అహ్మ‌దాబాద్ పిచ్ పై పాకిస్తాన్ ఆట‌గాడు ఫైర్‌.. చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్‌!

Update: 2021-03-03 11:35 GMT
భార‌త్ - ఇంగ్లండ్ మ‌ధ్య అహ్మదాబాద్ లో జ‌రిగిన పింక్ బాల్ (డే/నైట్) టెస్టు మ్యాచ్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కొంద‌రు ఈ పిచ్ పై విమ‌ర్శ‌లు చేస్తుండ‌గా.. మ‌రికొంద‌రు స‌మ‌ర్థిస్తున్నారు. కేవ‌లం రెండు రోజుల్లోనే టెస్టు ముగియ‌డం ఏంట‌ని మాజీ ఆట‌గాళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. ఈ జాబితాలో పాకిస్తాన్ దిగ్గ‌జ ఆట‌గాడు ఇంజ‌మాముల్ హక్ తీవ్రంగా స్పందించారు. టీ-20 మ్యాచ్ క‌న్నా దారుణంగా ఈ టెస్టు మ్యాచ్ కొన‌సాగింద‌న్న ఇంజ‌మామ్‌‌.. ఈ పిచ్ పై ఐసీసీ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు.

ఇంజ‌మాముల్ హ‌క్ త‌న యూట్యూబ్ ఛాన‌ల్లో మాట్లాడుతూ.. అహ్మ‌దాబాద్ పిచ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకు ప‌డ్డారు. ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ఉంద‌న్నారు. క‌నీసం రెండు రోజులు కూడా పూర్తిగా ఆడ‌లేని ఈ పిచ్ పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇంగ్లండ్ కెప్టెన్ రూట్  6 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు తీశాడంటే.. పిచ్ కండీష‌న్ ఎలా ఉందో అర్థం చేసుకోవ‌చ్చ‌ని అన్నారు.

భార‌త స్పిన్న‌ర్లు అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్ ధాటికి ఇంగ్లండ్ జ‌ట్టు సైకిల్ స్టాండ్ ను త‌ల‌పించింది. మొద‌టి ఇన్నింగ్స్ లో 112 ప‌రుగుల‌కు ఆలౌట్ అయిన బ్రిటీష్ జ‌ట్టు.. సెకండ్ ఇన్నింగ్స్ లో 81 ప‌రుగుల‌కే ఆలౌట్ అయ్యింది. దీంతో.. టీమిండియా ప‌ది వికెట్ల తేడాతో ఈ టెస్టులో విజ‌య‌ఢంకా మోగించింది. ఈ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించాడు ఇంజ‌మామ్‌.

ఇంగ్లండ్ కెప్ట‌న్ రూట్ 6 ఓవ‌ర్ల‌లోనే 5 వికెట్లు తీశాడ‌ని.. అలాంట‌ప్పుడు అశ్విన్‌, అక్ష‌ర్ ప‌టేల్ గొప్ప‌ద‌నం ఏముందని ప్ర‌శ్నించాడు. ఒక్క రోజు కూడా పూర్తికాకుండానే 17 వికెట్లు ప‌డ్డాయంటే.. పిచ్ ఎంత దారుణంగా ఉందో అర్థ‌మ‌వుతోంద‌ని అన్నాడు. స్పిన్ ట్రాకులు త‌యారు చేయ‌డంపై తానేమీ అభ్యంత‌రం చెప్ప‌ట్లేద‌న్న ఇంజ‌మామ్‌.. ఇంత ఘోర‌మైన పిచ్ ల‌ను త‌యారు చేయ‌డాన్ని మాత్రం ఖండిస్తున్నాన‌ని అన్నారు. ఈ పిచ్ పై చ‌ర్య‌లు తీసుకోవ‌డం ద్వారా.. భ‌విష్య‌త్ లో ఇలాంటి పిచ్ లు త‌యారు చేయ‌కుండా ఐసీసీ చూడాల‌ని కోరాడు.
Tags:    

Similar News