93 పంచాయితీలు ఏకగ్రీవమవబోతున్నాయా ?

Update: 2021-02-01 04:38 GMT
ఆదివారంతో ముగిసిన మొదటివిడత గ్రామపంచాయితీ నామినేషన్ల తర్వాత 93 పంచాయితీలు ఏకగ్రీవమయ్యే అవకాశాలున్నాయి. నామినేషన్లు ముగిసే సమయానికి పై పంచాయితీల్లో సర్పంచు పదవికి కేవలం ఒక్క నామినేషన్ మాత్రమే దాఖలయ్యాయి. దాంతో నామినేషన్ వేసిన వారినే ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అధికారులు ప్రకటించటం మినహా వేరే దారిలేదు. అయితే ఈ విషయాన్ని అధికారులు అధికారికంగా ప్రకటించకపోయినా క్షేత్రస్ధాయిలో సమాచారం ఆధారంగా 93 పంచాయితీలు ఏకగ్రీవమైనట్లే.

నామినేషన్ల ప్రక్రియ మొదలైన దగ్గర నుండి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసే ఆసక్తి ఉన్న వాళ్ళ మధ్య చర్చలు జరిగాయి. గ్రామాభివృద్ధికనో లేకపోతే పర్టిక్యులర్ గా రోడ్లు లేదా దేవాలయం అభివృద్ధికి అనో వేలం పాటలు జరిగింది వాస్తవం. ఇందులో అత్యధిక మొత్తాన్ని ఖర్చు పెట్టడానికి ముందుకొచ్చిన వాళ్ళకు అనుగుణంగా గ్రామస్తుల్లో మెజారిటి మొగ్గుచూపారు. దాంతో అటువంటి గ్రామాల్లో ఇతరులను నామినేషన్లు వేయనీయకుండా గ్రామస్తులే తీర్మానించటంతో సింగిల్ నామినేషన్ వేసిన వారే సర్పంచ్ గా దాదాపు ఎన్నికైనట్లే.

అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇటువంటి ఏకగ్రీవాల్లో ఎక్కువగా చిత్తూరు జిల్లాలో 19 పంచాయితీలు ఏకగ్రీవమయ్యాయి. తర్వాత తూర్పుగోదావరిలో 15, గుంటూరులో 13, కృష్ణాలో 10, కర్నూలులో 9, నెల్లూరులో 6, శ్రీకాకుళంలో 5, పశ్చిమగోదావరిలో 5, కడపలో 5, విశాఖపట్నంలో 4, ప్రకాశంలో 1, అనంతపురం జిల్లాలో 1 పంచాయితీ ఏకగ్రీవమయ్యాయి.

మరి ఏకగ్రీవాల వ్యవహారానికి సంబంధించి స్టేట్ ఎలక్షన్ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆలోచనలు వేరే విధంగా ఉన్నాయి. బలవంతపు ఏకగ్రీవాలను అడ్డుకుంటామంటు మొదటినుండి హెచ్చరిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. మరి ఏకగ్రీవాల్లో స్వచ్చంద ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలంటు వేర్వేరుగా ఉండవు. ఒకరికి అనుకూలంగా మిగిలిన వాళ్ళను పోటీలో నుండి విరమింపచేయటమే ఏకగ్రీవం. అది ప్రలోభాలకు గురిచేశా, ఒత్తిడి పెట్టా, బెదిరించా అన్నది అప్రస్తుతం. ఒకవేళ పోటీ చేయాల్సిందే అన్న వాళ్ళు గట్టిగా నిలబడితే ఏకగ్రీవాలన్నది జరిగే అవకాశాలు లేవు. మరి  ఈ 93 ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News