పాక్‌.. చైనా దుర్మార్గాల‌కు సాక్ష్యాలివే

Update: 2017-08-05 06:16 GMT
దేశానికి స‌రిహ‌ద్దు దేశాలుగా ఉన్న పాకిస్థాన్‌.. చైనాలు దొందూ దొందూ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఒకదానికి మించి మ‌రొక‌టి వ్య‌వ‌హ‌రిస్తున్నాయి. ఉగ్ర‌వాదుల్ని దేశంలోకి పంప‌టం ద్వారా దేశాన్ని అల్ల‌క‌ల్లోలం చేయాల‌ని పాక్ ప్ర‌య‌త్నిస్తుంటే.. దేశ స‌రిహ‌ద్దుల్లోకి చొచ్చుకురావ‌టం ద్వారా గుండెల్లో గునపం మాదిరి మారాల‌ని దుష్ట‌య‌త్నాల్ని చేస్తోంది చైనా. ఈ రెండు దేశాల దుర్మార్గాల‌పై కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తాజాగా ప‌లు సాక్ష్యాల్ని చెప్పుకొచ్చారు.

స‌రిహ‌ద్దుల వెంట పాక్ ప్రేరేపిత ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా అడ్డుకుంటున్న‌ట్లుగా జైట్లీ లోక్ స‌భ‌లో వెల్ల‌డించారు. ఉగ్ర‌వాదుల చొర‌బాట్ల‌ను నిలువ‌రించేందుకు కాల్పులు జ‌ర‌పాల్సి వ‌స్తోంద‌న్న విష‌యాన్ని ఆయ‌న లోక్ స‌భ‌లో ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో భాగంగా పేర్కొన్నారు. కాల్పుల ఉదంతాల్లో అవ‌త‌లి ప‌క్షానికి చెందిన వారే ఎక్కువ‌గా గాయ‌ప‌డుతున్న‌ట్లుగా ఆయ‌న చెప్పారు.

పాక్ ముష్క‌రులు భార‌త్ లోకి ప్ర‌వేశించేందుకు పెద్ద ఎత్తున ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని చెప్పారు. వారిని బీఎస్ఎఫ్‌.. ఆర్మీలు ధీటుగా ఎదుర్కొంటున్నాయ‌న్న ఆయ‌న‌.. ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు పాక్ ఎల్ఓసీ వెంట 285 సార్లు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి తూట్లు పొడిచిన వైనాన్ని వెల్ల‌డించారు.

గ‌త ఏడాది పాక్ 228 సార్లు కాల్పుల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ‌గా.. ఈ ఏడాది ఏడు నెల‌లు పూర్తి అయ్యేస‌రికే 285 సార్లు కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని ఉల్లంఘించ‌టం గ‌మ‌నార్హం. ఈ ఘ‌ట‌న‌ల‌తో ఎనిమిది మంది పౌరులు ప్రాణాలు కోల్పోయిన‌ట్లుగా జైట్లీ చెప్పారు. చొర‌బాట్ల‌ను ప్ర‌త్యేక సెన్సార్లు.. రాడార్ల సాయంతో నిలువ‌రిస్తున్న‌ట్లు చెప్పారు.

ఇదిలా ఉండ‌గా చైనాతో డోక్లాం వివాదం కొన‌సాగుతూనే ఉంది. భార‌త్ - పాక్ ల మ‌ధ్య నెల‌కొన్న శ‌త్రుత్వాన్ని త‌న‌కు అనుకూలంగా మార్చుకునేందుకు చైనా శాయ‌శ‌క్తులా కృషి చేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు పాక్ కు ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ఇచ్చిన చైనా.. తాజాగా పాక్ ఆక్ర‌మిత కాశ్మీర్ లో ఆరు డ్యామ్‌ల‌ను నిర్మించేందుకు అవ‌స‌ర‌మైన సాయాన్ని ఇచ్చేందుకు సిద్ద‌మ‌వుతోంది. పీవోకేలోని సింధూ న‌దిపై చైనా సాయంతో ఆరు డ్యామ్ ల‌ను పాక్ నిర్మిస్తున్న‌ట్లుగా కేంద్ర విదేశాంగ స‌హాయ‌మంత్రి వీకే సింగ్ వెల్ల‌డించారు. కాశ్మీర్ భూభాగాల‌ను పాక్ చ‌ట్ట‌విరుద్ధంగా ఆక్ర‌మించ‌ట‌మే కాదు.. ఇప్పుడు భార‌త సార్వ‌భౌమ‌త్వాన్ని.. ప్రాదేశిక స‌మ‌గ్ర‌త‌ను ఉల్ల‌ఘిస్తున్న‌ట్లుగా ఆయ‌న మండిప‌డ్డారు. చూస్తుంటే.. ఈ ఆరు డ్యామ్ ల నిర్మాణం భార‌త్‌.. పాక్‌.. చైనాల మ‌ధ్య మ‌రింత ఉద్రిక్త‌త‌లు పెంచటం ఖాయ‌మ‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News