ఆంధ్రోళ్ల‌కు పోటీ వ‌చ్చిన ప‌ప్పు!

Update: 2018-03-21 08:37 GMT
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు..జాతీయ స్థాయిలోనూ రాజ‌కీయం అంతకంత‌కూ వేడెక్కుతోంది. ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం ఏపీకి చెందిన అధికార‌.. విప‌క్షం  మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్ట‌టం.. తీర్మానాన్ని ఇవ్వ‌టం.. స‌భ సాగ‌టం లేదంటూ వాయిదా వేయ‌టం తెలిసిందే. ఏపీకి ప్ర‌త్యేక హోదాకు తాము మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు చెప్పిన టీఆర్ఎస్ లాంటి పార్టీ సైతం.. అవిశ్వాస తీర్మానం చ‌ర్చ‌కు రాకుండా అడ్డుకుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా ఆంధ్రోళ్లు అడుగుతున్న ప్ర‌త్యేక హోదా డిమాండ్‌ కు పోటీగా.. బీహార్ సీనియ‌ర్ నేత‌.. ఎంపీ ప‌ప్పు యాద‌వ్‌ సీన్లోకి వ‌చ్చారు. అప్పుడ‌ప్పుడు తెర మీద‌కు వ‌చ్చే బిహార్ కు ప్ర‌త్యేక హోదా అంశాన్ని తాజాగా ఆయ‌న తెర మీద‌కు తెచ్చారు. బిహార్ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఇచ్చేందుకు లోక్ స‌భ‌లో అత్య‌వ‌స‌ర చ‌ర్చ జ‌ర‌పాల‌ని కోరుతూ ఆయ‌న ఈ రోజు (బుధ‌వారం) లోక్ స‌భ సెక‌ట్ర‌రీ జ‌న‌ర‌ల్‌ కు నోటీసులు ఇచ్చారు.

త‌మ రాష్ట్రాభివృద్ధికి కేంద్రం త‌గిన నిధులు ఇవ్వ‌టం లేద‌ని ఆయ‌న ఆరోపించారు. ఓప‌క్క ఏపీ విప‌క్షం వైఎస్సార్ కాంగ్రెస్ తొలుత అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వ‌టం.. దానికి పోటీగా ఏపీ అధికార‌ప‌క్షం అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చిన సంగ‌తి తెలిసిందే. అవిశ్వాస తీర్మానానికి పెద్ద ఎత్తున ఎంపీల మ‌ద్ద‌తు తెలిపినా.. స‌భ‌లో చ‌ర్చ‌కు వ‌చ్చే విష‌యంలో వ్యూహాత్మ‌క చ‌ర్య‌లు చోటు చేసుకుంటున్న‌ట్లుగా అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇలాంటివేళ‌.. బిహార్ కు ప్ర‌త్యేక హోదాఇవ్వాలన్న అంశంపై అత్య‌వ‌స‌ర చ‌ర్చ జ‌ర‌పాలని కోరుతూ ప‌ప్పు యాద‌వ్ నోటీసులు ఇవ్వ‌టం చూస్తుంటే.. ఆంధ్రోళ్ల హోదాకు చెక్ పెట్టేందుకేనా? అన్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.
Tags:    

Similar News