అమ్మ ఇంటి నుంచి వెళ్లగొట్టే పని మొదలైంది

Update: 2017-02-12 05:13 GMT
నిన్నమొన్నటి వరకూ అణిగిమణిగి ఉంటూ.. ఆచితూచి మాట్లాడుతూ.. తనకు అప్పగించిన పనిని మంచి పనోడి మాదిరి పూర్తి చేయటమే తప్పించి.. మరింకేమీ ఆలోచనే ఉందన్న ఇమేజ్ నుసొంతం చేసుకున్న పన్నీర్ సెల్వం.. అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. తన ఎత్తులతో చిన్నమ్మకు చుక్కలు చూపిస్తున్న వైనం.. తమిళుల్ని విపరీతంగా ఆకర్షిస్తోంది.

మంచి విధేయుడు.. అమ్మ చేతిలో కీలుబొమ్మ.. ఆమె చెప్పినట్లుగా వినే రిమోట్ అన్న బిరుదుల్ని సొంతం చేసుకున్న వ్యక్తి.. ఎంతలా చెలరేగిపోతున్నారో చూసినోళ్లంతా నోరు వెళ్లబెట్టే పరిస్థితి. చిన్నమ్మ నుంచి సీఎం కాకుండా చేసేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చినట్లుగా చెప్పాలి. తాను ముఖ్యమంత్రిని కావాలన్నతపనతో పాటు.. ఎట్టి పరిస్థితుల్లోనూ చిన్నమ్మకు ముఖ్యమంత్రి కుర్చీ అందకూడదన్న రీతిలోఆయన వేస్తున్న ఎత్తులతో పన్నర్ ఇమేజ్ మొత్తంగా మారిపోయింది.

సీఎం పదవికి చిన్నమ్మ చేరువకాకుండా చేయటంలో కొంతమేర విజయం సాధించిన పన్నీర్.. ఇప్పుడు ఆమెకు మరో భారీ దెబ్బ వేసే పనిని ముమ్మరం చేశారు. తన నోటి నుంచి ఏదైనా మాట వస్తే.. అంత తేలిగ్గా వదిలిపెట్టనన్న విషయాన్ని తాజాగా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయని చెప్పాలి. అమ్మ నివసించిన పోయెస్ గార్డెన్ లోని వేద నిలయంలో.. అమ్మ మరణం తర్వాత చిన్నమ్మ అదే ఇంట్లో ఉండటం తెలిసిందే. ఆ ఇంట్లో ఉంటే.. చిన్నమ్మకున్న వాస్తవ బలానికి మించిన బలాన్ని ఇస్తుందన్న విషయాన్ని అర్థం చేసుకున్న పన్నీర్.. ఇప్పుడా ఇంటి నుంచి చిన్నమ్మను బయటకు పంపే పనిని మొదలెట్టారు.

ఇందులో బాగంగా మూడు రోజుల క్రితం.. వేదనిలయాన్ని  అమ్మ స్మారకంగా మారుస్తామని ప్రకటించిన ఆయన.. అందుకు తగ్గట్లే తాజాగా ఆ పనిని మరింత ముమ్మరం చేశారు. వేదనిలయాన్నిఅమ్మ స్మారకంగా మార్చాలన్న డిమాండ్ ను మరోసారితెర మీదకు తీసుకొస్తూ.. అందుకు సంతకాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ డిమాండ్ పై తొలి సంతకాన్ని పన్నర్ చేయటం గమనార్హం.

పన్నర్ అనంతరం అన్నాడీఎంకే సీనియర్ నేతలు ఒకరి తర్వాత ఒకరుగా సంతకాలు చేశారు. ఇలా చేసిన వారు 2వేల మంది కావటం గమనార్హం. గంటల వ్యవధిలోనే ఈ సంతకాల కార్యక్రమా ఊపందుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే శ్రేణులు.. ప్రజల సంతకాల్ని ఈ అంశంపై సేకరించనున్నట్లు వెల్లడించారు. 1972 మే 15న తన సొంత డబ్బుతో జయలలిత పోయెస్ గార్డెన్ లో వేదనిలయాన్ని నిర్మించుకున్నారు. ఆమె సొంతంగా నిర్మించుకున్న ఆ ఇంటిని ఆమె స్మారకంగా మార్చాలన్న నిర్ణయం సబబుగా చెప్పక తప్పదు.
Tags:    

Similar News