అమెరికాలో అనాథ‌లుగా మ‌నోళ్లు ఏడువేలు

Update: 2018-06-20 09:44 GMT
అగ్ర‌రాజ్యం అమెరికాలో మ‌నోళ్లు ఏడువేల మంది అనాథ‌లుగా మిగిలిపోయారు. అమెరికాలో తమకు ఆశ్రయం కల్పించాలని కోరుతూ ఏడువేలమందికి పైగా భారతీయులు గత ఏడాది దరఖాస్తు చేసుకున్నారని ఐక్యరాజ్యసమితి బుధవారం వెల్లడించింది. 2017లో ఆశ్రయం కోరుతూ అమెరికాకు అత్యధికంగా దరఖాస్తులు వచ్చాయని ఐరాస శరణార్థ సంస్థ తన వార్షిక నివేదికలో తెలిపింది. వలసల కారణంగా అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా ప్రభావితమవుతున్నాయని పేర్కొంది. అమెరికాలో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో సాల్వడోర్‌ కు చెందిన వారు మొదటిస్థానం (49,500) ఉన్నారు. ఆ తరువాత మెక్సికో (26,100) - చైనా (17,400) - హైతీ (8,600) - భారత్‌ (7,400) ఉన్నాయి.

ఆ నివేదిక ప్రకారం.....

--2017 నాటికి ప్రపంచవ్యాప్తంగా 6.87 కోట్ల మంది నిరాశ్రయులుగా మారారు. ఒక్క 2017లోనే 1.62 కోట్ల మంది శరణార్థులుగా మారారు.

వీరిలో 2.54 కోట్ల మంది స్వదేశంలో తమపై సాగుతున్న హింస నుంచి తప్పించుకొనేందుకు వలస వెళ్లారు.

--ప్రతిరోజు సగటున 44,500 మంది లేదా క్షణానికి ఇద్దరు చొప్పున నిరాశ్రయులవుతున్నారు.

--యుద్ధాలు - హింస - మతపరమైన హింస కారణంగా 2017లో ప్రజలు అత్యధిక సంఖ్యలో వలసబాట పట్టారు.

---2017 చివరి నాటికి భారత్‌ లో 1,97,146 మంది శరణార్థులుండగా - 40,391 మంది భారతీయులు ఇతర దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నట్టు ఆ నివేదిక వెల్లడించింది.

--- డీఆర్‌ కాంగోలో సంక్షోభం - దక్షిణ సూడాన్‌ లో యుద్ధం - మయన్మార్‌ లో రొహింగ్యాలపై దారుణకాండ వంటి అంశాల కారణంగా ప్రజలు లక్షల సంఖ్యలో వలస వెళ్లారు.

--ఇతర దేశాలలో ఆశ్రయం కోరుతున్న జాతీయులలో ఆఫ్ఘనిస్థాన్‌ మొదటి స్థానంలో ఉంది. ఆ దేశానికి చెందిన 1.24 లక్షల మంది 80 దేశాల్లో ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకున్నారు.

ఇక స్వదేశంలోనే మరో ప్రాంతానికి వలస వెళ్లిన వారు నాలుగు కోట్ల మందికి పైగా ఉన్నారు.


Tags:    

Similar News