ఇక మిగిలింది మూడు వారాలే.. దయనీయంగా పాక్ పరిస్థితి..!

Update: 2023-02-04 09:56 GMT
పాకిస్తాన్ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్న చందంగా మారింది. దేశాన్ని ఉగ్రవాదానికి కేరాఫ్ గా మార్చివేసిన పాలకులు ఇప్పుడు తగిన మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. ఒక వైపు కరోనా ఎఫెక్ట్.. ఆర్థిక మాంద్యం.. పెరుగుతున్న ద్రవ్యోల్భణం.. మరోవైపు అనిశ్చిత పాలన.. ఉగ్రవాదం వంటి సమస్యలు పాకిస్తాన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

ఈ పరిస్థితి రావడానికి పాకిస్తాన్ పాలకుల స్వయంకృతరాధంగానే కన్పిస్తోంది. ఆయుధం పట్టినవాడు ఆయుధం చేతిలో చనిపోతాడు అనేది ఎంత నిజమో.. ఉగ్రవాదానికి అండగా నిలిచిన దేశం సైతం అలాగే మూల్యం చెల్లించుకోక తప్పదు. పాకిస్తాన్ పరిస్థితి ఇందుకు నిదర్శనంగా కన్పిస్తోంది.

పాకిస్తాన్ లోని పెషావర్ మసీదు ఇటీవల ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు.ఈ ఘటనలో సుమారు 101 పౌరులు మరణించగా 97 మంది పోలీసులు మరణించారు. దీనిపై దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి పాక్ హోంమంత్రి రానా సనావుల్లా పార్లమెంటులో మాట్లాడుతూ "మనం ముజాహిదీన్ లను సృష్టించాం.. వారే ఇప్పుడు ఉగ్రవాదులు అయ్యారు.." అని విచారం వ్యక్తం చేశారు. ముజాహిదీన్ లను సృష్టించి మనం తప్పు చేశామంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

మరో మంత్రి ఖ్వాజా ఆసిఫ్ మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థలతో తాము పడుతున్న కష్టాలను ప్రపంచం గుర్తించడం లేదన్నారు. ఉగ్ర దాడుల కారణంగా పాకిస్థాన్ కు 12 వేల 600 కోట్ల డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లినట్లు వివరించారు. ప్రస్తుతం పాకిస్తాన్ ను ఉగ్రవాదులు శాసించే స్థాయికి చేరుకున్నారు. పేరుకే ప్రభుత్వం కానీ రిమోట్ మాత్రం ఉగ్రవాదుల చేతుల్లో ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఉగ్రవాదం సమస్య పాకిస్తాన్ కు పెనుభూతంలా మారితే కరోనా తర్వాత పాక్ పరిస్థితి మరింత దిగజారింది. దీనికితోడు ఇటీవల పాకిస్థాన్ ను వరదలు ముంచెత్తడంతో ఆ దేశంలో ఆహార సంక్షోభం నెలకొంది. నిత్యావసర ధరలు.. గోధుమ పిండి ధరలు.. వంట గ్యాస్.. పెట్రోల్.. డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.

మరోవైపు కరోనా ఎఫెక్ట్ తో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. దీంతో సరిపడా ఆదాయం లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఈ సమయంలో పెరుగుతున్న ద్రవ్యోల్భణం వారిని మరింత ఇబ్బందులకు గురి చేస్తోంది. ప్రభుత్వం పొదుపు చర్యలతో సబ్సిడీలను కూడా ఎత్తివేయడంతో వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.

ఇదిలా ఉంటే పాకిస్తాన్ లో విదేశీ నిల్వలు అడుగంటుతున్నాయి. పదేళ్ల కనిష్టానికి విదేశీ నిల్వలు పడిపోయినట్లు పాకిస్థాన్ సెంట్రల్ బ్యాంక్ తాజాగా ప్రకటించింది. 16.1శాతం తగ్గి 3.09 బిలియన్ డాలర్లకు విదేశీ నిల్వలు చేరినట్లు వెల్లడించింది. ఈ నిల్వలు కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సరిపోతాయని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐఎంఎఫ్ ను ఒప్పించి నిదులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

అయితే ఐఎంఎఫ్ నిధుల విషయంలో అనేక కొర్రీలు పెడుతోంది. త్వరలోనే పాకిస్థాన్ లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఐఎంఎఫ్ పెడుతున్న షరతులను ప్రజలకు వివరించే పనిలో పడింది. ఐఎంఎఫ్ నిధులు వస్తే పాక్ కు తాత్కాలిక ఉపశమనం లభించినా రాబోయే రోజుల్లో దీని ప్రభావం ప్రజలపై మరింతగా ఉంటుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News