వేటు వేయటం మొదలెట్టిన పన్నీర్

Update: 2017-02-17 09:56 GMT
తమిళనాడు సీఎం కుర్చీ కోసం మొదలైన తగులాట ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తున్నా.. అంత తేలిగ్గా ఇష్యూను క్లోజ్ చేయటానికి ఇష్టపడటం లేదు పన్నీర్ సెల్వం. తనకు దక్కని సీఎం కుర్చీని ఎలా దక్కించుకోవాలా? అన్నట్లుగా ఉంది ఆయన వ్యవహారం. ఇప్పటికే పళనిస్వామికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాలని పిలుపునిచ్చిన ఆయన.. తాజాగా మరో తరహాలో రియాక్ట్ కావటం మొదలెట్టారు.

చిన్నమ్మ మీద తిరుగుబాటు బావుటా ఎగురవేసిన పన్నీర్ ను పార్టీ కోశాధికారి పదవి నుంచి ఆ తర్వాత.. పార్టీ సభ్యత్వం నుంచి తొలగిస్తూ శశికళ నిర్ణయం తీసుకున్న రీతిలోనే.. తాజాగా ఆయన పార్టీలో ఇటీవల చేరిన శశికళ బంధువులపై వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తమదే అసలైన అన్నాడీఎంకేనని తేల్చి చెబుతున్నపన్నీర్ సెల్వం.. తాజాగా పార్టీలో చేరిన దినకరన్.. వెంకటేశ్ లను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

2011లో వీరిద్దరిని అమ్మ జయలలిత పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వైనాన్ని గుర్తు చేస్తున్న పన్నీర్.. ఇటీవల పార్టీలోకి చేర్చుకొన్న వీరిపై వేటు వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. తాను జైలుకు వెళుతున్న వేళ.. పార్టీ మీద పట్టు ఉంచుకోవటం కోసం అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా దినకరన్ ను నియమిస్తూ శశికళ నిర్ణయం తీసుకున్నారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. అన్నాడీఎంకేలో ఇప్పటివరకూ ఉప ప్రధాన కార్యదర్శి పదవి అన్నదే లేదు. తాను జైలుకు వెళుతున్న వేళ.. తన తర్వాతి పగ్గాలు ఎవరివన్న విషయంపై క్లారిటీ ఇవ్వటానికి వీలుగా శశికళ ఈ కొత్త పదవిని సృష్టించి బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడతన్ని సస్పెండ్ చేస్తూ పన్నీర్ సెల్వం నిర్ణయాన్ని వెల్లడించారు. మరి.. దీనికి శశికళ వర్గం ఎలా రియాక్ట్ అవుతుందో..? చూస్తుంటే.. ముందు అన్నాడీఎంకే పార్టీ ఎవరిదన్న విషయాన్ని తేల్చే పనిని ఎన్నికల సంఘం మొదలు పెడితే బాగుంటుందేమో.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News