‘అమ్మ’ ఆరోగ్యంపై శుభవార్త చెప్పేశారు

Update: 2016-10-11 05:38 GMT
గడిచిన 20 రోజులుగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమ్మ అభిమానులకు ఇది కచ్ఛితంగా శుభవార్తే. అమ్మ ఆరోగ్యంపై ఆందోళన చెందుతూ ఆగమాగంఅయిపోతున్న వారంతా దసరా పండుగ రోజున సంతోషంగా పండగ చేసుకునే తీపి కబురు వచ్చేసింది. తీవ్ర అస్వస్థతతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నఅమ్మను పరామర్శించేందుకు ఇప్పటివరకూ చాలామంది వచ్చినా.. ఎవరూ చేయనంత స్పష్టంగా ప్రకటన చేసేశారు కొందరు ప్రముఖులు. వారి పుణ్యమా అని తమిళనాడులో ఇప్పుడు కొత్త ఉత్సాహం రెక్కలు విప్పింది.

అమ్మ ఆరోగ్యంపై ఉన్న సందేహాల్ని పటాపంచలు చేసేలా కేరళ గవర్నర్ జస్టిస్ స‌దాశివం.. ముఖ్యమంత్రి పినరయ్ విజయన్‌.. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీలు ఆసుపత్రికి వచ్చారు. అమ్మ ఆరోగ్యంపై వివరాలు అడిగి తెలుసుకున్న వారు.. అన్నాడీఎంకే నేతల్ని పరామర్శించారు. జ‌య‌ ఆరోగ్యం మరింత మెరుగవ్వాలన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

ఆసుపత్రి నుంచి బయటకు వచ్చిన వారంతా.. అమ్మ ఆరోగ్యం బాగుందని..ఆమె త్వరగా కోలుకుంటున్నారని.. త్వరలోనే డిశ్చార్జ్ అవుతారంటూ వెల్లడించారు. వీరితో పాటు తమిళనాడుకు చెందిన వివిధ పార్టీల‌ నేతలు అన్నాడీఎంకే ముఖ్య నేతలతో జయలలిత ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా.. అమ్మకు అందిస్తున్న వైద్య సేవలకు సంబంధించిన మరికొన్ని వివరాల్ని అపోలో ప్రకటించింది. ఆమెకు శ్వాస సహాయక చికిత్స చేస్తున్నామని.. యాంటీబయాటిక్స్ మందులు ఇస్తున్నట్లు చెప్పిన వారు.. ఆమెకు అవసరమైన ఫిజియోథెరపీ కూడా అందిస్తున్నట్లు వెల్లడించారు. మొత్తంగా చూస్తే.. అమ్మ ఆరోగ్యం ఆందోళనకర స్థాయి నుంచి క్రమక్రమంగా సాధారణ స్థాయికి వస్తున్నట్లుగా చెప్పేయొచ్చు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News