పాక్ ప్రధాని గాలి తీసేసిన ట్రంప్

Update: 2016-12-01 11:32 GMT
మిగిలిన వారి లాంటోడు కాదు ట్రంప్ అన్న మాటకు తగ్గట్లే వ్యవహరిస్తున్నారాయన. తాజాగా దాయాది పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ గాలి తీసేయటమే కాదు.. తలెత్తుకోలేకుండా చేసిన వైనం తాజాగా చోటు చేసుకుంది. ఇలాంటి పరిణామాన్ని ఏ మాత్రం ఊహించని పాకిస్థాన్ ప్రధానమంత్రి  కార్యాలయానికి ఇప్పుడేం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇంతకీ ఏం జరిగిందన్న విషయంలోకి వెళితే..

తన ఎన్నికల ప్రచారం సందర్భంగా పాకిస్థాన్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ట్రంప్.. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ఆయన అభివర్ణించారు. పాక్ అంటేనే విరుచుకుపడే ట్రంప్ తో.. ఇటీవల పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఫోన్ చేసి మాట్లాడారు. ఇంతవరూ సాఫీగానే సాగినా.. ఈ ఫోన్ సంభాషణ విషయంలో అత్యుత్సాహానికి పోయిన షరీఫ్ కార్యాలయం.. కాస్త ఓవర్ యాక్షన్ చేసింది. పాక్ ప్రధాని ఫోన్ చేసి మాట్లాడిన సందర్భంగా పాకిస్థాన్ పై ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించినట్లుగా పేర్కొంది. అధికారికంగా విడుదలైన ప్రధాని కార్యాలయ ప్రకటనను ట్రంప్ అధికారిక బృందం తాజాగా కొట్టి పారేసింది.

పాక్ పీవోఎం అతి శయోక్తులతో.. ఉన్నది లేనట్లు.. లేనిది ఉన్నట్లుగా ప్రకటనను విడుదల చేసిందని.. ట్రంప్ పాక్ పై ప్రశంసలేవీ చేయలేదని వివరణ ఇచ్చింది. ఈ రోజు ట్రంప్.. షరీఫ్ లు ఫోన్లో మాట్లాడుకున్నారు.. పాక్.. అమెరికాల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం ఎలా చేసుకోవాలన్న అంశంపై వారి సంభాషణ సాగిందంటూ ఉన్న విషయాన్ని ఉన్నట్లుగా తేల్చేశారు. ఇలా ఒక దేశ ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన ప్రకటనను సరిచేస్తూ.. అధ్యక్షుడిగా ఎన్నికైన వ్యక్తి సవరణ ప్రకటన విడుదల చేయటం చాలా అరుదైన విషయంగా చెబుతున్నారు. ఏది ఏమైనా.. అంతర్జాతీయంగా పాక్ ప్రధానమంత్రి కార్యాలయం గాలి మాత్రం ట్రంప్ మాత్రం అడ్డదిడ్డంగా తీసేశారనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News