ఇదే.. ప‌న్నీర్‌.. ప‌ళ‌నిల రాజీ ఫార్ములా?

Update: 2017-04-28 03:45 GMT
త‌మిళ‌నాడు అధికార‌ప‌క్షంలో నెల‌కొన్న అంత‌ర్గ‌త విభేదాల ముచ్చ‌ట ఇప్పుడిప్పుడే ఒక కొలిక్కి వ‌స్తున్న‌ట్లుగా చెబుతున్నారు. అమ్మ మృతి అనంత‌రం చోటు చేసుకున్న ప‌రిణామాల‌తో పాల‌క అన్నాడీఎంకే పార్టీ రెండు ముక్క‌లు కావ‌టం తెలిసిందే. ఒక ముక్క‌కు చిన్న‌మ్మ శ‌శిక‌ళ నేతృత్వం వ‌హిస్తుండ‌గా.. రెండో వ‌ర్గానికి అమ్మ విధేయుడు ప‌న్నీరుసెల్వం నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఊహించ‌ని రీతిలో జైలుశిక్ష‌కు గురైన చిన్న‌మ్మ జైలుకు వెళ్లిపోవ‌టం.. ఆమె మేన‌ల్లుడు దిన‌క‌ర‌న్ కు పార్టీ ప‌గ్గాలు తాత్కాలికంగా అప్ప‌గించ‌టం తెలిసిందే. అమ్మ కార‌ణంగా ఖాళీ అయిన ఆర్కేన‌గ‌ర్ ఉప ఎన్నిక‌ల్లో పార్టీ గెలుపు కోసం దిన‌క‌ర‌న్ చేసిన ప్ర‌య‌త్నాలు బెడిసి కొట్టి.. ఆయ‌నపై కేసులు న‌మోదై.. అరెస్ట్ వ‌ర‌కూ వెళ్ల‌టం లాంటివి ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా జ‌రిగిపోయాయి.

ఇదిలా సాగుతున్న వేళ‌.. అనూహ్యంగా నిప్పు ఉప్పులా ఉన్న‌ట్లు క‌నిపించిన ప‌ళ‌ని.. ప‌న్నీర్ వ‌ర్గాల మధ్య రాజీ చ‌ర్చ‌లు షురూ కావ‌ట‌మే కాదు.. ఇరు వ‌ర్గాలు విలీనం అయ్యే దిశ‌గా ప్ర‌య‌త్నాలు షురూ అయ్యాయి. అయితే.. తాము విలీనం కావాలంటే చిన్న‌మ్మ‌.. ఆమె కుటుంబ స‌భ్యుల జోక్యం అన్న‌ది లేకుండా చేయ‌టంతో పాటు.. పార్టీలో వారి ఊసే ఉండ‌కూడ‌ద‌న్న రూల్ పెట్టిన ప‌న్నీర్ పుణ్య‌మా అని..చిన్న‌మ్మ ఫోటోలు పార్టీ ఆఫీసు నుంచి రోడ్డు మీద‌కు ప‌డిపోయిన ప‌రిస్థితి.

మ‌రోవైపు దిన‌క‌ర‌న్ అరెస్ట్ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య విలీనం దిశ‌గా చ‌ర్చ‌ల జోరు మ‌రింత పెరిగింది. ఇదిలా ఉండ‌గా.. కొన్ని ఆస‌క్తిక‌ర అంశాలు చోటు చేసుకోవ‌టం గ‌మ‌నార్హం. ఓప‌క్క‌.. ప‌న్నీర్‌.. ప‌ళ‌ని స్వాముల మ‌ధ్య రాజీ ఫార్ములా కోసం జోరుగా ప్ర‌య‌త్నాలు సాగుతుంటే.. మ‌రోవైపు రెండు వ‌ర్గాల‌కు చెందిన ఎస్సీ..ఎస్టీ ఎమ్మెల్యేలు ప‌లువురు ఒక హోట‌ల్లో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌టం రెండు వ‌ర్గాల్ని ఉలిక్కిప‌డేలా చేసింది. మ‌రో వైపు మంత్రి సెంగోట్ట‌య‌న్ మీడియాతో మాట్లాడుతూ.. రెండు వ‌ర్గాల నేత‌లు ఎవ‌రూ నోరు విప్పొద్ద‌ని సూచ‌న చేశారు. ఎందుకిలా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. మ‌రోవైపు.. రెండు వ‌ర్గాల్ని క‌ల‌ప‌టం.. ప్ర‌భుత్వంతో పాటు పార్టీని న‌డిపించేందుకు ఒక ప్ర‌త్యేక క‌మిటీని సీన్లోకి తీసుకురావాల‌న్న ప్ర‌తిపాద‌నను మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీరు సెల్వం చేశారు. ఈ సంద‌ర్భంగా ఒక రాజీ ఫార్ములాను ప‌న్నీర్ వ‌ర్గం సూచించిన‌ట్లుగా తెలుస్తోంది.

దీని ప్ర‌కారం ప‌న్నీరును పార్టీ అధ్య‌క్షుడ్ని చేసి.. ప‌ళ‌నిస్వామిని సీఎంగా కంటిన్యూ చేద్దామ‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ప‌రిస్థితులు కాస్త కుదుటప‌డ్డాక‌.. పార్టీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశం నిర్వ‌హించిన మెజార్టీ నిర్ణ‌యం మేర‌కు త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. రెండు వ‌ర్గాల‌కు చెందిన ఎస్సీ.. ఎస్టీ ఎమ్మెల్యేలు వేరుగా హోట‌ల్లో భేటీ కావ‌టం గంద‌ర‌గోళానికి దారి తీయ‌గా.. మంత్రి ప‌ద‌వుల విష‌య‌మై ఈ వ‌ర్గం ఎమ్మెల్యేలు స‌మావేశం ఏర్పాటు చేసుకున్న‌ట్లుగా చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. ప‌ళ‌ని.. ప‌న్నీరుల మ‌ధ్య ఒక రాజీ ఫార్ములా అయితే వ‌చ్చిందన్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News