ఆశ్చర్యం.. అనూహ్యం.. పాక్ ప్రధాని నోట.. ‘శాంతి’ మాటనా?

Update: 2022-08-20 17:30 GMT
భారతదేశం ఆది నుంచి శాంతి కాముక దేశం. రెండు సార్లు పాకిస్తాన్ మనపై దండెత్తి వస్తేనే మనం యుద్ధం చేశాం.. పాకిస్తాన్ ను ఓడించి బుద్ది చెప్పాం. డైరెక్టుగా గెలవలేని ఆ పాకిస్తాన్ దేశం ఇప్పుడు ఇన్ డైరెక్టుగా మనల్ని దెబ్బతీయాలని ఉగ్రవాదులను ఎగదోస్తోంది. జమ్మూకశ్మీర్ తమకు కావాలంటూ 75 ఏళ్లుగా రగిలిస్తోంది.

ఎంత మంది పాకిస్తాన్ ప్రధానులు మారినా.. అధ్యక్షులు చేంజ్ అయినా.. సైన్యాధ్యక్షులు నియంతలా పాలిస్తున్నా కూడా పాకిస్తాన్ తీరు మారలేదు. కానీ ఇటీవలే ఇమ్రాన్ ఖాన్ ను గద్దెదించి పాకిస్తాన్ ప్రధాని అయిన కొత్త వ్యక్తి షెహబాజ్ షరీప్ కశ్మీర్ అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్ తో శాంతియుత సంబంధాలను కోరుకుంటున్నట్లు తెలిపిన ఆయన జమ్మూకశ్మీర్ అంశంలోనూ శాంతియుత పరిష్కారం కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.

భారత విదేశాంగ విధానంపై మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ పొగడ్తలు గుప్పిస్తోన్న తరుణంలో షెహబాజ్ షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్ఎస్.సీ) నియమాలకు అనుగుణంగా జమ్మూ కశ్మీర్ వివాదానికి శాంతియుత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని.. కశ్మీర్ ప్రజలు కోరుకుంటున్న శాంతి, స్థిరత్వం ఎంతో అవసరం అని పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ పేర్కొన్నారు. దీనికి సులభతర పరిష్కారం లభించేందుకు అంతర్జాతీయ సమాజం పాత్ర అవసరమని నొక్కి చెప్పారు.

దక్షిణాసియాలో ఈ సమస్య చూపే ప్రభావాన్ని కూడా ఆస్ట్రేలియా హైకమిషనర్ తో షెహబాజ్ షరీఫ్ ప్రస్తావించినట్లు తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, పశుపోషణ వంటి రంగాల్లో ఆస్ట్రేలియాతో సహకారాన్ని మరింత విస్తరించేందుకు పాకిస్తాన్ నిబద్దతతో ఉందని పాక్ ప్రధాని అన్నారు.

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం.. రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంలో డేరింగ్ స్టెప్ వేసిన భారత్ విదేశాంగ విధానం సూపర్ అంటూ ఇమ్రాన్ ఖాన్ కొనియాడిన సంగతి తెలిసిందే. అమెరికాతో చెలిమి చేస్తూ పశ్చిమ దేశాల డిమాండ్లకు తలొగ్గేది లేదంటూ ఇమ్రాన్ పొగడ్తలు కురిపించాడు. పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం అమెరికా ఒత్తిడికి లొంగిపోయిందంటూ విమర్శించారు. ఇప్పుడు కొత్త ప్రధాని సైతం శాంతి అంటూ భారత్ పై విమర్శలకు వెనుకాడడం హాట్ టాపిక్ గా మారింది.
Tags:    

Similar News