పాక్ యువతి పెళ్లాడిన సెక్యూరిటీ గార్డు.. అడ్డంగా బుక్కయ్యాడు..!

Update: 2023-01-24 23:00 GMT
ప్రేమ కోసం లవర్స్ ఎంత దూరమైన వెళ్తారనే సంగతి అందరికీ తెలిసిందే. పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్న ఘటనలు అనేక సినిమాల్లో.. రియల్ లైఫ్ లోనూ ఉన్నాయి. అయితే ఓ విదేశీ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్న యూపీకి చెందిన యువకుడు మాత్రం చివరికి జైలు పాలుకావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. యూపీకి చెందిన యులాయం సింగ్ యాదవ్(25) బెంగుళూరులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఆన్ లైన్ గేమింగ్ ఆడుతున్న క్రమంలో పాకిస్థాన్ కు చెందిన ఇక్రా జీవని(19)తో ములాయంకు పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారడంతో వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

ఈక్రమంలోనే ఆ యువతిని పెళ్లాడేందుకు యులాయం నేపాల్ కు వెళ్లాడు. ఇక్రా సైతం పాకిస్థాన్ నుంచి నేపాల్ కు చేరుకుంది. వీరిద్దరు అక్కడే పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత ఇండో నేపాల్ సరిహద్దు ద్వారా తప్పుడు సమాచారంతో దేశంలోకి వచ్చారు. తొలుత వీరు యూపీకి వెళ్లారు. అక్కడ పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో యులాయం ఇది వరకు పని చేసిన బెంగుళూరు వీరిద్దరు వెళ్లి కాపురం పెట్టారు.
 
సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్న ములాయం తన భార్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన అధికారులు తాజాగా వీరిద్దరిని అదుపులోకి తీసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక్రాను భారతీయురాలు అని తెలిపేలా ములాయం తప్పుడు మార్గంలో ఆధార్ తీసుకోవడమే కాకుండా పాస్ పోర్టుకు అప్లయ్ చేశారు. వీరి మధ్య రిలేషన్ గుర్తించిన అధికారులు రహస్యంగా దర్యాప్తు చేపట్టారు.

ఇక్రాకు సంబంధించిన రికార్డులన్నీ నకిలీగా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో ములాయం భార్య పాకిస్థాన్ లోని తన పుట్టింటి వారితో ఫోన్లో మాట్లాడటాన్ని అధికారులు గుర్తించారు. వీటన్నింటిని క్రాస్ చెక్ చేయడంతో అసలు నిజాలు బయటికి వచ్చారు. దీంతో పోలీసులు వీరిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ములాయంను జైలుకు తరలించగా ఇక్రాను మాత్రం విదేశీ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ కు అప్పగించి స్టేట్ హోంకు తరలించారు. వీరిద్దరు పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా నివాసం ఉంటున్న నేపథ్యంలో చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం అవుతున్నారు. విదేశీ మహిళను ప్రేమించటం నేరం కాకపోయినా చేసిన పని చట్టబద్ధంగా లేకుంటే ఇలాంటి ఇబ్బందులు వస్తాయని ఈ సంఘటన చూస్తే అర్థమవుతుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News