పన్నీర్ కు మళ్లీ టైమొచ్చిందా..?

Update: 2017-04-20 09:39 GMT
తమిళనాడు రాజకీయాలు గంటకో మలుపు తిరుగుతున్నాయి. సీఎం పీఠమే లక్ష్యంగా పన్నీర్ పావులు కదుపుతుండగా.. తన పీఠాన్ని కాపాడుకోవడానికి పళని స్వామి వ్యూహాలు రచిస్తున్నారు. ఈ రాజకీయ ఆటలో ఎవరు గెలుస్తారన్నది ఈ రోజు తేలిపోతుందని భావిస్తున్నారు.
    
ప్రస్తుతం చెన్నైలోని రాజ్ భవన్ కు రాజకీయాలు చేరాయి.  రెండు రోజులుగా ఆసక్తి రేపుతున్న అన్నాడీఎంకే రాజకీయాలు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు వద్దకు చేరాయి. గవర్నర్ విద్యాసాగరరావును ఎడిప్పాడి పళనిస్వామి వర్గానికి చెందిన లోక్ సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై - ఆర్థిక మంత్రి జయకుమార్ రాజ్ భవన్ లో కలిశారు. ఈ సందర్భంగా తమిళనాడులో చోటుచేసుకుంటున్న తాజా రాజకీయ పరిణామాలపై గవర్నర్ కు వివరించారు. ఈ నేపథ్యంలో తమిళనాట పన్నీరు సెల్వం మాటనెగ్గించుకున్నారన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అన్నాడీఎంకే నుంచి శశికళ - దినకరన్ కుటుంబాలను బహిష్కరించాలని షరతుపెట్టిన పన్నీరు సెల్వం దానిని సాధించుకున్నారు. అనంతరం పార్టీ జనరల్ సెక్రటరీగా తానే కొనసాగాలని డిమాండ్ చేశారు. దీనిని కూడా పళనిస్వామి వర్గం అంగీకరించినట్టు తెలుస్తోంది.
    
అయితే పన్నీర్ అక్కడే బిగ్ ట్విస్ట్ ఇచ్చారని తెలుస్తోంది. పార్టీ జనరల్ సెక్రటరీయే ముఖ్యమంత్రిగా కొనసాగడం సంప్రదాయమని, అంతేకానీ, పార్టీ జనరల్ సెక్రటరీ ఒకరి వద్ద మంత్రిగా వుండే సంప్రదాయం లేదని పన్నీరు సెల్వం వర్గం మెలిక పెట్టగా  విలీన ప్రక్రియ ఆగిపోయింది. పళనిస్వామితో పన్నీరు సెల్వం సమావేశమైన అనంతరం దీనిపై ఒక స్పష్టత వచ్చిందని... ఆ వివరాలు గవర్నరుకు చెప్పేందుకు  తంబిదురై, జయకుమార్ వెళ్లారని... పన్నీర్ సీఎం పీఠంలో కూర్చుంటారని తమిళనాడులో ప్రచారం జరుగుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News