తలాతోకా లేకుండా మంత్రిగారి మాటలు!

Update: 2017-08-06 08:37 GMT
కాపునాయకులకు కౌంటర్ ఇవ్వడానికి తెలుగుదేశం పార్టీకి అదే సామాజికవర్గంలో  దొరికిన ఏకైక తురుపుముక్క మంత్రి నారాయణ. నారాయణ ఆషామాషీ మంత్రి ఎంతమాత్రమూ కాదు. ఆయన ఉన్నత విద్యావంతుడు. డాక్టరేట్ కూడా చేశారు. కనీసం ఆయన నుంచి అయినా.. సాధారణ రాజకీయ నాయకుల్లా కాకుండా, కాస్త తర్కానికి నిలిచే ఆరోపణలు విమర్శలు రావాలని ప్రజలు ఆశిస్తే తప్పు కాదు. కానీ మంత్రి నారాయణ మాట్లాడుతున్న మాటలు మాత్రం.. తలాతోకా లేకుండా సాగిపోతున్నాయి. అధికార పార్టీకే పరువు తీసేలా తయారవుతున్నాయి.

కాపులకు రిజర్వేషన్లు కల్పించే వ్యవహారంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం చేస్తున్న అలవిమాలిన జాప్యానికి నిరసనగా కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం దీక్షలు చేస్తున్న సంగతి అందరికీ తెలుసు. ఆయన నిర్వహించదలచుకున్న పాదయాత్రలను పోలీసులు పదేపదే అడ్డుకుంటున్నప్పటికీ.. తన యాత్ర ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో ఎలాంటి కదలిక అయితే తీసుకురావాలనుకున్నారో అలాంటి ప్రయత్నంలో ఆయన సఫలమే అవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముద్రగడ వ్యవహారం హాట్ టాపిక్ అయిన ప్రతిసారీ.. తెదేపా తరఫున కౌంటర్ ఇవ్వడానికి కాపు ముద్రతో మంత్రి నారాయణ తెరమీదకు వస్తుంటారు.

కాకపోతే ఆయన ముద్రగడ మీద పనిగట్టుకుని బురద చల్లడానికా అన్నట్లుగా కాంగ్రెస్ పదేళ్లు పరిపాలిస్తోంటే.. అప్పుడు ఎందుకు ఉద్యమాలు చేయలేదు అని అంటూ ఉంటారు. తాజాగా కాపు రిజర్వేషన్ల గురించి విపక్ష నాయకుడు జగన్మోహనరెడ్డికి ముద్రగడ ఎందుకు లేఖ రాయలేదంటూ ప్రశ్నిస్తున్నారు.

నారాయణ మాటలు మరీ కామెడీగా సాగిపోతున్నాయి. చంద్రబాబు తన ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు గనుక.. దాన్ని నిలబెట్టుకోమంటూ ముద్రగడ అడుగుతున్నారే తప్ప  మరొకటి కాదు. చంద్రబాబు వాస్తవంలో చేస్తున్న ద్రోహం గుర్తించకుండా ఆయన మీద పొగడ్తలు కురిపించినందువల్లే.. పవన్ కల్యాణ్ కు వాస్తవాలు తెలియజేస్తూ లేఖ రాశారు. చంద్రబాబు ఇచ్చిన హామీ గురించి జగన్ కు లేఖ రాస్తే ఏం ఒరుగుతుంది.. అనే లాజిక్ ను కూడా మంత్రి నారాయణ మిస్సయినట్లుగా కనిపిస్తోంది.
Tags:    

Similar News