ఇమ్రాన్ కు ఊహించనిరీతిలో న్యూయార్క్ లో షాక్

Update: 2019-09-27 07:55 GMT
దౌత్యపరంగానూ.. అంతర్జాతీయ సమాజంలోనూ అంతకంతకూ తగ్గుతున్న పాక్ పరపతిని మరింత దెబ్బ తీసే పరిస్థితులు తాజాగా న్యూయార్క్ మహానగరంలో చోటు చేసుకున్నాయి. ఈ రోజు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రసంగించనున్న వేళ.. ఊహించని రీతిలో న్యూయార్క్ వీధుల్లోని వాహనాల మీద కొత్త నినాదాలతో పోస్టర్లు.. ఎల్ ఈడీ స్క్రీన్లు దర్శనమిచ్చాయి.

పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఉన్న ఈ ప్రకటనలు ఇప్పుడా దేశ ప్రతినిధులకు కొత్త సమస్యను తెచ్చి పెట్టింది. పాక్ లోని మైనార్టీలపై సాగుతున్న ఆరాచకాలు.. అణిచివేతపై గళం విప్పుతూ ట్యాక్సీలు.. ట్రక్కులపై భారీ డిజిటల్ డిస్ ప్లే ప్రకటనలు దర్శనమిచ్చాయి.

అమెరికాకు చెందిన హక్కుల సంస్థ వాయిస్ ఆఫ్ కరాచీ అధ్వర్యంలో పాక్ మైనార్టీల కోసం గళాన్ని విప్పారు. పాక్ కు వ్యతిరేకంగా డిస్ ప్లే బోర్డులు ఉన్న వాహనాలన్ని ఐక్యారాజ్య సమితి కార్యాలయం సమీపంలో తిరుగుతుండటంతో ఈ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఐక్య రాజ్యసమితి నిర్దేశిస్తున్న మానవహక్కులు పాక్ లో ఏ మాత్రం అమలు కావటం లేదని.. పాక్ విషయంలో ఐకాస జోక్యం చేసుకోవాలన్న డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.

దీంతో.. ఈ వ్యవహారం ఇప్పుడు పాక్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. ఊహించని రీతిలో చోటు చేసుకున్న ఈ నిరసనకు ఇమ్రాన్ అండ్ కో సిద్ధంగా లేరని.. దీన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. పాక్ లోని మైనార్టీలైన మొహజిర్స్ కు పాక్ లో ఎలాంటి హక్కులు కల్పించటం లేదంటూ వారు వాదిస్తున్నారు. అంతేకాదు.. ఈ విషయంలో ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని కరాచీమాజీ మేయర్ వసే జలీల్ కూడా ప్రకటన చేయటం ఇమ్రాన్ కు మరింత ఇబ్బందికి గురి చేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News