తెలంగాణకు తొలి మ‌హిళా స్పీక‌ర్ ?

Update: 2018-12-16 11:22 GMT
తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకోబోతున్నారా ?  తెలంగాణ‌కు తొలి మ‌హిళా స్పీక‌ర్ రాబోతుందా ? అంటే కొన్ని స‌మీక‌ర‌ణాలు నిజ‌మే అంటున్నాయి. తెలంగాణ తొలి మ‌హిళా స్పీక‌ర్ గా మాజీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డిని ఎంపిక చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. దీంతో మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇచ్చిన‌ట్లు ఉంటుంది. ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డికి ప‌దోన్న‌తి క‌ల్పించిన‌ట్లు ఉంటుంద‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. టీఆర్ ఎస్ శ్రేణుల‌లోనూ ఈ విష‌యం చ‌క్క‌ర్లు కొడుతుంది. డిప్యూటీ స్పీక‌ర్ గా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్నందున ప‌ద్మాదేవేంద‌ర్ రెడ్డికి ఈ సారి అవ‌కాశం ఇవ్వాల‌ని అనుకుంటున్న‌ట్లు తెలుస్తుంది.

ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డిని కాద‌నుకుంటే ఆ స్థానం మాజీ ఆర్ధిక‌మంత్రి ఈటెల రాజేంద‌ర్ కు ద‌క్కుతుంద‌ని తెలుస్తుంది. భూపాల‌ప‌ల్లి నుండి పోటీ చేసిన‌ స్పీక‌ర్ మ‌ధుసూధ‌నాచారి కాంగ్రెస్ అభ్య‌ర్థి చేతిలో ఓట‌మి పాల‌య్యారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న స్థానంలో ఈటెల రాజేంద‌ర్ ను స్పీక‌ర్ చేస్తే బీసీల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించిన‌ట్లు అవుతుంది. అంతే కాకుండా బీసీల స్థానంలో మ‌రొక‌రికి కాకుండా మ‌ళ్లీ వారి స్థానం వారికే ఇచ్చిన‌ట్లు అవుతుంది.

తొలివిడ‌త‌గా స్పీక‌ర్ - డిప్యూటీ స్పీక‌ర్ - ప్ర‌భుత్వ చీఫ్ విప్ - విప్ పోస్టుల‌ను భ‌ర్తీ చేసి ఆ త‌రువాత మంత్రివ‌ర్గం పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని - అన్ని వ‌ర్గాల‌కు స‌ముచిత స్థానం క‌ల్పించాల‌ని కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తుంది. ఎస్సీ - ఎస్టీ - బీసీ - ఓసీల‌లో తొలి నుండి పార్టీని న‌మ్ముకున్న వారికి ఇవ్వాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని, గ‌తంలో మంత్రులుగా ఉన్న జూప‌ల్లి కృష్ణారావు - తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు - ప‌ట్నం మ‌హేంద‌ర్ రెడ్డి - ఆజ్మీరా చందులాల్ లు కూడా ఓడిన వారిలో ఉన్నారు. ఈ స్థానాల‌ను ఆయా ఉమ్మ‌డి జిల్లాల ప్రాతిప‌దిక‌న భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తుంది. టీఆర్ ఎస్ త‌ర‌పున 88 మంది ఎమ్మెల్యేలుగా గెల‌వ‌డంతో పాటు స్వేఛ్చ‌గా నిర్ణ‌యం తీసుకునేందుకు కేసీఆర్ కు ఈ సారి అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో స‌మ‌ర్ధుల‌కే ప‌ట్టం క‌డ‌తార‌ని పార్టీ శ్రేణులు అంటున్నాయి.
    

Tags:    

Similar News