పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇచ్చే పేరెంట్స్ దీన్ని చదవాల్సిందే

Update: 2022-12-13 05:06 GMT
అనుకోకుండా జరిగే తప్పుల్ని వెంటనే ఒప్పుసుకోవటం.. ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకోవటంచాలా అవసరం. మహా అయితే తిడతారు లేదంటూ దండిస్తారు. దానికి భయపడి చేయకూడని తప్పులు చేయటం ద్వారా మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోవటం ఏ మాత్రం సరికాదు. ఆ విషయం పిల్లలకు తెలియకపోవచ్చు. కానీ.. పెద్దలు అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. తాజాగా ఏపీలో చోటు చేసుకున్న ఉదంతం గురించి తెలిస్తే గుండె గుభేల్ అనటమే కాదు.. పిల్లలకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయంపై ఒక అవగాహనకు రావటం ఖాయం. అసలేం జరిగిందంటే..

గుంటూరులో ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే ఒక అమ్మాయి ఉంది. ఆమెది అక్కడికి దగ్గర్లోని ఒక గ్రామం. ఆమె తండ్రి ఆమెకు తన స్మార్ట్ ఫోన్ ను వాడుకునేందుకు ఇచ్చారు. ఆ ఫోన్ లోని ఫోన్ పే యాప్ కు తండ్రి బ్యాంక్ ఖాతా లింకు చేసి ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన ఆ టీనేజర్.. తన తండ్రికి తెలీకుండా ఖరీదైన దుస్తులు.. వాచీలు కొనేందుకు రూ.80 వేలు ఖర్చు చేసింది. మళ్లీ తండ్రి ఖాతాలో జమ వేయటానికి ఆమెకు మార్గం దొరకలేదు.

దీంతో ఆన్ లైన్ లో కిడ్నీ అమ్మితే డబ్బులు వస్తాయని స్నేహితులు చెబితే అమాయకంగా నమ్మేసి వెతకసాగింది. అందులో ఒకరు కిడ్నీ అత్యవసరమని రూ.7 కోట్లు ఇస్తామంటూ ఊరించే ఆఫర్ ఇవ్వటమే కాదు.. ఒక ఆసుపత్రి పేరు.. డాక్టర్ పేరును అందులో పేర్కొన్నారు. దీంతో నమ్మేసిన బాధితురాలు తన కిడ్నీ అమ్మటానికి ఒప్పుకుంది. డీల్ లో భాగంగా మొదట కిడ్నీ అమ్మటానికి ఒప్పుకున్నందుకు రూ.3.5కోట్లు.. ఆపరేషన్ తర్వాత రూ.3.5కోట్లు ఇస్తామన్నారు. అందుకు ఆమె ఓకే చెప్పటం.. వారు చెప్పినట్లుగా వైద్య పరీక్షలు చేయించుకొని రిపోర్టులు మొయిల్ లో పంపింది.

వాటిని చూసిన వారు అంతా బాగుందని చెప్పి.. మొదటి విడత డబ్బులు వేస్తామన్నారు. దీంతో తనకు ప్రత్యేకంగా బ్యాంకు అకౌంట్ లేకపోవటంతో.. తండ్రికి ఉన్న ఫోన్ పే అకౌంట్ వివరాల్ని ఇచ్చేసింది. ఆ ఖాతాకు రూ.3.5 కోట్లు పంపినట్లుగా స్క్రీన్ షాట్ పంపారు. అకౌంట్ లో చెక్ చేస్తే.. డబ్బులు రాలేదని తెలిసింది. అదే విషయాన్ని అడిగితే.. డాలర్లలో డబ్బులు పంపామని..

రూపాయిల్లోకి మారటానికి సమయం పడుతుందని చెప్పారు.  ఇలా రూ.3.5కోట్లు వస్తాయంటూ దాదాపుగా ఆమె నుంచి రూ.16 లక్షలు తీసుకున్నారు. దీంతో నిలదీయగా.. రూ.10వేలు పంపి మిగిలిన రూ.3.5 కోట్లు వస్తాయని నమ్మబలికారు. తనను మోసం చేశారని తెలుసుకొని ఇంట్లో నుంచి పారిపోయింది.

దీంతో తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమెను వెతికి పట్టుకున్న పోలీసులు ఆరా తీయగా.. మొత్తం విషయం బయటకు వచ్చింది. దీంతో.. కేసు నమోదు చేసి సైబర్ క్రైంకు అప్పగించారు. సో.. పిల్లల చేతికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేటప్పుడు మాత్రమే కాదు ఇచ్చిన తర్వాత కూడా ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నది మర్చిపోకూడదు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News