టీ20ల్లో పాక్ జోరు ..105 విజయాలతో అగ్రస్థానం , ఇండియా ఏ స్థానంలో ఉందంటే ?

Update: 2021-07-16 08:32 GMT
టీ 20 .. ప్రపంచ క్రికెట్ లో టీ20కి ప్రస్తుతం ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. టీ20 ఫార్మాట్ వచ్చిన తర్వాత ప్రపంచ క్రికెట్ స్థితి , గతి పూర్తిగా మారిపోయింది. ప్రపంచ వ్యాప్తంగా పొట్టి ఫార్మాట్ టోర్నీలు ఎన్నో జరుగుతుండడంతో , ఆటగాళ్లు అందరూ దంచుడే లక్ష్యంగా ఆడుతున్నారు. ముఖ్యంగా బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్ కి ఎంతటి క్రేజ్ వచ్చిందో , ఆ ఐపీఎల్ ద్వారా ఎంతమంది యువ ఆటగాళ్లు వెలుగులోకి వచ్చారో చెప్పాల్సిన పనిలేదు. ఈ ఫార్మాట్ కారణంగా టీ20 స్పెసలిస్ట్ బ్యాట్స్‌మన్‌ అని కొందరిపై ముద్ర పడింది. టీ20 కారణంగా టెస్ట్, వన్డేల్లో రాణించని జట్లు కూడా అంతర్జాతీయ టీ20ల్లోతమ సత్తా ను నిరూపించుకుంటున్నాయి.

ఈ పొట్టి ఫార్మాట్‌లో చిన్న టీంలు కూడా పెద్ద జట్లపై విజయాలు సాధిస్తున్నాయి. సంప్రదాయ క్రికెట్‌ లో అంతగా రాణించని పాకిస్తాన్.. టీ20ల్లో మాత్రం తమకి ఎదురులేదు అని విజయాలతో కొనసాగుతుంది. ఎంతలా అంటే అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక విజయాలు అందుకుంది పాక్ మాత్రమే. టీ 20 విజయాల్లో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసి పాక్ తోలి స్థానంలో నిలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో పాకిస్తాన్  ఇప్పటివరకు 170 టీ20 మ్యాచులు ఆడి , 105 విజయాలు అందుకుంది. పాక్ టీం 170 టీ20 మ్యాచులు ఆడగా, ప్రపంచంలో  మరే జట్టు కూడా 150 మ్యాచులు ఆడలేదు. పాక్ తర్వాత ఆస్ట్రేలియా అత్యధికంగా 145 మ్యాచులు ఆడింది. ఈ రెండు జట్ల తర్వాత భారత్ 142 టీ 20 మ్యాచులు ఆడింది.

అంతర్జాతీయ టీ20ల్లో పాక్ తర్వాత అత్యధిక విజయాలు అందుకుంది టీమిండియానే. భారత్ 142 మ్యాచులో 91 విజయాలు అందుకుంది. మూడో స్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా 136 మ్యాచులో 76 విజయాలు సాధించింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ టాప్-5లో ఉన్నాయి. ఆసీస్ 142 మ్యాచుల్లో 72 విజయాలు, కివీస్ 145 మ్యాచుల్లో 72 విజయాలు అందుకున్నాయి. ఆసీస్, కివీస్ విజయాల శాతం దాదాపు 50 మాత్రమే ఉండడం విశేషం. ఇంగ్లండ్ 134 మ్యాచులో 71, వెస్టిండీస్ 139 మ్యాచులో 63, శ్రీలంక 134 మ్యాచులో 61 , ఆఫ్ఘనిస్తాన్ 84 మ్యాచులో 58 తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

టీ20ల్లో అత్యధిక విజయాలు ఖాతాలో ఉన్న పాక్ , ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. వన్డే టీ20 సిరీసుల కోసం ఇంగ్లండ్ వచ్చింది. ఇప్పటికే మూడు వన్డేలు ఆడగా, మూడింటిలోనూ ఓడిపోయింది. ఇక  నేడు (శుక్రవారం) ఇరు జట్ల మధ్య నాటింగ్‌హోమ్ వేదికగా తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. లీడ్స్ వేదికగా 18న రెండో మ్యాచ్, మాంచెస్టర్ వేదికగా 20న మూడో మ్యాచ్ జరగనుంది. వన్డేల్లో ఓటమికి పాక్ బదులు తీర్చుకోవాలని చూస్తోస్తోంది. అయితే ఇటీవలి కాలంలో ఇంగ్లండ్ టీ20ల్లో అదరగొడుతోంది. దీనితో ఈ టీ20 సమరం రసవత్తకరంగా సాగుతుంది అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు.

 ఇదిలా ఉంటె రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో గత కొన్నేళ్లుగా భారత్, పాకిస్తాన్ ధ్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే దాయాదీ జట్లు తలపడుతున్నాయి. చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం టీమిండియా.. పాక్‌కు వెళ్లింది. ఇరు జట్లు 2019 వన్డే ప్రపంచకప్‌లో ఆఖరిసారిగా తలపడ్డాయి. పాకిస్థాన్‌ పై ఏ ఫార్మాట్‌ లోనైనా భారత్‌ కే మెరుగైన రికార్డ్‌ ఉంది.

ప్రపంచకప్‌ లో ఇప్పటి వరకూ 7 సార్లు భారత్, పాక్ ఢీకొనగా.. అన్ని మ్యాచ్‌ ల్లోనూ టీమిండియానే గెలుపొందింది. ఇక టీ20 ప్రపంచకప్‌ లో మొత్తం 5 సార్లు తలపడగా నాలుగుసార్లు భారత్ గెలవగా.. ఒక్కసారి డ్రా అయింది. మ్యాచ్‌ల పరంగ మాత్రం టీమిండియాపై పాక్‌దే పైచేయి. ఇప్పటి వరకు ఇరు దేశాల మధ్య 59 టెస్ట్‌లు జరగ్గా.. పాక్ 12 సార్లు గెలవగా.. భారత్ 9 సార్లే విజయం సాధించింది. 38 మ్యాచ్‌ల ఫలితం తేలలేదు. 132 వన్డేల్లో 73 పాక్ గెలవగా.. భారత్ 55 మాత్రమే విజయం సాధించింది. 4 మ్యాచ్‌ లు టై అయ్యాయి. ఇక టీ20ల్లో ఇరు జట్లు 8 మ్యాచ్‌లు ఆడగా.. భారత్ అత్యధికంగా 6 సార్లు విజయం సాధించగా.. పాక్ ఒకేసారి గెలుపొందింది. మరొక మ్యాచ్ డ్రా అయింది.
Tags:    

Similar News