ఓవ‌ర్ టు కేసీఆర్ : క‌మ్యూనిస్టుల‌కు శుభ‌వార్త చెప్పిన పీకే !

Update: 2022-06-15 02:30 GMT
రానున్న ఎన్నిక‌ల్లో నాలుగు జిల్లాల‌లో తెలంగాణ రాష్ట్ర స‌మితి అస్స‌లు అడ్ర‌స్సులే లేకుండా పోతుంద‌ని, మంత్రివ‌ర్గంలో 11 మంది ఇంటికే ప‌రిమితం అవుతార‌ని ప్ర‌శాంత్ కిశోర్  బాంబ్ పేల్చారు. దీంతో సంబంధిత నాయ‌కులు ముచ్చెమ‌ట‌లు పోస్తున్నారు. ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ తో స‌హా ఖ‌మ్మం,న‌ల్గొండ, రంగారెడ్డి జిల్లాల‌లో అస్సలు బోణీలు ప‌డ‌వ‌ని తేల్చార‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే ఈ నివేదిక‌లు అన్నీ కేసీఆర్ గూటికి చేరాయి. వీటిపై కేసీఆర్ కూడా మ‌రోమారు స‌మీక్షించార‌ని తెలుస్తోంది.

ఇక  జాతీయ స్థాయిలో రాజ‌కీయాలు న‌డ‌పాల‌నుకుంటున్న కేసీఆర్ కు ఇప్పుడు వ‌చ్చిన చిక్కేంటంటే చాలా వ‌ర‌కూ సిట్టింగ్ స్థానాలు మార్చాల్సి రావ‌డం.. ఇది మామూలు త‌ల‌నొప్పి కాదు. చాలా సులువుగా తీసిపారేసే స‌మ‌స్య అంత క‌న్నా కాదు.

ఇంత‌వ‌ర‌కూ  జెండా మోసిన ద్వితీయ శ్రేణికి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది కానీ సిట్టింగులు ఒప్పుకుంటారా? త‌మ‌ను త‌ప్పించి కొత్త ముఖాల‌ను తెర‌పైకి తీసుకు రానిస్తారా? అన్న‌దే పెద్ద ప్ర‌శ్న. ఇదే స‌మ‌యంలో పార్టీలో వ‌ర్గ పోరు బాగానే ఉంది. ముఖ్యంగా ఉమ్మ‌డి  ఖమ్మంలో వ‌ర్గ‌పోరు ఉంద‌ని ఇప్ప‌టికే కేటీఆర్ వ్యాఖ్య‌ల‌తో స్ప‌ష్టం అయిపోయింది. అటు కాంగ్రెస్, ఇటు బీజేపీ కేసీఆర్ విజ‌యావ‌కాశాల‌ను గండి కొడుతున్నాయ‌ని తేలిపోవ‌డంతో అధికార పార్టీ వ‌ర్గాల్లో ముచ్చెమ‌ట‌లు పోస్తున్నాయి.

కొత్త పొత్తుల కోసం కేసీఆర్ మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేశారు. ఆవిధంగా ఆయ‌న కమ్యూనిస్టుల కాంపౌండ్లో అడుగు పెట్టేందుకు చూస్తున్నారు. ఎందుకంటే ఉద్య‌మాల ఖిల్లా ఖమ్మంలో కారు పార్టీ అడ్ర‌స్సులు గ‌ల్లంత‌యితే ఆదుకునేది క‌మ్యూనిస్టులే క‌నుక ! అదేవిధంగా మిగిలిన ప్రాంతాల్లో కూడా క‌మ్యూనిస్టుల ఓటు బ్యాంకు ను అంత సులువుగా కొట్టిపారేయ‌లేం. పైగా సీపీఐ నారాయణ లాంటి వారు ఎప్ప‌టి నుంచో రాజ‌కీయాల్లో మ‌ళ్లీ  యాక్టివ్ కావాల‌నుకుంటున్నారు క‌నుక వారికి కూడా ఇదొక శుభ‌వార్త లాంటిదే !

వ‌రుస వివాదాల నేప‌థ్యాన టీఆర్ఎస్ గ్రాఫ్ ప‌డిపోతున్న దృష్ట్యా ఆఖ‌రికి క‌మ్యూనిస్టులే కేసీఆర్-కు దిక్క‌వ్వ‌డం ఓ విధంగా మేలు మ‌రో విధంగా కీడు అని ప‌రిశీల‌కులు అంటున్నారు.

ఈ నేప‌థ్యంలో గులాబీ దండులో చీలిక‌లు వ‌స్తే మాత్రం జాతీయ పార్టీ మాట  దేవుడెరుగు ఉన్న కొద్దిపాటి బ‌లాన్నీ పోగొట్టుకుని మ‌ళ్లీ  మ‌ళ్లీ ఏటికి ఎదురీదాల్సి వ‌స్తుంద‌ని కూడా హెచ్చ‌రిస్తున్నాయి పీకే లాంటి వారి నివేదిక‌లు.
Tags:    

Similar News