పన్నీర్ నోటి వెంట స్టాలిన్ మాటే వచ్చింది

Update: 2017-02-20 18:04 GMT
ఎన్ని ప్రయత్నాలు చేసినా.. వైరి వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు అనుకున్నంత రాక.. బలపరీక్షలో భారీ ఎదురుదెబ్బ తగిలిన మాజీముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం తన ప్రయత్నాల్లో తాను ఉన్నట్లుగా కనిపిస్తోంది. అన్నాడీఎంకేను అవసరమైతే.. ‘అమ్మ డీఎంకే’గా ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాలు సిద్ధం చేస్తున్న ఆయన.. అన్నాడీఎంకే పార్టీ గుర్తు అయిన రెండాకుల మీద కన్నేసినట్లుగా చెబుతున్నారు.

బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటు చేసుకున్న విషయాలపై గవర్నర్ విద్యాసాగర్ రావుకు ఫిర్యాదు చేశారు పన్నీర్. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు అచ్చు గుద్దినట్లుగా.. విపక్ష నేత స్టాలిన్ చెప్పిన రీతిలోనే ఉండటం గమనార్హం. సభలో స్పీకర్ వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పు పట్టిన పన్నీర్.. మరోసారి బలనిరూపణ పరీక్షకు ఆదేశించాలని కోరారు.

బలపరీక్ష ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరిగిందన్న ఆరోపణ చేసిన ఆయన.. సభలో ప్రధాన ప్రతిపక్షం.. విపక్ష లేకుండా జరిగిన బలపరీక్ష సరికాదన్న వాదనను వినిపించారు. బలపరీక్షను మరో రోజున నిర్వహించాలన్న నిర్ణయాన్ని స్పీకర్ తీసుకోవాల్సి ఉన్నా.. ఆయన అలాంటి పని చేయలేదని ఆరోపించారు. బలనిరూపణ సందర్భంగా సభలో.. ప్రధానప్రతిపక్షంపై జరిగిన దాడిని తీవ్రంగా తప్పు పట్టిన పన్నీర్ బృందం.. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేసింది. తమ ఫిర్యాదుపై గవర్నర్ చర్యలు తీసుకుంటారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. గవర్నర్ దగ్గర పన్నీర్ మాటలన్ని.. అంతకు ముందు స్టాలిన్ చెప్పిన రీతిలో ఉండటం విశేషంగా చెప్పాలి. మరి.. పన్నీర్ అండ్ కో చేసిన వినతిపై గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారన్నది ప్రశ్నగా మారింది.
Tags:    

Similar News