పాకిస్తాన్ బౌలర్ బౌన్సర్ కు పగిలిన బ్యాటర్ ముఖం

Update: 2022-10-30 11:11 GMT
టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ బౌలర్లు తొలిసారి సత్తా చాటారు. ఇప్పటికే టీమిండియా, జింబాబ్వేపై తేలిపోయిన పాక్ బ్యాచ్ .. మరి పసికూన నెదర్లాండ్ పై సత్తా చాటారు. నిప్పులు చెరిగే బంతులు వేశారు. పెర్త్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ పూర్తిగా ఏకపక్ష విజయం సాధించింది. పాకిస్తాన్ బౌలర్ల ధాటికి నెదర్లాండ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 91 పరుగులు మాత్రమే చేయగలిగింది. 9 వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరు చేసింది. జట్టు మొత్తానికి ఇద్దరు బ్యాటర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. మిడిల్ ఆర్డర్ కొలిన్ అక్కెర్ మన్ 27, కెప్టెన్ ఎడ్వర్డ్స్ 15 పరుగులు మాత్రమే చేశారు. వీరిద్దరే టాప్ స్కోరర్లు. మిగిలిన బ్యాటర్లందరూ పట్టుమని 10 పరుగులు చేయలేకపోయారు.

ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్లు తమ సత్తా చాటారు. సమిష్టిగా రాణించారు. నిప్పులు చెరిగే బంతులను సంధించారు. నెదర్లాండ్స్ బ్యాటర్లను వణికించారు. షాదాబ్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. తన నాలుగు ఓవర్ల కోటాలో 22 పరుగులు ఇచ్చి ముగ్గురు బ్యాటర్లను పెవిలియన్ పంపించాడు. మహ్మద్ వసీం అదే స్తాయిలో ప్రతాపం చూపాడు. మూడు ఓవర్లలో 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

పాక్ బౌలర్లు షాహీన్ షా అఫ్రిది, నసీం షా, హ్యారీస్ రవూఫ్ నిప్పులు చెరిగారు.  నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ మొత్తం మీద అయిదే అయిదు ఫోర్లు నమోదయ్యాయంటే పాక్ బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పాక్ స్పీడ్ స్టర్ హ్యారీస్ రవూఫ్ బౌలింగ్ లో ఓపెనర్ బాస్ డీ లిడే గాయపడ్డాడు. రవూఫ్ సంధించిన రాకాసి బౌన్సర్ ను షాట్ ఆడబోయిన లిడె టైమింగ్ మిస్ అయ్యాడు. అది నేరుగా లిడె ముఖాన్ని బలంగా తాకింది. హెల్మెట్ గ్రిల్స్ కూడా ఆ బంతి వేగాన్ని అడ్డుకోలేకపోయింది. 140 కిలోమీటర్ల వేగంతో వచ్చిన ఆ బంతి ధాటికి లిడె కంటి కింద గయామైంది. హెల్మెట్ సైతం క్రాక్ అయినట్లు గుర్తించారు. కొద్దిసేపు క్రీజులోనే లిడె కూర్చుండి పోయాడు. ఫిజియో సూచనల మేరకు రిటైర్డ్ హర్ట్ గా వైదొలిగాడు. తలకు తాకడంతో అతడి స్థానంలో మరో బ్యాట్స్ మెన్ బదిలీ చేసి ఆడించారు.

ఐసీసీ నిబంధనల ప్రకారం తలకు తగిలి గాయపడితే సబ్ స్టిట్యూట్ గా మ్యాచ్ లో ఆడని ఆటగాడిని తీసుకోవచ్చు. అలా పాక్ బౌలర్ దెబ్బకు మరో బ్యాట్స్ మెన్ ను దించాల్సి వచ్చింది.
Tags:    

Similar News