పాక్ 'హనీ ట్రాప్'.. ఉచ్చులో విదేశీ మంత్రిత్వ శాఖ డ్రైవర్.. ట్విస్ట్ ఇచ్చిన ఇంటెలిజెన్స్..!

Update: 2022-11-19 02:40 GMT
ఇటీవలి కాలంలో భారత్ లో తరుచూ హనీ ట్రాప్ కేసులు సంచనలం సృష్టిస్తున్నాయి. భారత ఆర్మీ.. వైమానిక దళానికి చెందిన పలు రహస్యాలను పాకిస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి 2019లో ఒక సైనికుడిని హనీ ట్రాప్ ఉచ్చులోకి లాగింది. అతడి నుంచి పలు కీలక రహస్యాలను తెలుసుకుందని మీడియాలో అప్పట్లో కథనాలు వచ్చాయి.

సైనికుడి రోజువారీ చర్యలపై అనుమానం రావడంతో ఇంటెలిజెన్స్ వర్గాలు అతడిపై నిఘా పెట్టాయి. భారత సైనికుడిని పాక్ యువతి హన్ ట్రాప్ చేసిందనే విషయాన్ని ఆర్మీ గుర్తించి అతడిని అరెస్టు చేసింది. ఈ సంఘటన తర్వాత నిఘా వర్గాలు మరింతగా అప్రమత్తమయ్యాయి. అయితే తాజాగా మరోసారి హనీ ట్రాప్ ఉచ్చులో విదేశీ మంత్రిత్వ శాఖ డ్రైవర్ పడిపోవడం చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. పాకిస్థానీ నిఘా ఏజెన్సీకి చెందిన ఓ మహిళ విదేశీ మంత్రిత్వ శాఖలో డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తితో ఫేస్ బుక్.. వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుంది. కొన్నిసార్లు పూనమ్ శర్మగాను.. మరికొన్ని సార్లు పూజాగా పరిచయం చేసుకొని అతడిని ముగ్గులోకి లాగింది. ఆమె ట్రాప్ లో పడిన డ్రైవర్ భారత్ కు సంబంధించిన కీలక విషయాలను చేరవేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ నేపథ్యంలోనే గూఢచర్యం ఆరోపణలతో సదరు డ్రైవర్ ను ఇంటెలిజెన్స్ వర్గాలు శుక్రవారం న్యూఢిల్లీలో అరెస్టు చేశాయి. పాక్ యువతి పెళ్లి చేసుకుందామని డ్రైవర్ ను ఉచ్చులోకి లాగిందని ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఆమె మాయలో పడిన డ్రైవర్ భారత్ కు సంబంధించిన పలు కీలక విషయాలు ఆమెతో పంచుకున్నట్లు గుర్తించినట్లు తెలుస్తోంది.  

ఇక భారత్ ను నేరుగా ఎదుర్కొనే దమ్ములేని పాకిస్థాన్ ఇటీవలీ కాలంలో మన సైనికులపై తరుచూ హనీట్రాప్ కు పాల్పడుతోంది. అందమైన యువతులను ఎరగా వేస్తూ భారత రహస్యాలను తెలుసుకునేందుకు యత్నిస్తోంది. 2015 నుంచి 2017 మధ్య కాలంలో భారత్ లో ఐదు హనీ ట్రాప్ కేసులు నమోదయ్యాయని కేంద్రం రాజ్యసభలో తెలిపింది.

2019 సంవత్సరంలోనూ జైసల్మేర్‌ రెజిమెంట్‌లోని ఒక జవాన్ ను పాక్ యువతి హనీ ట్రాప్ చేయడం అప్పట్లో కలకలం సృష్టించింది. ఇక తాజాగా మరోసారి విదేశీ మంత్రిత్వ శాఖకు చెందిన డ్రైవర్ ను పాక్ ఏజెన్సీకి చెందిన యువతి ట్రాప్ చేసింది. దీనిని ముందుగానే గుర్తించిన నిఘా వర్గాలు అల్టర్ అతడిని అరెస్టు చేయడంతో పాక్ 'హనీ ట్రాప్' ప్రస్తుతానికి బెడిసి కొట్టింది.

ఇటీవల కాలంలో తరుచూ ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తున్న నేపథ్యంలో కీలక శాఖల్లో పని చేసే ఉద్యోగులు.. రాజకీయ వేత్తలు పాక్ ముద్దుగుమ్మల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. లేనట్లయితే అరెస్టయి జైల్లో ఊచలు లెక్క పెట్టుకోవాల్సిందేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News