుకుపోయారు. పే టూ స్టే పేరిట మ‌నోళ్లే సాగిస్తున్న దందాపై ఇప్పుడు స‌ర్వత్రా చ‌ర్చ న‌డుస్తోంది. స్టే కోస‌మే పే చేసేందుకు అమెరికాకే వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింది? అక్క‌డ క‌ట్టే ల‌క్ష‌లకు ల‌క్ష‌ల రూపాయాల‌తో ఇక్క‌డే ఏదో బిజినెస్ చేసుకుంటే - లేదంటే ఇంకేదో  ఉన్న‌త చ‌దువు చ‌దివి ఉజ్వ‌ల భవిష్య‌త్తుకు బాటలు వేసుకుంటే మంచిది క‌దా అన్న భావ‌న కూడా ఇప్పుడు బాగానే వినిస్తోంది. చ‌క్క‌టి యాడ్‌ ల‌తో - చూడ‌చ‌క్క‌టి క్యాంప‌స్‌ తో వెబ్ పేజీల‌ను క్రియేట్ చేసిన అమెరికా పోలీసులు పే టూ స్టే దందాను బాగానే క‌నిపెట్టేశారు.

చాలా ప‌క‌డ్బందీగా జ‌రిగిన ఈ స్టింగ్ ఆప‌రేష‌న్ ఆ దేశ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ హ‌యాంలో ఏర్పాటైంద‌నుకుంటే పొర‌బ‌డ‌విట్టే. ఎందుకంటే *ఆప‌రేష‌న్ పేప‌ర్ చేజ్‌* పేరిట కొన‌సాగిన ఈ స్టింగ్ ఆప‌రేష‌న్‌... ఆ దేశ మాజీ అధ్య‌క్షుడు బరాక్ ఒబామా అధ్య‌క్షుడిగా ఉన్న‌ప్పుడే 2015లోనే మొద‌లైంద‌ట‌. అంటే ఏకంగా మూడేళ్ల‌కు పైగా చ‌డీచ‌ప్పుడు కాకుండా ద‌ర్యాప్తు చేసిన అక్క‌డి పోలీసులు.. పే టూ స్టేను పక్కా ఆధారాల‌తో ప‌ట్టేయ‌డమే కాకుండా... ఇక‌పై అక్ర‌మ మార్గాల్లో త‌మ దేశానికి వ‌స్తే ఇక అంతే అన్న భ‌యాందోళ‌న‌ల‌ను అయితే క్రియేట్ చేయ‌గలిగారు.ఈ ఆప‌రేష‌న్ లో భాగంగా ఇప్ప‌టిదాకా 600 మంది అరెస్ట్ కాగా... వారిలో మ‌న తెలుగు వాళ్లే ఎక్కువ‌గా ఉన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. స‌రే మ‌న‌సులో బ‌లంగా నాటుకుపోయిన అమెరికా క‌ల‌ను సాకారం చేసుకునేందుకు త‌ల్లిదండ్రులను ఒప్పించి కొంద‌రు - వేధించి మ‌రికొంద‌రు ఆ దేశంలో వాలిపోయిన మ‌న పిల్ల‌లు క్షేమంగా తిరిగి వ‌చ్చేదెలా?  వారికి అక్క‌డ ఏ మేర ఇబ్బందులు ఎదుర‌వుతాయి? మ‌న త‌క్ష‌ణ క‌ర్త‌వ్యమేమిట‌న్న విష‌యానికి వ‌స్తే.. ఇప్ప‌టికిప్పుడు అక్క‌డ ప‌ట్టుబ‌డ్డ మ‌న పిల్ల‌లు అక్క‌డి నుంచి తిరుగు ప్ర‌యాణ‌మైతే... ఇబ్బందేమీ లేదు. మోస‌గాళ్ల వ‌ల‌లో ప‌డి ప్ర‌మాదంలో ఇరుక్కున్న మ‌న పిల్ల‌ల‌పై అమెరికా కూడా అంత క‌ఠినంగా అయితే వ్య‌వ‌హ‌రించే ఛాన్సే లేదు.

అదే స‌మ‌యంలో ఈ దందాకు సూత్ర‌ధారులుగా వ్య‌వ‌హ‌రించిన మ‌నోళ్ల ప‌ని మాత్రం బాగానే ప‌ట్టేస్తార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దందారాయుళ్లుగా తేలి అరెస్ట‌యిన మ‌నోళ్లు ఎవర‌న్న విష‌యానికి వ‌స్తే.... భ‌ర‌త్ కాకిరెడ్డి - అశ్వంత్ నూనె - సురేశ్ రెడ్డి కందాల‌ - ఫ‌ణిదీప్ క‌ర్నాటి - ప్రేమ్ కుమార్ రాంపీస‌ - సంతోష్ రెడ్డి సామ‌ - అవినాశ్ త‌క్క‌ళ్ల‌ప‌ల్లి - న‌వీన్ ప్ర‌త్తిపాటిలు ఉన్నారు. వీరిని అమెరికా పోలీసులు కోర్టులోనూ హాజ‌రు ప‌రిచేశారు. వీరికి క‌ఠిన శిక్ష‌లే ప‌డటం ఖాయంగానే క‌నిపిస్తోంది. అయితే అమెరికా క‌ల కార‌ణంగా అమాయ‌కంగా వీరి వ‌ల‌లో ప‌డిపోయిన మ‌న అమాయ‌క చ‌క్ర‌వ‌ర్తుల‌కు ఏమీ కాకుండా ఉండేలా చ‌ర్య‌లు చేప‌ట్టేందుకు అక్క‌డి మ‌న తెలుగు సంఘాలు ఇప్ప‌టికే రంగంలోకి దిగాయి. ఏ ఒక్క‌రూ ఇబ్బంది ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని - న్యాయ‌ప‌ర‌మైన సాయం కూడా అందించేందుకు చ‌ర్య‌లు చేప‌డుతున్న‌ట్లు తానా - ఆటా - ఏపీఎన్నార్టీ లాంటి సంస్థ‌లు మ‌న పిల్ల‌ల‌కు ఏమీ కాద‌ని ధైర్యం చెబుతున్నాయి. మొత్తంగా ప‌రిస్థితులు మ‌రింత‌గా దిగ‌జార‌క ముందే అక్కడి మ‌న పిల్ల‌ల‌ను ఇక్క‌డికి ర‌ప్పించేసుకుంటే... మంచిద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఆ దిశ‌గా చ‌ర్య‌లు ఇప్ప‌టికే ప్రారంభం కాగా... మ‌న పిల్ల‌లు క్షేమంగానే మ‌న ఇంటికి చేర‌తార‌న్న భావ‌న కూడా వ్య‌క్త‌మ‌వుతోంది. ఈ ఉదంతాన్ని చూసైనా... ఇక‌పై అమెరికా కల‌ను సాకారం చేసుకునేందుకు మ‌న పిల్ల‌లు అడ్డ దారులు తొక్క‌ర‌ని - అలాంటి అడ్డ‌దారుల్లో మ‌న పిల్ల‌ల భ‌విష్య‌త్తు బుగ్గి కాకుండా జాగ్ర‌త్త ప‌డాల్సిన అవ‌స‌రం మ‌న‌కుంద‌ని వాస్త‌వాన్ని తెలుసుకుని మ‌స‌లుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఎంతైనా ఉంద‌ని చెప్పాలి.


Tags:    

Similar News