చిన్న‌మ్మ ఫోటో తీసేస్తేనే విలీన‌మ‌ట‌

Update: 2017-04-25 09:48 GMT
త‌మిళ‌నాడు అధికార‌ప‌క్ష‌మైన అన్నాడీఎంకేలో సాగుతున్న అంత‌ర్గ‌త పోరు అంత‌కంత‌కూ మ‌లుపులు తిరుగుతోంది. అమ్మ ప్రాతినిధ్యం వ‌హించిన ఆర్కేన‌గ‌ర్ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక సంద‌ర్భంగా (ప‌లు ఆరోప‌ణ‌లు నేప‌థ్యంలో ఉప ఎన్నిక‌ను వాయిదా వేశారు)  చోటు చేసుకున్న ప‌రిణామాలు తెలిసిందే. ఉప ఎన్నిక వాయిదా ముందు వ‌ర‌కూ.. చిన్న‌మ్మ స్థానాన్ని భ‌ర్తీ చేస్తూ.. చ‌క్రం తిప్పిన ఆమె బంధువు దిన‌క‌ర‌న్‌.. రూ.50 కోట్లు లంచం కేసులో అడ్డంగా బుక్ కావ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో చిన్న‌మ్మ వ‌ర్గానికి చెందిన ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి సైతం ఇరుక్కుపోతారా? అన్న సందేహాలు వ్య‌క్త‌మ‌య్యాయి.

ఇదే స‌మ‌యంలో అనూహ్యంగా.. మాజీ ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం సీన్లోకి వ‌చ్చేసి.. ఇరువ‌ర్గాల రాజీ.. విలీన ముచ్చ‌ట‌ను తెర మీద‌కు తీసుకురావ‌టంతో అన్నాడీఎంకేలో కొత్త చిత్రం తెర మీద‌కు వ‌చ్చింది. అప్ప‌టి నుంచి ప‌న్నీర్ సెల్వం ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వేస్తున్న ఎత్తులు ఇప్ప‌టివ‌ర‌కూ సానుకూల ఫ‌లితాల్ని ఇస్తున్నాయి. సీఎం కుర్చీలో కూర్చోవాల‌ని ఆశ ప‌డుతున్న ప‌న్నీర్‌.. ముందుగా పార్టీ నుంచి చిన్న‌మ్మ శ‌శిక‌ళ‌.. లంచం మ‌చ్చ‌ప‌డ్డ దిన‌క‌ర‌న్ ను పార్టీకి దూరంగా ఉంచాల‌న్న డిమాండ్‌ ను నెగ్గించుకున్న క్ర‌మంలో.. రెండు వ‌ర్గాలు విలీనం చెందాలంటే తాజాగా మ‌రో పాయింట్‌ ను తెర మీద‌కు తీసుకొచ్చారు.

పార్టీకి చిన్న‌మ్మ ఫ్యామిలీని దూరంగా ఉంచాల‌న్న విష‌యం మీద పైచేయి సాధించిన ఆయ‌న‌.. తాజాగా చిన్న‌మ్మ ఫోటోకి ఎస‌రు పెట్టారు. పార్టీకి సంబంధించిన కార్య‌క్ర‌మాల్లో చిన్న‌మ్మ ఫోటోను వాడ‌టాన‌కి వీల్లేద‌ని తేల్చింది. ఈ విష‌యంలో ప‌ళ‌ని వ‌ర్గం ఓకే అంటే.. విలీన చ‌ర్చ‌లు షురూ చేయొచ్చ‌న్న ప్ర‌తిపాద‌న‌ను తెర మీద‌కు తీసుకొచ్చింది. చిన్న‌మ్మ ఫోటోల్ని బ‌య‌ట‌ప‌డేయాల‌ని.. పార్టీ ఆఫీసు ప‌విత్ర‌త‌ను కాపాడాలంటూ ప‌న్నీరు వ‌ర్గానికి చెందిన కీల‌క‌నేత మ‌ధుసూద‌న‌న్ డిమాండ్ చేశారు. చిన్న‌మ్మ ఫ్యామిలీని దూరంగా ఉంచాల‌న్న మాట‌ను నెగ్గించుకున్న ప‌న్నీర్ వ‌ర్గం.. ఇప్పుడు ఆమె ఫోటోను తీసి బ‌య‌ట ప‌డేయాల‌న్న డిమాండ్‌ ను ఎంత‌వ‌ర‌కూ నెగ్గించుకుంటార‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. తాజా ప‌రిణామంపై ప‌ళ‌ని వ‌ర్గం రియాక్ట్ అయ్యే దానికి త‌గ్గ‌ట్లు చిన్న‌మ్మ ఫ్యూచ‌ర్ డిసైడ్ అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News