ఆ బీజేపీ మ‌నిషి ఇంకా బాబుతోనే ఉన్నాడే!

Update: 2018-04-16 10:53 GMT
ఔను. 2019లో మ‌ళ్లీ బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకోనుంద‌ట‌. ఈ మేర‌కు ఇటు బీజేపీ, అటు టీడీపీ అధినేత చంద్ర‌బాబుతో స‌హా ఆ పార్టీ నేత‌లు లెక్క‌లు వేసుకుంటున్నార‌ట‌. ర‌క‌ర‌కాల లెక్క‌ల ప్ర‌కారం జ‌రిగే ఈ కొత్త దోస్తీని దృష్టిలో ఉంచుకునే చంద్ర‌బాబు ఇప్ప‌టికీ ఓ ప్ర‌ముఖుడిని త‌న కోట‌రీలో ఉంచుకుంటున్నార‌ట‌. ఇంత‌కీ ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రంటే...ఏపీ ప్ర‌భుత్వ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ అని రాజ‌కీయ వ‌ర్గాలు అంటున్నాయి.

2014 ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొన‌సాగించి ఇటీవ‌లే ఆ బంధానికి టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు బైబై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. త‌న పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రుల‌తో సైతం ఆయ‌న రాజీనామా చేయించారు. పొత్తు విక‌టించిన అనంత‌రం బీజేపీపై బాబు భ‌గ్గుమంటున్నారు. అదే స‌మ‌యంలో రాబోయే కాలంలో ఢిల్లీలో చ‌క్రం తిప్ప‌బోయేది తానేన‌ని ప్ర‌క‌టిస్తున్నారు. బాబు చేస్తున్న ఈ ప్ర‌క‌ట‌న‌లతో పాటు మ‌రో అంశాన్ని విశ్లేష‌కులు గ‌మ‌నిస్తున్నారు. అదే ఏపీ మీడియా స‌ల‌హాదారు ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్‌ను ఆ ప‌దవిలో కొన‌సాగించ‌డం.

ప‌ర‌కాల స‌తీమ‌ణి నిర్మ‌లా సీతారామ‌న్ కేంద్రంలో కీల‌క‌మైన ర‌క్ష‌ణ శాఖ మంత్రి హోదాలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధాని మోడీ టీంలోని ముఖ్యుల్లో ఆమె ఒక‌రు. ఈ ర‌క‌మైన అంశాల‌న్నీ ఉన్న‌ప్ప‌టికీ ప‌ర‌కాల‌ను మాత్రం చంద్రబాబు ప‌ద‌వీ విచ్యుతుడిని చేయ‌డం లేదు. దీని వెనుక రాబోయే ఎన్నిక‌ల వ్యూహం ఉందని చెప్తున్నారు. ప్ర‌స్తుతం దేశవ్యాప్తంగా వీస్తున్న బీజేపీ వ్య‌తిరేక గాలి వ‌ల్ల‌..ఆ పార్టీకి 2014లో వ‌చ్చిన‌న్ని ఎంపీ సీట్లు తిరిగి రావ‌నే ప్ర‌చారం ఉంది. అలాంటి స‌మ‌యంలో ప్రాంతీయ‌ రాజ‌కీయ పార్టీల‌ మ‌ద్ద‌తు చాలా ముఖ్యం. ఈ విష‌యాన్ని టీడీపీ పెద్ద‌లు సైతం గ‌మ‌నించార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో 2019లో ఎదుర‌య్యే రాజ‌కీయ అవ‌స‌రాల కోణంలో...అవ‌స‌ర‌మైతే బీజేపీతో పొత్తుకు సైతం ఒకే చెప్పేందుకు ప‌ర‌కాల‌ను ఇంకా త‌న సన్నిహితుల జాబితాలో చంద్ర‌బాబు ఉంచుకున్నార‌ని అంటున్నారు. అయితే బీజేపీకి నిజంగానే ఎంపీ సీట్లు త‌క్కువ‌గా వ‌స్తాయా? చంద్ర‌బాబు మ‌ళ్లీ పొత్తు పెట్టుకుంటారా? అనే సందేహాల‌కు కాల‌మే స‌మాధానం చెప్తుంద‌నేది విశ్లేష‌కుల మాట‌.
Tags:    

Similar News