పళ్లంరాజు అప్‌ డేట్‌ గానే ఉన్నారా..?

Update: 2018-08-12 06:05 GMT
ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలోనే ఇంతవరకు లేని కాంబినేషన్ ఈసారి 2019 ఎన్నికల్లో చూడబోతున్నామని రాష్ట్రమంతా కోడైకూస్తున్న తరుణంలో కేంద్ర మాజీమంత్రి - కాంగ్రెస్ సీనియర్ లీడర్ పల్లంరాజు మాత్రం ఏమీ తెలియనట్లు మాట్లాడుతున్నారు. చేతిలోన చెయ్యేసుకుని మరీ టీడీపీ-కాంగ్రెస్‌ లు కలిసి నడుస్తున్న వేళ ఆయన మాత్రం కాంగ్రెస్ - టీడీపీ పొత్తు ఉండదని చెబుతున్నారు. దీంతో పల్లంరాజు వ్యూహాత్మకంగా మాట్లాడుతున్నారా లేదంటే 2014 ఎన్నికల తరువాత భారీ గ్యాప్ రావడంతో రాజకీయంగా అప్‌ డేట్‌ గా లేరా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
   
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌ లో కాంగ్రెస్ - టీడీపీ మధ్య పొత్తు ఉంటుందని జరుగుతున్న ప్రచారంలో అవాస్తవమంటూ పల్లంరాజు చెప్పడం ఏపీ రాజకీయాల్లో ఒక్కసారి అయోమమ పరిస్థితిని సృష్టించింది. కృష్ణాజిల్లా కాంగ్రెస్ పార్టీ శిక్షణా తరగతుల శిబిరంలో మాట్లాడిన ఆయన రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ - టీడీపీ పొత్తు పెట్టుకుంటాయనేది ఊహాగానాలేనని.. కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ అయిన టీడీపీతో తామెలా కలుస్తామని అన్నారు.
   
ప్రధాని నరేంద్ర మోదీని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విభేదించారు కాబట్టే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్‌‌ కు టీడీపీ ఎంపీలు ఓటు వేశారని.. అంతమాత్రాన రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తాయనుకోవడం పొరపాటని అన్నారు.  కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల పట్ల ప్రజల్లో వ్యతిరేకత ఉందని.. అది తమకు అనుకూలమని.. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న వేళ తాము టీడీపీతో కలవలేమని అన్నారు.
Tags:    

Similar News