యూపీ అధికారంలో వాటా కావాలంటున్న ఒవైసీ!

Update: 2021-09-09 02:52 GMT
ఉత్త‌రాదిన వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లో హైద‌రాబాదీ పార్టీ మ‌జ్లిస్ త‌ల‌ప‌డ‌టం రొటీన్ గా మారింది.  మ‌హారాష్ట్ర‌తో మొద‌లుకుంటే.. ఉత్త‌రాదికి వెళ్లిన‌ట్ట‌ల్లా ఎంఐఎం పోటీలో నిలుస్తోంది. గ‌త ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కూడా ఎంఐఎం పోటీ చేసింది. అలాగే బెంగాల్ ఎన్నిక‌ల్లో కూడా హంగామా చేయ‌బోయింది. ఇక ఇప్పుడు యూపీ ఎన్నిక‌ల‌కు ఎంఐఎం రెడీ అవుతోంది. ఆ పార్టీ అధ్య‌క్షులు అస‌దుద్ధీన్ ఒవైసీ యూపీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ పోటీలో ఉంటుందంటూ ప్ర‌క‌టించాడు.

అంతే కాదు.. వీలైతే అధికారంలో వాటా కావాల‌ని ఒవైసీ అంటుండ‌టం గ‌మ‌నార్హం. ప్రీ పోల్ పొత్తుల‌కు త‌న పార్టీ రెడీ అని ఆయ‌న ప్ర‌క‌టించుకున్నారు. ఎస్పీ లేదా బీఎస్పీల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధ‌మంటూ ఆయ‌న ప్ర‌క‌టించారు. అయితే ఆ పార్టీల‌తో క‌లిసి ఎన్నిక‌ల్లో పోటీ చేయాలంటే.. యూపీలో ఏర్ప‌డే నాన్ బీజేపీ ప్ర‌భుత్వంలో ముస్లింల అధికార వాటా ఏమిటో తేలాలంటూ ఒవైసీ చెప్పుకొచ్చారు. పొత్తుల‌కు ముందే త‌మ‌కు ద‌క్కే ప‌ద‌వులు ఏమిటో తేలాలంటూ ఈయ‌న డిమాండ్ చేసేశారు.

అయితే ఎంఐఎంతో ఏ పార్టీలూ పొత్తుకు వెంప‌ర్లాడ‌టం లేదు. ఈ పార్టీ ఉనికిని బీజేపీ యేతర పార్టీలే ఇష్ట‌ప‌డ‌టం లేదు. ఎంఐఎం పోటీలో ఉండ‌టం వ‌ల్ల‌.. బీజేపీకి మేలు జ‌రుగుతోంద‌ని వివిధ పార్టీలు భావిస్తున్నాయి. ఎంఐంఎంను బూచిగా చూపిస్తూ బీజేపీ హిందువుల ఓట్ల‌ను గంప‌గుత్త‌గా మార్చుకున్న దాఖ‌లాలున్నాయ‌ని విశ్లేష‌కులు అంటున్నారు. ఒవైసీ కూడా కాంగ్రెస్, ఇత‌ర బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌ను దెబ్బ‌తీస్తూ.. బీజేపీకి వీలైనంత సాయం చేస్తున్నాడ‌నే విశ్లేష‌ణ‌లున్నాయి.

ఇలాంటి నేప‌థ్యంలో ఒవైసీతో ఎస్పీ కానీ, బీఎస్పీ కానీ జ‌త క‌ట్ట‌డం దాదాపు జ‌రిగే ప‌ని కాదు. కాంగ్రెస్ తోనే పొత్తుకు ఎస్పీ నో చెప్పేసింది. అలాంటిది ఎంఐఎంతో జ‌త క‌ట్ట‌డం అసంభ‌వం. బీఎస్పీ కూడా ఎంఐఎంతో జ‌త క‌ట్టే అవ‌కాశాలు లేన‌ట్టే. ఇలాంటి నేప‌థ్యంలో పొత్తుల‌కు పిలుపునిస్తూ అస‌దుద్ధీన్ హ‌డావుడి చేస్తున్నారు. సోలోగా స‌త్తా చూపించాల్సిన పరిస్థితులు త‌ప్ప‌.. ప్ర‌ధాన పార్టీల‌తో జ‌త క‌ట్టే ఛాన్స్ ఎంఐఎంకు లేక‌పోవ‌చ్చు!
Tags:    

Similar News