తమిళ కేబినెట్: మోడీ, మోడీ, మోడీ

Update: 2017-05-05 06:41 GMT
తమిళనాడు సీఎం ఎడప్పాడి కే పళనిసామికి ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌త్తి మీద సాములా మారుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే అన్నాడీఎంకేలోని చీలిక‌వ‌ర్గ‌మైన మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వ‌ర్గంతో స‌మ‌స్యల పాలు అవుతున్న ప‌ళ‌నికి ఇటీవ‌ల చిన్న‌మ్మ శ‌శిక‌ళ అక్క కుమారుడు దిన‌క‌ర‌న్ ఉదంతం త‌ల‌బొప్పి క‌ట్టించిన సంగ‌తి తెలిసిందే. దేశ చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేని విధంగా ఎన్నిక‌ల క‌మిష‌న్‌కు లంచం ముట్ట‌చెప్తూ  దొరికిపోయిన దిన‌క‌ర‌న్ ఉదంతం ప‌ళ‌నిని సైతం ఇర‌కాటంలో ప‌డేసింది. ఆయ‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుల్లో కొంద‌రి ఇళ్ల‌పై ఐటీ శాఖ దాడులు జ‌రిపింది. ఈ నేప‌థ్యంలో అన్నాడీఎంకే శ్రేణుల‌కు, సహచర మంత్రులకు ప‌ళ‌నిసామి కొత్త ఆర్డ‌ర్ పాస్ చేశారు.

ఇంత‌కీ ప‌ళ‌ని పాస్ చేసిన కొత్త ఆర్డ‌ర్ ఏమిటంటే... ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయవద్ద‌నే హెచ్చరిక‌. దానికి ఆయ‌న చెప్పిన కార‌ణం... రాష్ట్ర ప్రగతి కోసం కేంద్రంతో కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది కాబ‌ట్టి! వివిధ పథకాల అమలుతోపాటు నీట్ - ఎయిమ్స్ కు అనుమతులు - నిధుల కేటాయింపు తదితర అంశాలపై కేంద్రం మద్దతు అవసరమని సీఎం ప‌ళ‌నిసామి త‌మ‌తో చెప్పిన‌ట్లు మున్సిపల్‌శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి తెలిపారు. కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల స‌ఖ్య‌త ఎంతో అవ‌స‌ర‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అయితే సీఎం ఆర్డ‌ర్‌పై అసెంబ్లీలో విపక్ష నేత ఎంకే స్టాలిన్ ఆస‌క్తిక‌ర‌మైన రీతిలో వ్యాఖ్య‌లు చేశారు. ఐటీ, ఈడీ దాడుల నుంచి తప్పించుకునేందుకే కేంద్రంపై విమర్శలు చేయవద్దని పళనిసామి తన సహచర మంత్రులను ఆదేశించారని విమర్శించారు. ఇటీవ‌ల వ‌రుస దాడుల‌తో బెంబేలెత్తిపోయిన ప‌ళని ఈ రీతిలో ముందుకు వ‌స్తున్నారని వ్యాఖ్యానించారు. కాగా, చిన్న‌మ్మ శ‌శిక‌ళ కుటుంబంపై ఐటీ దాడులు జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని ఇటీవ‌ల వార్త‌లు వెలువ‌డిన నేప‌థ్యంలో ప‌ళ‌నిసామి చేసిన వ్యాఖ్య‌లు ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News