గంద‌ర‌గోళం నుంచి బ‌య‌ట‌ప‌డిన ఓవైసీలు!

Update: 2017-07-16 16:57 GMT
ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ....సంక్షిప్తంగా ఏఐఎంఐఎం. సంద‌ర్భం ఏదైనా దూకుడుగా వెళ్ల‌డం ఎంఐఎం ర‌థ‌సార‌థులైన ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ - ఆయ‌న సోద‌రుడు - ఎమ్మెల్యే అక్బ‌రుద్దీన్ ఓవైసీ స్టైల్‌. అలా దూకుడుగా వెళ్లే ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ముందుకు పెద్ద చిక్కే వ‌చ్చి ప‌డింద‌ని ప్ర‌చారం జ‌రిగింది. అదే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఓటు ఎవరికి వేయాలనే విష‌యం గురించి. రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ లో పాల్గొంటామని మ‌జ్లిస్‌ పార్టీ అధ్యక్షుడు - ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే యూపీఏ నిలబెట్టిన అభ్యర్థి మీరాకుమార్‌ కు మజ్లిస్ ఓట్లు పడతాయా? లేక ఎన్డీఏ కూటమి బరిలో దించిన రాంనాథ్ కోవింద్‌ కు ఓట్లు వేస్తారా? అనేది చర్చనీయాంశమైంది.

సోమ‌వారమే ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఓవైసీ బ్ర‌ద‌ర్స్ ఓ క్లారిటీకి వ‌చ్చిన‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షల అభ్యర్థి మీరాకుమార్‌కు మజ్లిస్‌ పార్టీ మద్దతు తెలిపే అవకాశం ఉన్నట్లు సమాచారం. మజ్లిస్ పార్టీకి తెలంగాణ‌లో ఒక ఎంపీ - ఏడుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. మహారాష్ట్రలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. మ‌జ్లిస్ ఖాతాలోని మొత్తం పదిమంది సభ్యుల ఓట్లు రాష్ట్రపతి ఎన్నికల్లో  మీరాకుమార్‌ కు ఓటు పడతాయని ప్ర‌చారం జ‌రుగుతోంది. బీజేపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం స‌రికాద‌ని భావించి ఒకింత‌ త‌ర్జ‌న‌భ‌ర్జ‌న ప‌డి కాంగ్రెస్‌ కు మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్ధ‌మ‌యిన‌ట్లు ప‌లువురు విశ్లేష‌కులు చెప్తున్నారు.

2014కు ముందు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ కూటమికి మద్దతు ఇచ్చిన మజ్లిస్ - ఆ తరువాత ఆ పార్టీతో పూర్తిగా తెగతెంపులు చేసుకుని కాంగ్రెస్‌ పై విమర్శలు చేస్తోంది. ఇక బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నిలబెట్టిన రాంనాథ్ కోవింద్‌ కు మజ్లిస్ మద్ధతు ఇచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని మొద‌ట్లోనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2010లో రాంనాథ్ కోవింద్ దేశంలోని ముస్లింలు - క్రైస్తవుల పట్ల చేసిన వ్యాఖ్యలపై మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ నిప్పులు చెరుగుతున్నారు. అలాంటి వ్యక్తికి రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇస్తే ముస్లింవర్గాల ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందినే ఆందోళన మజ్లిస్ వర్గాలను వెంటాడింద‌ని అందులో భాగంగానే కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నార‌ని స‌మాచారం.

లౌకిక భావాలు కలిగిన పార్టీలతో కలిసి ముందుకు నడువడానికి సిద్ధంగా ఉన్న మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీతో క‌లిసి న‌డిచే విష‌యంలో గంద‌ర‌గోళ‌ప‌డింది. త‌మ ఓట్లు ఎవరికి వేయాలనే విషయంలో పోలింగ్ వరకు వేచి చూడాలని మజ్లిస్ పార్టీ భావిస్తున్నట్లు సమాచారం. కాగా మజ్లిస్ ఓట్లు తమ అభ్యర్థికే పడుతాయని యూపీఏ, ప్రతిపక్షాల కూటమి ఆశలు పెట్టుకుంది. బీజేపీకి మ‌జ్లిస్ ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఓటు వేసే ప‌రిస్థితి లేనందున ఎంఐఎం ప్ర‌జాప్ర‌తినిదుల ఓట్లు త‌మ అభ్య‌ర్థికే ప‌డుతాయ‌ని కాంగ్రెస్ స‌హా విప‌క్షాలు భ‌రోసాతో ఉన్నాయి.
Tags:    

Similar News