ఓవ‌ర్ టు మోడీ : వివాదంలో సాధ్వీ.. ! ఏం చెప్పారంటే ?

Update: 2022-04-19 09:30 GMT
పిల్లల విష‌యంలో చాలా నిర్ణ‌యాలు జాగ్ర‌త్త‌లూ తీసుకుంటున్న కొత్త  జంట‌ల‌ను ఉద్దేశించి ఓ మ‌త ప్ర‌చార‌కురాలు చెప్పిన మాట‌లు క‌లవ‌ర‌పెడుతున్నాయి. న‌లుగురు పిల్ల‌ల‌ను క‌నండి అందులో ఇద్ద‌రిని వీహెచ్పీకి కానీ ఆర్ఎస్ఎస్ కు కానీ ఇవ్వండి వారిని మేం దేశోద్ధార‌కులుగా, మ‌త సంర‌క్షకులుగా తీర్చిదిద్దుతాం అని చెప్ప‌డంతో మ‌రో చ‌ర్చ న‌డుస్తోంది.

దేశం అంటే హిందూ మతం ఒక్కటే కాద‌న్న స‌త్యాన్ని ముందు గుర్తించాలి. అదేవిధంగా అన్ని మ‌తాలనూ ప్రేమించ‌డం కూడా బిడ్డ‌ల‌కు నేర్పాలి. అనేక అస‌మ‌గ్ర‌త‌లు ఉన్న దేశాన ఈ విధంగా జ‌నాభా పెంపున‌కు పిలుపు ఇవ్వ‌డంలో అర్థం లేదు అన్న‌ది ముందు ఆ వ్యాఖ్య‌లు చేసిన వారు గుర్తించాలి. అస‌మ‌ర్థ ప్ర‌భుత్వాల‌ను మ‌త ప్ర‌చార‌కులు నిల‌దీయ‌డం నేర్చుకోవాలి కానీ విద్వేష పూరిత వ్యాఖ్య‌లు కానీ అభివృద్ధి నిరోధ‌క మాట‌లు కానీ చేయ‌డంతో మంచి ఫ‌లితాలు సిద్ధించవు  అని గుర్తిస్తే మేలు.

న‌లుగురు పిల్ల‌ల‌ను క‌నండి అందులో ఇద్ద‌రిని ఈ దేశానికి ఇవ్వండి అంటూ సాధ్వి రితంబ‌ర వివాదాస్పద వ్యాఖ్య‌లు చేశారు. విశ్వ హిందూ ప‌రిష‌త్ మ‌హిళా విభాగం అధ్య‌క్షురాలు అయిన ఈమె చెప్పిన మాట‌లు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. ఆమె చెప్పిన మాట‌ల‌పై చాలా మంది మండిప‌డుతున్నారు.

దేశ జ‌నాభాను పెంచుకుంటూ పోవ‌డం వ‌ల్ల వ‌చ్చే లాభం ఏంట‌ని ఇటువంటి నిర్హేతుక వ్యాఖ్య‌లు అంత మంచివి కాద‌ని, ఇప్ప‌టికే దారిద్ర్య ర‌హిత దేశంగా ఎద‌గ‌లేక ఎన్నో అవ‌స్థ‌ల‌ను చ‌విచూస్తూ, స‌వాళ్ల‌ను అధిగమించేందుకు నిత్యం శ్ర‌మిస్తూ ఉంద‌ని, ఇలాంటి త‌రుణాన న‌లుగురు పిల్ల‌లకు జ‌న్మ‌నివ్వ‌డం ఏంటి.. వారి లో ఇద్ద‌రిని దేశానికి ఇవ్వ‌డం ఏంటి ? వీటి వ‌ల్ల ఏమ‌యినా ఉప‌యోగం ఉందా? దేశాన్ని ప్రేమించి, దేశ ఉన్న‌తికి పాటు ప‌డండి అని చెబితే బాగుటుంది.

ఈ మాట ఎవ్వ‌రు విన్నా హర్షిస్తారు. త‌మ బిడ్డ‌ల‌ను ఆ దిశ‌గా పెంచేందుకు ఇష్ట‌ప‌డ‌తారు కూడా ! అంతేకానీ అవ్య‌వ‌స్థ‌కు, అస్థిర‌త‌కు ఆన‌వాలుగా నిలిచే మాట‌లు చెప్ప‌డం వ‌ల్ల ఏంటి ప్రయోజ‌నం అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. ఇదే సంద‌ర్భంలో భార‌త్ హిందూ రాజ్యంగా త్వ‌ర‌లోనే రూపాంత‌రం చెంద‌నుంద‌ని చెప్ప‌డం కూడా సబబు కాదు.

ఇది ఒక లౌకిక రాజ్యం.. అనేక మతాలు, కులాలు, కట్టుబాట్లు, సంప్ర‌దాయ రీతులు క‌లిసి ఉన్న దేశం.. ఇటువంటి దేశాన్ని కేవ‌లం హిందూ రాజ్యంగా చూడ‌డం కూడా స‌బ‌బు కాదు. ఈ మాట‌ల కార‌ణంగా ఇత‌ర మ‌త‌స్తులు అభ‌ద్ర‌త కు లోన‌య్యే ప్ర‌మాదం ఉంది. ఇంత‌కాలం భిన్నత్వంలో ఏక‌త్వాన్నే చూసిన దేశం..ఒకే మ‌తం ఒకే దేశం అనే నినాదంతో తిరోగ‌మ‌నం చెంద‌డం ఖాయం అని కూడా కొంద‌రు హెచ్చ‌రిస్తున్నారు. మ‌త ప్రాతిప‌దిక మ‌నుషుల‌ను విడ‌దీసే నైజాన్ని వీడి ప్ర‌తి ఒక్క‌రూ ఇత‌రుల మేలు కోసం, సంక్షేమం కోసం పాటు ప‌డితే మంచి ఫ‌లితాలు సిద్ధిస్తాయి.
Tags:    

Similar News