ఆగస్టు నాటికి అసెంబ్లీని కట్టేస్తారట

Update: 2016-04-02 04:34 GMT
ఏపీ సర్కారు మాంచి జోరు మీద ఉంది. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో సరికొత్త రికార్డుల్ని సృష్టించే దిశగా అడుగులు వేస్తోంది. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్ని ఏపీలోనే నిర్వహిస్తామని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు ఏపీ అసెంబ్లీలో ప్రకటించిన సంగతి తెలిసిందే. యనమల నోటి నుంచి ఈ మాట వచ్చిన తర్వాత.. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ నిర్వహిస్తారన్న ప్రశ్న రాగా.. ఎక్కడో ఏంది.. అమరావతిలోనే అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు మరో మంత్రి నారాయణ.

అమరావతిలో రాజధాని నిర్మాణం షురూ అయిన తర్వాత పనులు యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని.. భవన నిర్మాణం వేగంగా సాగుతోందని.. షేప్ విషయంలో కొద్దిపాటి మార్పులు చేయాల్సి రావటంతో పనులు ఇంకా మొదలు కాలేదని చెప్పారు. ఏది ఏమైనా అసెంబ్లీతో సహా మొత్తం ఐదు భవనాల్ని ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. తుళ్లూరు మండలం వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సెక్రటేరియట్ పనుల్ని పరిశీలించిన ఆయన.. అనుకున్న దాని కంటే ఐదు రోజుల ముందే తాత్కాలిక సెక్రటేరియట్ పనుల్ని పూర్తి చేస్తామని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. ఇప్పటివరకు అనుకున్న జీ ప్లస్ వన్ కు అదనంగా మరో రెండు అంతస్తులు వేయాలని నిర్ణయించినట్లుగా పేర్కొన్నారు.

జీ ప్లస్ వన్ లో మిగిలిన వసతుల్ని పక్కన పెడితే 4800 మంది ఉద్యోగులకు మాత్రమే వసతి కల్పించగలమని.. తాజాగా నిర్మించాలని భావిస్తున్న రెండు అంతస్తుల కారణంగా 12వేల మంది ఉద్యోగులు విధులు నిర్వహించే వీలుందని చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. అసెంబ్లీ నిర్మాణం సోమవారం లేదంటే బుధవారం నుంచి మొదలై.. ఆగస్టు నాటికి పూర్తి అవుతాయన్న భరోసాను ఆయన వ్యక్తం చేస్తున్నారు. నారాయణ చెప్పినట్లుగా ఏపీ అసెంబ్లీని ఆగస్టు నాటికి పూర్తి చేస్తే.. కేవలం నెలల వ్యవధిలోనే భారీ కట్టడాన్ని పూర్తి చేసిన ఘనత బాబు సర్కారుకు దక్కుతుందనటంలో సందేహం లేదు.
Tags:    

Similar News