తెలంగాణ‌లో ఉండ‌గానే రాహుల్‌కు అదిరిపోయే ఆఫ‌ర్ ఇచ్చిన ఓవైసీ!

Update: 2022-05-07 15:04 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు స‌మీక‌ర‌ణాలు ఎలా మారిపోతాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. క‌లిసిక‌ట్టుగా ఉండే పార్టీలు కొన్ని రోజుల‌కే ఎవ‌రి దారి వారు చూసుకుంటారు. దానికి నిద‌ర్శ‌న‌మే ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీలు. ఒక‌నాడు జ‌ట్టుగా ఉన్న పార్టీలు ఇప్పుడు త‌మ దారి తాము చూసుకొని ముందుకు సాగుతున్నాయి.

తాజాగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తూ, టీఆర్ఎస్‌, బీజేపీతో స‌హా ఎంఐఎం అధినేత‌, ఎంపీ అస‌దుద్దీన్ ఒవైసీ స‌వాల్ చేసేందుకే తాను తెలంగాణ‌కు వ‌చ్చాన‌ని పేర్కొన‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. దీనిపై ఓవైసీ కూడా ఘాటుగానే స్పందించారు. ఇంకా చెప్పాలంటే రాహుల్ గాంధీకి ఓపెన్ ఆఫ‌ర్ ఇచ్చారు.

తెలంగాణ‌లోని రాజకీయాల‌పై రాహుల్ గాంధీ చేసిన కామెంట్ల‌పై తాజాగా ఎంఐఎం ఒవైసీ స్పందించారు.  ద‌మ్ముంటే హైదరాబాద్ లోక్‌స‌భ నుంచి బ‌రిలోకి దిగాల‌ని స‌వాల్ విసిరారు.  హైద‌రాబాద్ కాదంటే.. మెద‌క్ నుంచి కూడా పోటీకి దిగొచ్చ‌ని ఒవైసీ పేర్కొన్నారు.  వ‌చ్చే ఎన్నిక‌ల్లో వ‌య‌నాడ్ నుంచి కూడా ఓడిపోతార‌న్న విష‌యం త‌న‌కు తెలుస‌ని ఒవైసీ ఎద్దేవా చేశారు.

మ‌రోవైపు, గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు ఆయన దిశా నిర్దేషం చేశారు. కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా హైదరాబాద్ లో ఉండొద్దని, ఢిల్లీకి అసలే రావొద్దని రాహుల్  స్పష్టం చేశారు.

వరంగల్ డిక్లరేషన్ గురించి రాష్ట్రంలోని ప్రజలకు వివరించాలన్న ఆయన...ప్రతి ఒక్కరూ ప్రజల మధ్యే తిరగాలని, ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని చెప్పారు. పార్టీలో ఎంతటి సీనియర్ లీడర్లైనా సరే... పని చేస్తేనే గుర్తింపు లభిస్తుందని పదే పదే గుర్తు చేశారు. కష్టపడి పని చేసిన వాళ్లకి మెరిట్ ప్రాతిపదికన టిక్కెట్లు లభిస్తాయన్నారు.

అంతర్గత విబేధాలకు స్వస్తి పలికి... ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని సూచించారు.  నేతలు తమ తమ నియోజకవర్గాలకు వెళ్లి రైతులు, నిరుద్యోగులు, మహిళలు, యువకులు, కార్మికులు... ఇలా ప్రతి ఒక్కరి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. ఇలా రాహుల్ గాంధీ తెలంగాణ రాజ‌కీయాల‌పై ఫోక‌స్ చేస్తే, ఆయ‌న‌కు ఓవైసీ స్పెష‌ల్ ఆఫ‌ర్ ఇవ్వ‌డం స‌హ‌జంగానే చ‌ర్చ‌నీయాంశంగా మారింది.
Tags:    

Similar News