పాక్‌ కు పట్టుబడ్డ వింగ్‌ కమాండర్‌ అభినందన్‌.. దేశ వ్యాప్తంగా హై టెన్షన్‌

Update: 2019-02-27 12:28 GMT
ఇండియా పాకిస్థాన్‌ మద్య యుద్ద వాతావరణం నెలకొన్న ఈ పరిస్థితుల్లో ఇండియన్‌ ఆర్మీకి చెందిన వారు కాని, ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ కు చెందిన వారు కాని ఏ ఒక్కరు పాకిస్థాన్‌ వారికి చిక్కినా వారి పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే భయంకరంగా ఉంటుంది. ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ చేసిన సర్జికల్‌ స్ట్రైక్స్‌ నేపథ్యంలో రగిలి పోతున్న పాకిస్థాన్‌ కు ఇండియన్‌ వింగ్‌ పైలెట్‌ విక్రమ్‌ అభినందన్‌ సజీవంగా లభించారు. ఇండియన్‌ భూ భాగంలోకి వచ్చిన అమెరికా నుండి కొనుగోలు చేసిన పాకిస్థాన్‌ యుద్ద విమానం ఎఫ్‌ 16 ను తరిమి కొట్టి కూల్చేసిన తరువాత  మిగ్‌ 21 బైసన్‌ విమానం అదే స్పీడ్ లో పాకిస్థాన్‌ గగనతలం పైకి వెళ్లి పోయి ఆ తర్వాత టెక్నికల్‌ కారణంతో పాకిస్తాన్ భూభాగంలో కూలిపోయింది.  విమానం కూలిపోతున్న సమయంలో అభినందన్‌ ప్యారచూట్‌ సాయంతో పాకిస్థాన్‌ నేలపై ఆయన దిగారు. అసూయతో రగిలి పోతున్న పాకిస్థాన్‌ వారికి అభినందన్‌ దొరకడంతో వారు రెచ్చి పోతున్నారు.

సేఫ్‌ గా కిందకు దిగిన అభినందన్‌ ను కనిపించిన వెంటనే పిడి గుద్దులు గుద్దుతూ - తన్నుతూ ఉన్న వీడియో ఒకటి బయటకు వచ్చింది. మొదట సైనిక శిభిరంలో అభినందన్‌ ను బంధించి - మాట్లాడించిన వీడియోను మాత్రమే విడుదల చేయడం జరిగింది. పాకిస్థాన్‌ ఆర్మీ వారు విడుదల చేసిన అధికారిక వీడియోలో అభినందన్‌ కు గాయాలు అయినట్లుగా ఉంది. విమానం నుండి దూకిన సమయంలో ఆయనకు గాయాలు అయ్యి ఉంటాయని అంతా భావించారు. కాని ఎలాంటి గాయం లేకుండా కిందకు దిగిన అభినందన్‌ ను పాకిస్థాన్‌ స్థానికులు మరియు ఆర్మీ వారు విచక్షణ రహితంగా కొట్టారని తాజా వీడియోతో వెళ్లడయ్యింది.

పాకిస్థాన్‌ కు చిక్కిన అభినందన్‌ స్వస్థలం కేరళ. అభినందన్‌ తండ్రి వర్థమాన్‌ రిటైర్డ్‌ ఎయిర్‌ మార్షల్‌. తిరుప్పూర్‌ జిల్లాలో విద్యాభ్యాసం చేసిన అభినందన్‌ తండ్రి ప్రోత్సాహంతో ఎయిర్‌ ఫోర్స్‌ లో శిక్షణ పొందారు. చెన్నై తాంబరం ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో అభినందన్‌ శిక్షణ పొందారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో కలిసి పంజాబ్‌ లో ఉంటున్న అభినందన్‌ ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ లో కీలక పైలెట్‌ కం కమాండర్‌ గా విధులు నిర్వర్తిస్తున్నారు. విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం కారణంగా అభినందన్‌ పాక్‌ వారికి చిక్కాడు.

కాని పాకిస్థాన్‌ మాత్రం విమానంను కూల్చి వేసింది తామే అని - అభినందన్‌ ను పట్టుకున్నామంటూ గొప్పలు చెప్పుకుంటుంది. తమ ప్రమేయం లేకుండా దొరికిన అభినందన్‌ ను చిత్ర హింసలు పెడుతూ అది మా గొప్పతనం అంటూ చెప్పుకుంటున్న పాకిస్థాన్‌ చేతకాని తనంపై ఇండియన్స్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభినందన్‌ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న ఆర్మీ అధికారులు ఇప్పటికే ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్‌ హై కమీషనర్‌ కు సమన్లు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో అభినందన్‌ ను పాకిస్థాన్‌ వారు చిత్రహింసలు పెట్టి వదిలేయవచ్చు అని, చంపే సాహసం మాత్రం చేయరు అంటూ మాజీ సైనిక అధికారులు అంటున్నారు. చంపే వారు అయితే అభినందన్‌ సజీవంగా ఉన్న వీడియోలను పాకిస్థాన్‌ ఆర్మీ విడుదల చేసేది కాదని అంటున్నారు. ఒక వేళ అభినందన్‌ ను చంపేస్తే పాకిస్థాన్‌ అంతర్జాతీయ మీడియా ముందు దోషిగా నిలబడాల్సి ఉంటుంది, అందుకే ఆ తప్పు పాకిస్థాన్‌ చేయక పోవచ్చు అనేది మాజీ సైనిక  అధికారుల మాట.

ఇక పాకిస్థాన్‌ ఆర్మీ ఆధీనంలో ఉన్న అభినందన్‌ ను కాపాడాలంటూ కేంద్ర ప్రభుత్వంకు దేశ ప్రజలు మొత్తం విజ్ఞప్తి చేస్తున్నారు. అభినందన్‌ క్షేమంగా ఇండియాకు తిరిగి రావాలని అంతా కోరుకుంటున్నారు. కేరళలోని తిరుప్పూర్‌ జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో అభినందన్‌ కు మద్దతుగా ర్యాలీలు నిర్వహిస్తూ ఆయన క్షేమాన్ని కాంక్షిస్తూ పూజలు చేస్తున్నారు. అభినందన్‌ క్షేమంగా తిరిగి రావాలని తుపాకి టీం కూడా కోరుకుంటోంది.



Full View

Tags:    

Similar News