పాకిస్తాన్ ప్రధాని కార్యాలయానికి కరెంట్ పీకేశారు

Update: 2019-08-30 04:41 GMT
కశ్మీర్ విషయంలో మోదీ ప్రభుత్వం కొట్టిన దెబ్బతో ఇంకా షాక్‌లోనే ఉన్న పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ కు మరో షాక్ తగిలింది. అయితే.. ఈసారి షాకిచ్చింది భారత దేశమో - అమెరికాయో - అంతర్జాతీయ సమాజమో కాదు.. సొంత దేశానికి చెందిన ఎలక్ట్రిసిటీ బోర్డు భారీ షాకిచ్చింది. అవును... విద్యుత్ బిల్లుల బకాయిలు చెల్లించకపోవడంతో పాక్ ప్రధాని కార్యాలయానికి కరెంట్ కట్ చేసేశారట.

ఇస్లామాబాద్ ఎలక్ట్రిసిటీ సప్లయి కంపెనీకి పాకిస్తాన్ ప్రభుత్వం రూ.41 లక్షలు బకాయి ఉంది. జులై వరకు రూ.35 లక్షలుగా ఉన్న బకాయిలు తాజాగా 41 లక్షలకు చేరాయట. దీంతో ఇస్లామాబాద్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ కంపెనీ కరెంటు కట్ చేసేసింది. అయితే.. కరెంట్ కట్ చేయడానికి ముందే చాలాసార్లు బకాయిలు చెల్లించాలంటూ పీఎంవోను కోరినా వారు స్పందించకపోవడంతో ఇలా షాకిచ్చింది.

పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ సెక్రటేరియట్‌ కు బిల్లులు చెల్లించడం అలవాటులేదని అక్కడి విద్యుత్ అధికారులు కూడా చెబుతున్నారు. ప్రపంచంలో కరెంటు కోతలు ఎక్కువగా ఉన్న దేశాల్లో పాక్ కూడా ఒకటి. వేసవి వచ్చిందంటే అక్కడి చాలా ప్రాంతాల్లో రోజుకు 12 గంటల కంటే ఎక్కువే కోత ఉంటుంది.

పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఆ దేవ ద్రవ్యలోటు గత మూడు దశాబ్దాలలో ఎన్నడూ లేనంత స్థాయిలో అత్యధికంగా 8.9 శాతానికి చేరుకుంది. అప్పులు - అవినీతి - నిరుద్యోగం - అనుత్పాదకత వంటివన్నీ కలిసి ఆ దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నాయి. దీనికి తోడు రక్షణ రంగానికి అవసరానికి మించి ఖర్చులు చేయడం - ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం వంటి కారణాలూ పాకిస్తాన్‌ ఖజానాను ఖాళీ చేస్తున్నాయి.
Tags:    

Similar News