బీజేపీలోకి ప‌న్నీర్ సెల్వం

Update: 2017-04-24 04:47 GMT
తమిళనాడులో జరుగుతున్న రాజ‌కీయ పరిణామాల్లో మ‌రో కొత్త వార్త తెర‌మీద‌కు వ‌చ్చింది. అంత‌ర్గ‌తంగా త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌పై క‌న్నేసిన బీజేపీ పైకి మాత్రం ఆ రాష్ట్రంలోని రాజ‌కీయాల‌పై తమకేం సంబంధం లేదని అంటున్న సంగ‌తి తెలిసిందే. అయితే బీజేపీ నేతలు పైకి అలా ప్ర‌క‌టిస్తున్న‌ప్ప‌టికీ దూరదృష్టితో పావులు కదుపుతున్నట్లు స‌మాచారం. తమిళనాడు ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించి రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలనుకుంటోంద‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా త‌మిళ‌నాడు దివంగ‌త సీఎం జయలలితకు అత్యంత విధేయుడిగా పేరొందిన మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వంపై దృష్టి సారించిందనేది తాజా టాక్‌.

ప్ర‌స్తుత స‌మీక‌ర‌ణాల నేప‌థ్యంలో ప‌న్నీర్ సెల్వం సీఎం పీఠం అదిరోహించేందుకు కేంద్రం పూర్తిగా మద్దతునిస్తుందనే అభిప్రాయం ఉంది. ప్రస్తుతం సెల్వం బలపడినందున ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు కొందరు ఆయన వైపు వస్తారని బీజేపీ అంచనా వేస్తోంది. అనంత‌రం ఆయ‌న‌కు బీజేపీ పూర్తి స‌హాయ స‌హ‌కారాలు అందించ‌నున్న‌ట్లు చెప్తున్నారు. ఈ మిత్రుత్వంతో 2019లో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాల్లో 15 స్థానాలను గెలుచుకోవాలని బీజేపీ ఆశిస్తోందని అంటున్నారు. ఇతర పార్టీల నుంచి కొందరు నేతలను తీసుకుని విస్తరించాలని కమలనాథులు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

మ‌రోవైపు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, త‌మిళ‌నాడు ప్ర‌తిప‌క్ష నేత ఎంకే స్టాలిన్‌ పై కేంద్ర సమాచారశాఖ మంత్రి వెంకయ్యనాయుడు ఆదివారం మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ బినామీ ప్రభుత్వమే తమిళనాడులో కొనసాగుతున్నదని స్టాలిన్ వ్యాఖ్యానించడాన్ని వెంకయ్య తప్పుబట్టారు. లోగడ యూపీఏ హయాంలో డీఎంకే నడిపింది కాంగ్రెస్ పార్టీ బినామీ ప్రభుత్వమా? అని ప్రశ్నించారు. త‌మిళ‌నాడు రాజ‌కీయాల‌ను తాము ప్ర‌భావితం చేయ‌డం లేద‌ని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News