చంద్రబాబుకు పనబాక షాక్ ..పోటీకి నోనా ?

Update: 2020-11-23 17:40 GMT
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికల్లో పోటీ చేయటానికి పనబాక లక్ష్మి వెనకాడుతున్నారా ? క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానం పెరిగిపోతోంది. పనబాక పేరును చంద్రబాబునాయుడు ప్రకటించి దాదాపు వారం రోజులవుతున్నా ఇంతవరకు ఆమె ఎక్కడా స్పందించలేదు. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలోని నేతలతో అసలు టచ్ లోకే రాలేదు. సరే ఈ విషయాన్ని వస్తే నెల్లూరు జిల్లాలో ఉన్న నాలుగు నియోజకవర్గాల్లోని నేతలతో కూడా ఆమె సమావేశం నిర్వహించలేదట.

మామూలుగా ఎవరైనా తనను అభ్యర్ధిగా ప్రకటించగానే నియోజకవర్గంలోని కీలక నేతలతో వెంటనే సమావేశం పెట్టేస్తారు. ఎన్నికల్లో గెలుపుకు అవసరమైన వ్యూహాలపై చర్చిస్తారు. ప్రచారం ఎప్పుడు ప్రారంభించాలి, ఎలా ప్రారంభించాలనే విషయాలను చర్చిస్తారు. కానీ పనబాక విషయంలో ఇలాంటి డెవలప్మెంట్లు ఏమీ లేవని సమాచారం. కనీసం సీనియర్ నేతలను పనబాక ఫోన్లో కూడా పలకరించలేదట. చంద్రబాబు ప్రకటన తర్వాత ఆమె కనీసం మీడియా సమావేశం పెట్టి అధినేతకు ధన్యవాదాలు కూడా చెప్పకపోవటం ఆశ్చర్యంగా ఉంది.

అసలింతకీ ఏమి జరుగుతోందని ఆరా తీస్తే రెండు ఆశ్చర్యకరమైన విషయాలు తెలిశాయి. మొదటిదేమంటే పనబాక పోటీకి సిద్ధంగా లేరట. ఎవరు పోటీ చేసినా గెలుపు అవకాశాలు లేనపుడు పోటీ చేయటం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారట. ఇక రెండో విషయం ఏమిటంటే అసలు టీడీపీకే గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారట. పనబాకను అభ్యర్ధిగా ప్రకటించేటపుడు చంద్రబాబు ఆమెతో మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదని సమాచారం. తనను అడగకుండానే చంద్రబాబు తన పేరును ప్రకటించినపుడు తానెందుకు స్పందించాలని ఆమె కూడా కామ్ గా ఉన్నారట.

ఇదే సమయంలో మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు పనబాక తిరుపతి నేతలతో మాట్లాడిందే లేదట. ఎన్నికల్లో తాను ఓడిపోయినా తన గెలుపుకోసం పని చేసిన నేతలందరికీ అభ్యర్ధి ఫార్మల్ గా కలిసి ధన్యవాదాలు చెప్పటం ఆనవాయితీ. ఇటువంటి ఆనవాయితీని కూడా పనబాక పాటించలేదని సమాచారం. గడచిన ఏడాదిన్నరగా తిరుపతిలో పార్టీ తరపున ఏ కార్యక్రమంలో కూడా పనబాక పాల్గొనలేదంటున్నారు. ఇక్కడే కాదు నెల్లూరు జిల్లాలోని పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనబడటం లేదట. ఇందులో భాగంగానే ఆమె పార్టీ నేతలతో కూడా పెద్దగా టచ్ లో లేరట.

సో, పనబాక ధోరణి చూస్తుంటే పోటీకే విముఖంగా ఉన్నట్లు అర్ధమవుతోంది. టీడీపీకి రాజీనామా చేసేసి పనబాక బీజేపీలో చేరిపోతారనే ప్రచారం చాలా కాలంగా జరుగుతోంది. ప్రచారాన్ని ఆమె ఖండించలేదు అలాగని అవునని చెప్పలేదు. దాంతో ఎవరి శక్తికి తగ్గట్లుగా వాళ్ళు ప్రచారం చేసేస్తున్నారు. ఈ దశలోనే చంద్రబాబు ఆమె అభ్యర్ధిత్వాన్ని ప్రకటించేశారు. టీడీపీకి పనబాక రాజీనామా చేయకుండా ఉండేదుకే చంద్రబాబు కూడా ఆమె అభ్యర్ధిత్వాన్ని ముందుగా ప్రకటించారనే ప్రచారం కూడా జరుగుతోంది. తన అభ్యర్దిత్వాన్ని ప్రకటించి వారం అవుతున్నా పనబాక స్పందించలేదంటే ఎక్కడో తేడా కొడుతున్నదనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. చూద్దాం ఏమి జరుగుతోందో.
Tags:    

Similar News