ముండే మేడ‌మ్‌...బంగారు ల‌క్ష్మ‌ణ్ గుర్తు లేరా?

Update: 2017-01-08 04:32 GMT
భారతీయతకు కేరాఫ్ అడ్రెస్‌గా చెప్పుకునే బీజేపీ నేత‌ల‌కు అవినీతి మ‌కిలి అంటిన దాఖ‌లాలు అంత‌గా లేన‌ప్ప‌టికీ... ఆ పార్టీలోనూ అక్ర‌మాదాయాన్ని వెన‌కేసిన వారు లేక‌పోలేదు. జాతీయ రాజ‌కీయాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగిన ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడి హోదాలోనే దివంగ‌త బంగారు ల‌క్ష్మ‌ణ్... తెహ‌ల్కా డాట్ కామ్ వేసిన వ‌ల‌కు అడ్డంగా బుక్కైపోయారు. అస‌లు త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిందెవ‌రో కూడా చూసుకోకుండా ఆయ‌న రూ. 2 ల‌క్ష‌లు తీసుకుంటూ మీడియా కెమెరా కంటికి చిక్కిపోయారు. అయినా అది జ‌రిగిందెప్పుడు? ఇప్పుడు దాని ప్ర‌స్తావ‌న ఎందుకూ అంటారా? ఆ పార్టీ దివంగ‌త నేత - కేంద్ర మాజీ మంత్రి గోపీనాథ్ ముండే త‌న‌య పంక‌జా ముండే గుర్తున్నారుగా. మ‌హారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫ‌డ్న‌వీస్ కేబినెట్‌ లో కీల‌క శాఖ అయిన మ‌హిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా కొన‌సాగుతున్న ఆమె నిన్న ఓ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు. ఇప్ప‌టికే త‌న సొంత నియోజ‌కవ‌ర్గంలో జ‌రుగుతున్న ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు సంబంధించి వాటాలు అడుగుతున్నార‌ని, చేయ‌ని ప‌నుల‌కు కూడా బిల్లులు చేయించుకుని దాచేసుకుంటున్నార‌ని ఇటీవ‌లే ఆమెపై ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఈ వ్య‌వ‌హారం  మిస్ట‌ర్ క్లీన్‌ గా పేరుప‌డ్డ ఫ‌డ్న‌వీస్‌ కు కూడా త‌ల‌వంపులు తెచ్చిన విష‌యం తెలిసిందేగా.

అయితే స‌ద‌రు ఆరోప‌ణ‌ల‌న్నీ అవాస్త‌మ‌ని - తానంటే గిట్ట‌నివారు అదంతా చేశార‌ని ముండే మేడ‌మ్ చెప్పిన మాట‌లు విన్న ఫ‌డ్న‌వీస్ ఆమెను త‌న కేబినెట్లో కొన‌సాగిస్తున్నాయి. అయితే నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన ముండే... బీజేపీ నేత‌ల స‌చ్ఛీల‌తకు సంబంధించి ఆస‌క్తిక‌ర కామెంట్లు చేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ఆమె ‘‘మన పార్టీ (బీజేపీ) వాళ్లకు లంచం డబ్బులు తీసుకోవడం కూడా తెలియదు. ఏ కాగితంపై సంతకం పెట్టాలన్నా పెట్టేస్తారు. బీద్‌ జిల్లాలో ఏ పనులు చేయాలన్నా నాకు చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ స్వయంగా అధికారులతో అన్నారు. అధికార యంత్రాంగంలో నాకున్న పలుకుబడికి ఇదే నిదర్శనం.’’ అని వ్యాఖ్యానించారు. ముండే నోట నుంచి వ‌చ్చిన ఈ వ్యాఖ్య‌లు విన్న జ‌నానికి వెంట‌నే బంగారు ల‌క్ష్మ‌ణ్ గుర్తుకు వ‌చ్చార‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News