తెలుగోడికి కెన్యా అరుదైన స‌త్కారం

Update: 2017-12-20 05:51 GMT
ఉన్న ఊళ్లో ఉంటూ శ‌భాష్ అనిపించుకోవ‌టం పెద్ద విష‌యం కాదు. ఊరు కాని ఊరెళ్లి పోటుగాడు అనిపించుకోవ‌టం మామూలు విష‌యం కాదు. అలాంటిది దేశం కాని దేశానికి వెళ్ల‌టం ఒక ఎత్తు అయితే.. ఆ దేశంలో అరుదైన పుర‌స్కారం అందుకోవ‌టం చిన్న విష‌యం కాదు. అలాంటి ఘ‌న‌త‌ను సాధించాడో తెలుగోడు.

ప‌రాయి దేశంలో కీర్తి ప‌తాకాన్ని ఎగుర‌వేసే భార‌తీయుల్లో తెలుగోళ్లు ముందుంటారు. ఆ విష‌యం మ‌రోసారి నిరూపిత‌మైంది. తాజాగా కెన్యాలో తెలుగోడికి అరుదైన స‌త్కారం ల‌భించింది. ఆ దేశంలో మ‌నోడు అందిస్తున్న సేవ‌ల‌కు ఆ దేశ స‌ర్కారు అందించే ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డును సొంతం చేసుకున్నవైన‌మిది.

ఏపీలోని  గుంటూరు జిల్లా భ‌ట్టిప్రోలు మండ‌లం వెల్ల‌టూరుకు చెందిన ప‌మిడిముక్క‌ల వెంక‌ట సాంబ‌శివ‌రావు 1981లో ఏంబీఏ చ‌దివేందుకు కెన్యా వెళ్లారు. చ‌దువు కోసం వెళ్లిన ఆయ‌న కోర్సు పూర్తి అయ్యాక అక్క‌డే స్థిర‌ప‌డ్డారు. తోలుత ప‌రిశ్ర‌మ‌ను ఏర్పాటు చేసి.. దాదాపు 25 వేల మందికి ఉపాధిని క‌ల్పిస్తున్నారు.

కెన్యా లెద‌ర్ డెవ‌ల‌ప్ మెంట్ కౌన్సిల్ బోర్డు డైరెక్ట‌ర్ గా.. టాన‌ర్స్ అసోసియేష‌న్ చైర్మ‌న్ గా.. కెన్యా విజ‌న్ -2030 ప్ర‌త్యేక టాస్క్ ఫోర్స్ స‌భ్యుడిగా.. ఇలా ప‌లు బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌కు కెన్యా దేశ‌పు అరుదైన గౌర‌వం ల‌భించింది. ఆ దేశ ప్ర‌భుత్వం అందించే ప్ర‌తిష్ఠాత్మ‌క‌మైన ఎల్డ‌ర్ ఆఫ్ ది ఆర్డ‌ర్ ఆఫ్ ది గోల్డెన్ హార్ట్ పుర‌స్కారాన్ని సొంతం చేసుకున్నారు. దేశం కాని దేశం వెళ్లి స్థిర‌ప‌డ‌టం గొప్ప అయితే.. ఆ దేశం అందించే ప్ర‌తిష్ఠాత్మ‌క పుర‌స్కారాన్ని సొంతం చేసుకోవ‌టం మా గొప్ప‌గా చెప్పాలి. ఏమైనా తెలుగోడు మామూలోడు కాద‌న్న విష‌యానికి మ‌రో ఉదాహ‌ర‌ణ‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News