మోదీ ఓకే అన్నా... దావూద్ రాలేడ‌ట‌!

Update: 2017-10-04 12:16 GMT
భార‌త ఆర్థిక రాజ‌ధాని ముంబైలో మార‌ణ హోమం సృష్టించేసి క్ష‌ణాల్లో దేశం విడిచి పారిపోయిన అండ‌ర్ వ‌రల్డ్ డాన్ దావూద్ ఇబ్ర‌హీం ఇప్పుడు చ‌క్ర‌బంధంలో చిక్కుకున్నాడ‌ట‌. ఏ దేశ‌మైతే త‌న‌కు సేఫ్ అని భావించి అక్క‌డికి వెళ్లాడో... అక్క‌డే అత‌డు బందీ అయిపోయాడ‌ట‌. ఇదేదో భార‌త నిఘా వ‌ర్గాలో, దావూద్‌ కు వ్య‌తిరేకంగా ప‌నిచేస్తున్న గ్యాంగ్‌ స్ట‌ర్లో చెబుతున్న మాట కాదు. స్వ‌యానా అత‌డి తోడ‌బుట్టిన సోద‌రుడు ఇక్బాల్ క‌స్క‌ర్ చెబుతున్న న‌మ్మ‌లేని నిజాలే. ఇటీవ‌లే ముంబైకి చెందిన ఓ బిల్డ‌ర్‌ ను డ‌బ్బుల కోసం బెదిరించిన కేసులో అరెస్టైన క‌స్క‌ర్ పోలీసుల విచార‌ణ‌లో ప‌లు విష‌యాలు వెల్ల‌డించిన విష‌యం తెలిసిందే. క‌స్క‌ర్ విచార‌ణ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. ఈ క్ర‌మంలో తాజాగా అత‌డు వెల్ల‌డించిన వివ‌రాల్లో... దావూద్ పాకిస్థాన్‌ లోనే బందీగా మారిన వైనం వెలుగు చూసింది.

ఆ వివ‌రాలేంటో ఓ సారి ప‌రిశీలిద్దాం. ఇటీవలి కాలంలో దావూద్ తిరిగి ఇండియాకు రావాలని భావిస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. 2015లో దావూద్ తనను సంప్రదించి, భారత్ కు రావాలన్న కోరికను దావూద్‌ వెల్లడించాడని సీనియర్ న్యాయవాది రామ్ జఠ్మలానీ వెల్లడించారు. దావూద్ ను తాను లండన్ లో కలిశానని, గృహ నిర్బంధంతో సరిపెడితే తాను ఇండియాకు వస్తానని చెప్పినట్టు జఠ్మలానీ పేర్కొన్నారు. ఇందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు కూడా కాస్తంత సానుకూలంగానే స్పందించింద‌న్న వార్త‌లు వెలువ‌డ్డాయి. అయితే దావూద్ ఇండియాకు వ‌చ్చేందుకు మోదీ స‌ర్కారు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చినా... దావూద్‌ ను త‌న భూభాగం దాటి బ‌య‌ట‌కు వెళ్లేందుకు పాకిస్థాన్ అనుమతించే ప్ర‌సక్తే లేద‌ని క‌స్క‌ర్ వెల్లడించాడు. పాక్ గూఢ‌చార సంస్థ ఇంట‌ర్ స‌ర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ ఐ) దావూద్ ను బ‌య‌ట‌కు పంపేందుకు స‌సేమిరా అన‌డం ఖాయ‌మేన‌ని అత‌డు చెప్పుకొచ్చాడు.

ఇందుకు గ‌ల కార‌ణాల‌ను కూడా క‌స్క‌ర్ వివ‌రించాడు. ఐఎస్ ఐకి చెందిన మొత్తం గుట్టు అంతా దావూద్‌కు తెలిసిపోయింద‌ట‌. అస‌లు ఆ సంస్థ ఉద్దేశాలు - కార్య‌క‌లాపాలు, పాక్ ప్ర‌భుత్వానికి ఆ సంస్థ‌కు ఉన్న సంబంధాలు, భార‌త్ స‌హా ఇత‌ర దేశాల‌పై పాక్ ప్ర‌భుత్వ వైఖ‌రిని శాసిస్తున్న ఆ సంస్థ వైఖ‌రి కూడా దావూద్‌ కు బాగానే తెలుస‌ట‌. అంతేకాకుండా.. ఉగ్ర‌వాద సంస్థ‌ల‌కు పాక్ ప్ర‌భుత్వంతో పాటు ఐఎస్ ఐ కూడా ఏ ర‌కంగా స‌హ‌క‌రిస్తున్న విష‌యం కూడా దావూద్‌కు తెలిసింద‌ట. ఈ క్ర‌మంలో దావూద్ భార‌త్‌కు వ‌స్తే.. పాక్ గుట్టు మొత్తం ప్ర‌పంచానికి ప‌క్కా సాక్ష్యాల‌తో స‌హా తెలిసిపోవ‌డం ఖాయం. ఈ కార‌ణంగానే దావూద్ ఎంట్రీకి భార‌త్ ఓకే అన్నా కూడా పాకిస్థాన్ ప్ర‌భుత్వం... ప్ర‌త్యేకించి ఆ దేశ గూఢ‌చార సంస్థ ఐఎస్ ఐ ఒప్పుకునే ప్ర‌స‌క్తే లేద‌ని క‌స్క‌ర్ చెప్పుకొచ్చాడు. ఈ విష‌యాల‌న్నీ తెలిసిన మీద‌ట త‌న సోదురుడు దావూద్ కూడా భార‌త్ రావాల‌న్న నిర్ణ‌యాన్ని మార్చుకున్నాడ‌ని అత‌డు తెలిపాడు. సో... క‌ర‌డుగ‌ట్టిన ఉగ్ర‌వాదిగా పేరుగాంచిన దావూద్ భార‌త్‌ లో తిరిగి అడుగుపెట్టే ప్ర‌సక్తే లేద‌న్న మాట‌.
Tags:    

Similar News